వ్యవసాయ రంగం (Agriculture sector) పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. రోజురోజుకూ వ్యవసాయాన్ని వదిలి గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళి కూలీ నాలి చేసుకొనే దుఃస్థితిలో రైతులున్నారు. పంటలు దెబ్బతింటే నష్ట పరిహారం అందక, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు వెళ్ళక, తెచ్చిన అప్పులు తీర్చలేక, మానసిక ఒత్తిడికి గురై రాష్ట్రంలో ప్రతి యేటా 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. వీటికి ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం. అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు అడుక్కోవలిసిన అధోగతి వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021–22 నాటి వ్యవసాయ ప్రణాళికను ప్రకటించటం నిలిపివేసింది. దాన్ని నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది.
2014 నుండి 2025 వరకు కరువులు, వరదల వలన ప్రతిసంవత్సరం పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో రైతుల్లో అయోమయ స్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక కమిషన్ (2015–20), 15వ ఆర్థిక కమిషన్ (2020–25) ద్వారా ప్రకృతి వైపరీత్యాల వలన నష్ట పోయిన రైతులకు పరిహారం ప్రకటించింది. అయినా, ఇప్పటి వరకు సక్రమంగా రైతులకు అది అందకపోవడం విచారకరం. 2023లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ప్రకృతి వైపరీత్యాల సహాయం కొరకు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాసింది. కేంద్ర బృందాలు వచ్చి, పరిశీలించి వెళ్ళాయి తప్ప, ఎలాంటి సహాయం ఇవ్వలేదు. 2021–26 సంవత్సరానికి 15వ ఆర్థిక కమిషన్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి 1.61 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణకు మాత్రంఅందులో కేవలం రూ. 2,872 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం రికమండ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. రాష్ట్రంలో కల్తీ విత్తన వ్యాపా రులపై పీడీ యాక్ట్ పెడతామని గొప్పగా ప్రకటించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఒక్క లైసెన్సును కూడా రద్దు చేయలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందించలేకపోతోంది. దీనికితోడు కృత్రిమ కొరతను సృష్టించి ఎరు వుల ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారు వ్యాపారులు. కేంద్రం ఎరువులపై సబ్సిడీ బాగా తగ్గించడంతో ధరలు విపరీతంగా పెరుగు తున్నాయి. 2022–23లో కేంద్రం రూ. 2,51,369 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2025–26లో రూ. 1,67,227 కోట్లకు సబ్సిడీని తగ్గించింది. ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేయా లని ప్రచారం చేస్తూనే మరోవైపు నానో యూరియా, నానో డీఏపీ లను ఉత్పత్తి చేసి ధరలు పెంచారు.
(బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్)
రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుండగా... బ్యాంకులు 42 లక్షల మందికే రుణాలిస్తున్నాయి. మిగిలిన వారు ప్రైవేటు రుణాలు తెచ్చుకుంటున్నారు. వారంతా 5 ఎకరాలు లోపు ఉన్న... సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందా లంటే పాలకులు కండ్లు తెరిచి, వ్యవసాయ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు సూచించిన ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి. రైతు సమస్యలను పరిష్కరించటానికి అన్ని రకాల చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలి.
-జూలకంటి రంగారెడ్డి
మాజీ శాసన సభ్యులు, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు


