సనా: యెమెన్‌లోని ఓడరేవు నగరం ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు జరిపింది. మంగళవారం జరిపిన ఈ దాడులపై గల్ఫ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి వ్యతిరేకంగా వేర్పాటువాద సమూహానికి ఆయుధాలు, సైనిక వాహనాలను అందజేస్తున్నారనే ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు సౌదీ అరేబియా అధికారిక వార్తాసంస్థ స్పష్టం చేసింది.
వేర్పాటు వాదుల చేతికి ఆయుధాలు చిక్కడం ఈ ప్రాంతంలో శాంతికి ముప్పుగా పేర్కొంది. అందుకే వైమానిక దళం నిర్ణీత లక్ష్యాలపై దాడులు జరిపిందని, పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుందని వెల్లడించింది.
ఈ దాడులపై అటు యెమెన్ సీరియస్‌గా స్పందించింది. యూఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసింది. తమ సార్వభౌమాధికారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యెమెన్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్-అలీమి ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి టీవీలో మాట్లాడారు. యెమెన్‌లో ఉన్న యూఏఈ దళాలు(అల్-అలీమీ) తమ భూభాగాన్ని 24 గంటల్లో విడిచి వెళ్లాలని ఆదేశించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మూడ్రోజులపాటు నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. 90 రోజుల అత్యయిక స్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


