ఏకాకిని చేయడమే ట్రంప్‌ లక్ష్యం | Sakshi Guest Column On Donald Trump | Sakshi
Sakshi News home page

ఏకాకిని చేయడమే ట్రంప్‌ లక్ష్యం

Sep 3 2025 1:08 AM | Updated on Sep 3 2025 1:08 AM

Sakshi Guest Column On Donald Trump

కామెంట్‌

కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. 

రష్యన్‌ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్‌పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్‌ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?

ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?

ఇది ప్రతీకారం కాదా?
ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్‌ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ ఆరోపించడం. భారత్‌పై ఆంక్షలు విధించాలని యూరప్‌ను బిసెంట్‌ కోరారు. రష్యన్‌ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్‌ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో చెప్పారు. 

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?

భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్‌ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్‌ఫర్‌ సంస్థ మాజీ చైర్మన్‌ జార్జ్‌ ఫ్రైడ్‌మ్యాన్‌ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్‌ పక్షాన చేర బోమనే ట్రంప్‌ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్‌మ్యాన్‌ చెప్పారు. ట్రంప్‌ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.

ఫ్రైడ్‌మ్యాన్‌ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్‌ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. 

ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!
అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్‌ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్‌1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లట్‌నిక్‌ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్‌ పరిశీలిస్తున్నారు. 

ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్‌ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్‌కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్‌ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. 

ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్‌ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?

ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్‌కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.

సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్‌కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. 

మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్‌ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement