పట్నా: పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో బీజేపీ తన హవాను కొనసాగుతోంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ప్రస్తుత ఓట్ల లెక్కింపులో బీజేపీ జోష్ మీద ఉంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నెక్ట్స్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బిహార్‌లో అవినీతి, దోపిడీ,అరాకచక ప్రభుత్వానికి చోటు లేదని ప్రస్తుత ఆధిక్యం నిరూపి స్తోందని పేర్కొన్న గిరిరాజ్ సింగ్ రాష్ట్ర యువత తెలివైంది అంటూ ప్రశంసించారు. ఇది అభివృద్ధి సాధించిన విజయం. ప్రజలు శాంతి, న్యాయం,అభివృద్ధిని ఎంచుకున్నారు. నేటి యువత మునుపటి రోజులను చూడకపోయినా, వారి పెద్దలు చూశారు. వారినుంచి తెలుసుకున్నారు. అలాగే అరాచకంగా కొనసాగిన తేజస్వి యాదవ్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూశారని ఎద్దేశా చేశారు.
బిహార్‌ను గెల్చుకున్నాం. ఇపుడిక బెంగాల్ వంతు అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద చాలెంజ్ విసిరారు. అక్కడున్నది అరాచక ప్రభుత్వం అంటూ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం 243 మంది సభ్యులు గల బిహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 122 సీట్ల మెజారిటీ మార్కునుఅధిగమించింది ప్రస్తుతం 160 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. పోల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాన్ సూరాజ్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వరుసగా ఐదోసారి తన పదవిని దక్కించుకుంటారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఇదే జోరు బిహార్‌లోనూ కనిపిస్తోంది.


