
విశ్లేషణ
నేపాల్‌ను ఈ నెల 8, 9వ తేదీలలో తీవ్రంగా కుదిపివేసిన నిరసనలు, హింసాకాండ శాంతించి ఉండవచ్చు. నిరసనలకు నాయకత్వం వహించిన ‘జెన్–జడ్’ ఉద్యమకారులకూ, సైన్యానికీ మధ్య చర్చలు ఫలించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ, ఒక దేశంగా నేపాల్ ప్రస్తుతం ఒక అతి క్లిష్టమైన స్థితికి చేరింది.
వందల సంవత్సరాల రాచరిక పాల నను కూలదోసి ప్రజాస్వామికంగా మారిన ఒక దేశం, సుస్థిరంగా అదే వ్యవస్థలో కొనసాగాలంటే ముఖ్యంగా కావలసిందేమిటి? లోపాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం పొంది, స్థిరపడి కొనసాగటం! అది జరగ నప్పుడు అనివార్యంగా వ్యక్తి నియంతృత్వాలు, వర్గ నియంతృత్వాలు, సైనిక నియంతృత్వాలు ఏర్పడతాయి.
రాచరికం 2008లో పోయిన తర్వాత ఈ 17 ఏళ్లలో అక్కడి మూడు పార్టీలు కూడా స్వయంగానో, పరస్పరం చేతులు కలిపో పరిపాలించాయి. ప్రజల విశ్వాసాన్ని పొందటంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. నిరసనకారులు మూడు పార్టీల నాయకుల ఇళ్ల పైనా దాడులు జరిపారు. దీనంతటి మధ్య ఆశాకిరణం–ఉద్యమ కారులు మౌలికంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోకపోవటం, స్వయంగా సైన్యం ప్రజాస్వామ్యాన్ని కూలదోయక పోవటం!
బద్దలైన నిరసనలు
నిరసనలు అనూహ్యంగా, అకస్మాత్తుగా సోషల్ మీడియాపై నిషేధం అనే చర్య నుంచి మొదలయ్యాయి. సాధారణంగా నిరస నలు, ముఖ్యంగా యువతరం నుంచి, నిరుద్యోగం, అవినీతి, బంధు ప్రీతి వంటి అంశా లపై జరగటం మనకు తెలుసు. కానీ నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో మొదలై, ఆ తర్వాత తక్కిన అంశాలు వచ్చి చేరాయి. ఆ విధంగా, అక్కడి సమాజంలో సోషల్ మీడియాకు, ఇతర అంశాలకు అటువంటి అవినాభావ సంబంధం ఉంది.
అది భారతదేశంలో కనిపించే స్థితికి భిన్నమైనది. ఇపుడు వెలుగులోకి వస్తున్న దానిని బట్టి, అక్కడి యువతరానికి నిరసనలకు సోషల్ మీడియా నిరంతర వేదికగా మారింది. దానితోపాటు, ఇతర దేశా లకు వలసపోయిన దాదాపు 25 లక్షలమంది నేపాలీలు అక్కడి నుంచి తమ వారికి చేస్తున్న ఆన్‌లైన్ నగదు బదిలీలకు కూడా! ఆ విధంగా ఆ నిషేధం పట్ల నిరసనలు, ఇతరత్రా పేరుకుపోతూ వస్తున్న నిరసనలు కలిసి అగ్ని పర్వతం వలె పేలేందుకు దోహద మయ్యాయి.
ఇది ఒకటి కాగా, గత 17 ఏళ్లుగా పాలించిన అన్ని ప్రధాన పార్టీలలో ఏవీ ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయాయి. ఈ దోషం, వైఫల్యం ముఖ్యంగా వామపక్షాలవి కావటం గమనించ దగ్గది. అట్లా భావించటం ఎందువల్ల? రాచరికం నుంచి పరిమిత ప్రజాస్వామ్యం వైపు సంస్కరణల మార్గంలో ఇతర పార్టీలు ప్రయ త్నించగా, మావోయిస్టు పార్టీ పదేళ్ల పాటు రాజీలేని సాయుధ పోరాటం నడిపి రాచరిక వ్యవస్థనే అంతం చేసింది.
అటువంటపుడు ఆ పార్టీగానీ, అంతకు ముందునుంచీ ప్రధాన స్రవంతిలో గల ఇతర కమ్యూనిస్టులు, సోషలిస్టులు గానీ ఏమి చేయాల్సింది? ప్రపంచంలోనే అతి పేద దేశాలలో ఒకటైన నేపాల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం, అంకితభావంతో కృషి చేయాలి. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలి. తమ ఐక్యతను కొనసాగించి సుస్థిర పాలన సాగించటం మూడవ అవసరం. ఈ మూడూ జరిగి ఉంటే అసంతృప్తికి ఆస్కారమే ఉండేది కాదు.
విశ్వాసం కోల్పోయిన పార్టీలు
నేపాల్‌లో అనేక పార్టీలు ఉన్నా, ప్రధానమైనవి మూడు: మధ్యే మార్గపు నేపాలీ కాంగ్రెస్, గతం నుంచి ఉన్న సాంప్రదాయిక కమ్యూ నిస్టు పార్టీ, రాచరికంపై పోరాడిన మావోయిస్టు పార్టీ. తక్కిన పార్టీ లలోనూ ఎక్కువ వామపక్ష మార్గం లోనివే. 2008లో రాచరికం పోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచి, మావోయిస్టు నాయ కుడు పుష్పకమల్ దహాల్ లేదా ప్రచండ ప్రధాని అయ్యారు.
పరిపాలనలో విఫలమయ్యారు. ఏడాదికే పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. తన పార్టీ కూడా చీలిపోయింది. పరిపాలన ద్వారా సామా జిక మార్పులు, సమానత్వాలు కూడా తీసుకు రావాలని పట్టుబట్టిన ప్రచండ ప్రధాన సహచరుడు, జేఎన్‌యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి బాబూరాం భట్టరాయ్ వేరే పార్టీ ప్రారంభించాడు. అప్పటి నుంచి నేపాల్‌లో ఇక రాజకీయ సుస్థిరత లేకపోయింది.
17 ఏళ్ళలో మొత్తం 14 మంది ప్రధానులు వచ్చారు. కొందరు మళ్లీ మళ్లీ అయ్యారు. వారిలో ఎక్కువసార్లు వామపక్షాల వారే. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి సుశీల కర్కీ పేరు వినవస్తున్నది. గతంలోనూ ఒకసారి ఇదే విధంగా జస్టిస్ ఖిల్‌రాజ్ రెగ్మీ (2013–14) నియమితులయ్యారు. ఇటువంటి నియామకాలు రాజకీయ అస్థిరతకు మరొక గుర్తు అవు తున్నాయి. అస్థిరతవల్ల పెట్టుబడులు రావటం లేదు.
ఆశ్చర్యకరంగా అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన జీవితం లాంటి ఆరోపణలను మావోయిస్టు ప్రచండ తన మొదటి పాలనా కాలంలోనే ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి అన్ని ప్రభు త్వాలూ ఈ విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. అయినా సరైన విచారణలు, శిక్షలు లేకుండా పోయాయి. నిరుద్యోగం, పేదరికం విషయానికి వస్తే ఒక విచిత్ర స్థితి కనిపిస్తుంది. మూడు కోట్ల జనాభాలో సుమారు పావు కోటి మంది వలసలు పోయి పనులు చేసుకుంటున్నందున ఆ వర్గాల్లో స్థానికుల నిరుద్యోగం సుమారు 10 శాతం. కానీ యువతరంలో 20 శాతంగా ఉంది.
అందుకు కారణం నైపుణ్యాలు నేర్పే చదువులు గానీ, స్థానిక పరిశ్రమలు గానీ లేక పోవటం. యువత తిరుగుబాటుకు ఇదీ ఒక ముఖ్య కారణం. పోతే, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం పేదరికం 2022లో 7.5 శాతం కాగా, 2025లో 5.6కు తగ్గుతుందని అంచనా. అయితే, విపరీతమైన వలసలు, వారు పంపే డబ్బు ఈ విధంగా తక్కువ పేదరికానికి కారణమైంది. నిజంగా పేదరికం 25 శాతమని అంచనా.
అక్కడ భూకంపాలు ప్రాకృతికమైన సహజ విపత్తు కాగా,ఇంకా 20 ఏళ్లయినా నిండని ఆ ప్రజాస్వామ్యానికి రాజకీయ అస్థిర తలు నాయకులు సృష్టించే విపత్తులుగా మారాయి. అన్ని పార్టీలూ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినందున రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ స్థానాన్ని ఆక్రమించగల కొత్త పార్టీలు కనీసం ఉనికిలోకైనా రాలేదు. ఉద్యమకారులకు ఆగ్రహం, ఆకాంక్షలు మినహా విధానపరంగా, ఆచరణపరంగా ఎటువంటి ఆలోచనలూ లేవు.
ప్రస్తుత రాజకీయ శూన్యాన్ని పూరించగలవారెవరూ కన్పించటం లేదు. రాజ వంశీకు లకు పునరాగమనపు ఆశలున్నా ప్రజలు ఆమోదించే అవకాశం లేదు. ఇవన్నీ ఒక విధమైన క్లిష్ట స్థితి కాగా, స్థానికంగా ఆర్థికాభివృద్ధి ప్రశ్నకు తోడు ఇవన్నీ ఎన్నటికి జరిగేనన్నది మరొక క్లిష్ట స్థితి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు