
మానవుడు పుడమి తల్లి ముద్దుబిడ్డ. ఆమె అతగాడికి కన్నతల్లి కంటె మిన్న. తల్లి తన బిడ్డలనందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. కానీ ప్రతి బిడ్డతోనూ ఆమె అనుబంధం ప్రత్యేకం. తన బిడ్డలలో అందరికంటె ఎక్కువ చురుకుతనమూ, బుద్ధిబలమూ, కార్యకుశలతా, ప్రయోజకత్వమూ ఉన్న మానవుడిని చూస్తే, పుడమితల్లి గుండె ఒకింత గర్వంతో పొంగితే... అది సహజమే. తన మేధతో, కృషితో,సృజన శక్తితో తల్లి అందించిన వనరుల విలువను మరింత చేయగల మహత్తరమైన శక్తి మనిషికి ఉంది. ఆమె నీటినిస్తే, అతగాడు దానిని ఇంకని, తరగని, శోభాయమానమైన జలాశయాలుగా మారుస్తాడు. ఆమె పచ్చి దినుసులు ప్రసాదిస్తే, అతడు వాటిని పంచభక్ష్య పరమాన్నాలుగా మార్చగలడు. ఆమె పిట్టపాట వినిపిస్తే, అతడు ఆ జాడలో మరింత శోధించి... భావ, రాగ, లయలతో సమగ్రమైన సంగీత ప్రపంచం సమకూర్చుకోగలడు. ఆమె పువ్వులు ప్రసాదిస్తే, అతడు వాటితో అద్భుతమైన ‘బతుకమ్మ’ సంబరాలు సృష్టించగలడు! ఆమె ప్రసాదించిన పూలకు తన బహుముఖమైన కళాత్మకత జోడించి, పువ్వుల పండగ జరిపి, ఆమెకే తిరిగి కన్నుల పండుగనూ, వీనుల విందునూ అందిస్తాడు. పుడమి తల్లి మనసు పులకరింపజేసి రుణం తీర్చుకొంటాడు.
బతుకమ్మ సంబరం అంటే సాధారణంగా లభించే వనరులతో అసాధారణమైన అందాల పుష్పాకృతులను అమర్చి చేసే నేత్రోత్సవం. నిసర్గ సౌందర్యం తొణికిసలాడే అమ్మలక్కల ఆటల నృత్యోత్సవం. కృత్రిమత లేని పల్లె పడతుల పాటల తీపిని శ్రవణపేయంగా చెవులకు చేర్చే కర్ణోత్సవం. ఆత్మీయతలతో అలరారే, ఆదర్శమైన, సౌహార్ద విలసితమైన, సామాజిక జీవన మాధుర్యానికి అద్దం పట్టే సందర్భం. వికసితమైన బుద్ధిగల మానవుడు, తన వికాసానికి అన్నివిధాలా ఆధారభూతమైన ప్రకృతి మాత పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతను ప్రదర్శించే వార్షికోత్సవం. సౌందర్యోపాసనలోనూ, పర్యావరణం పట్ల బాధ్యతలోనూ, సామాజిక సామరస్యం పట్ల నిబద్ధతలోనూ, తన ప్రత్యేకత ప్రదర్శిస్తూ, మనిషి వినయంగా మట్టితల్లికి సమర్పించే సాష్టాంగ ప్రణామం.
– ఎం. మారుతి శాస్త్రి