
నేటి నుంచి అమలులోకి వస్తున్న జీఎస్టీ 2.0
విశ్లేషణ
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఇటీవలి 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రకమైనవి. జీఎస్టీ రెండవ అధ్యాయానికి అంకు రార్పణగా దాన్ని అభివర్ణించినా తప్పు లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చిన ఏడేళ్ళ తర్వాత, వినియోగంపై వేసిన ఈ లెవీని సంస్కరించేందుకు పెద్ద ప్రక్షాళననే చేపట్టారు. ఇంతవరకు ఉన్న నాలుగు ప్రధాన పన్ను శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి రెండు శ్లాబులు కానున్నాయి. అధిక విలాస వస్తువులు, పొగాకు వంటి ‘వ్యసనాల’ వస్తువులపై కొత్త శ్లాబు రేటు ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందున్న పన్నుల రేట్లు, ‘సక్రమమైన, సరళమైన’ పన్నుగా జీఎస్టీకున్న స్ఫూర్తిని దెబ్బతీశాయి. కనుక, రెండు రేట్ల పద్ధతికి మారడం స్వాగతించదగిన పరిణామం.
గతంలోని 12%–28% రేట్లను రద్దు చేసి 5%–18% రేట్లను అట్టేపెట్టారు. మొత్తం జీఎస్టీ రాబడిలో మూడింట రెండొంతుల భాగాన్ని 18% రేటు ఇప్పటికే తెచ్చిపెడుతోంది. ఆదాయంలో 7% భాగం 5% శ్లాబు ద్వారా లభిస్తోంది. అలాగే 12% శ్లాబు 5% ఆదాయానికి, 28% శ్లాబు 11% ఆదాయానికి కారణమవుతున్నాయి. ఇపుడు 18% శ్లాబు జీఎస్టీ రాబడిలో మరింత ఎక్కువ భాగాన్ని తెచ్చిపెట్టబోతోంది. అయితే, రెండు రేట్లుగా సరళీకరించిన పద్ధతి సమమితిగా సాగలేదు. ఏం చేశారంటే 12% కేటగిరీలోని చాలా వస్తువులను 5% లోకి, 28% వర్గంలోని చాలా వాటిని 18% వర్గంలోకి తెచ్చారు. అధిక పన్ను రేటులోకి చాలా తక్కువ వస్తువులే వెళ్ళాయి. మొత్తం మీద పన్ను భారం లేదా ఈ లెవీకి సంబంధించిన ప్రభావశీల పన్ను రేటు తగ్గింది. ఇది వినిమయ వ్యయాన్ని పెంపొందించే ద్రవ్య ఉద్దీపనగా ఉపకరించవచ్చు.
చాలా భాగం వస్తువులు తక్కువ పన్ను రేట్లకి తరలిపోవడం వినియోగదారుల కోణం నుంచి ద్రవ్య ఉద్దీపన కావచ్చుకానీ, ప్రభు త్వానికి మాత్రం రాబడిలో లోటు ఏర్పడుతుంది. అయితే, దానివల్ల ఏర్పడే లోటు కన్నా, వినియోగదారుల అధిక వ్యయం వల్ల ఒనగూడగల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘ల్యాఫర్ కర్వ్ ఎఫెక్ట్’ అంటారు. సూటిగా చెప్పాలంటే, పన్ను రేటు తగ్గింపు పన్ను వసూళ్ళ పెరుగుదలకు దారితీస్తుంది. కానీ, భారతదేశం విషయంలో దీన్ని సిద్ధాంతపరంగా అన్వయించి చూడలేం. అనుభవంలో మాత్రమే అసలు విషయం తెలుస్తుంది.
రెండు ఇబ్బందులు
జీఎస్టీ వ్యవస్థలోని రెండు అంశాలు ఇప్ప టికీ వేధిస్తూనే ఉన్నాయి. ఇది పరోక్ష పన్ను. తిరోగమనదాయకమైనది కావడం వల్ల ధని కుల కన్నా పేదలను ఎక్కువ కుంగదీస్తుంది. పాటించవలసిన నియమ నిబంధనల భారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది తలనొప్పి తెచ్చిపెట్టే అంశం. రాష్ట్రాలపై ప్రభావం రెండవ అంశం. రేటులో కోత, హేతుబద్ధీకరణ వల్ల ఏర్పడగల స్థూల నష్టం రూ. 1.5 ట్రిలియనా లేక రూ. 1 ట్రిలియన్ కన్నా తక్కువే ఉంటుందా అన్నది చూడవలసి ఉంది. కానీ, దానిలో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయవలసి ఉంది. తొలుతటి జీఎస్టీ చట్టంలో చేసిన రీయింబర్స్‌మెంట్ వాగ్దానానికి 2022లో కాలం చెల్లింది. పరిహారం సెస్సునకు కూడా గడువు తీరబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో పేర్కొన్న వ్యయాలను ఎలా నిర్వహించగలుగుతాయి?
భారతదేశంలో మాత్రమే కనిపించే ‘మూడింట రెండు వంతులు/ మూడింట ఒకటో వంతు’ సమస్య దాని సమాఖ్య ఏర్పాటులోనే ఉంది. మూడింట రెండొంతుల వ్యయ కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వాలు, స్థానిక సంస్థలపైనే ఉంది. కానీ, రెవిన్యూ స్వయం ప్రతిపత్తిలో వాటికున్నది మూడింట ఒకటో వంతు మాత్రమే! పెట్రోలు, డీజిలు, విద్యుచ్ఛక్తి జీఎస్టీ పరిధిలోకి రాకుండా బయటే ఉండిపోవడానికి అది కూడా ఒక కారణం. అటువంటి ఆందోళనలపై స్పందిస్తూ ఆర్థిక మంత్రి రాష్ట్రాల కోశ సుస్థిరత, ఆర్థిక యోగక్షేమాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. ‘‘సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తిని ఆలంబన చేసుకునే మా చర్చలు సాగాయి’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
రాష్ట్రాలకు ఆదాయం పెరిగేలా...
ఈ నేపథ్యంలో, జీఎస్టీ విధానంలో ఒక సంస్కరణ రూపుదిద్దుకునేటట్లు చేయవచ్చు. ప్రస్తుతం 50:50గా ఉన్న పంపకం సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా 60:40గా మార్చవచ్చు. ఏదేమైనా, మొత్తం ప్రభుత్వ వ్యయాలన్నింటిలోనూ మూడింట రెండొంతుల భారాన్ని రాష్ట్రాలే భరిస్తున్నాయి కనుక, జీఎస్టీ ఆదాయంలో వాటికి 60 శాతం భాగం ఇస్తే, వాటి బడ్జెటరీ ఖర్చులకు తగ్గట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న జీఎస్టీని సమీకృత మొత్తంగానే చూస్తున్నారు. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున (సగం, సగం) సమ భాగాలుగా వసూలు చేస్తున్నట్లు లెక్క. కేంద్రానికి సెస్సులు, దేశ రుణం, విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడం వంటి ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయి. పంపకాల సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా కొద్దిగా మొగ్గేటట్లు చేసినా, వాటి గాబరా కొంత ఉపశ మిస్తుంది. సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తి మరింత బలపడుతుంది.
అజిత్ రనడే
వ్యాసకర్త పుణె ఇంటర్నేషనల్ సెంటర్‌లో సీనియర్ ఫెలో