సందర్భం
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే!
అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది.
అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం.
రష్యా పుట్టిస్తున్న దడ
ట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది.
కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం.
ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్‌ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది.
‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితి
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్‌లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది.
అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్‌లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్‌ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్‌కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా?
నిరాయుధీకరణే దారి
పాకిస్తాన్‌తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్‌లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్‌షిప్ నెట్‌వర్క్ (ఏపీఎల్‌ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది.
వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్


