
రక్షణ కోసం : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్
విశ్లేషణ
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్‌ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.
దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం!
ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది.
అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్‌తో సౌదీ రక్షణ ఒప్పందం.
అక్కరకు రాని అగ్రరాజ్యం
ఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు.
ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్‌పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది.
మిగతా దేశాలూ చేరుతాయా?!
ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’.
ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్‌కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు.
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్‌లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.
ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్‌ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్‌కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన.
ఊహకందని పర్యవసానాలు
భారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్‌తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్‌పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే.
మున్ముందు అనేక మలుపులు
ఏమైనా... ఖతార్‌పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు