2025 ఐసీసీ మహిళా ప్రపంచకప్‌తో హర్మన్ ప్రీత్ జట్టు
సందర్భం
అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్‌లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొన్న పెను సవాళ్ళు, ఛీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరటి పండు లాంటిదే. ‘పురుషుల క్రికెట్‌లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు?’ అని మిథాలీ రాజ్‌ను ఆ మధ్య ఓ జర్నలిస్ట్ అడిగాడు. ‘ముందు ఆ పురుష పుంగవులను కలిసి వారికిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకుని రండి’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారామె.
చులకన భావం ఒక్కటే మన క్రికెట్ వనితల సమస్య కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదు పాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణా లను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తలిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పేదేముంది!
బ్యాట్లయినా లేని రోజుల నుంచి...
పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంత ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సందర్భాలు 1980, 1990 దశ కాల్లో ఉండేవి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్ళలో, స్కూలు బిల్డింగుల్లో బస చేసేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్ళలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెబుతోంది.
టీమ్ మొత్తానికి కలిపి రెండు, మూడు బ్యాట్లు మాత్రం ఉండేవట! మిథాలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్ సదుపాయలు లేక పోవడాన్ని ‘శభాష్ మిథు’ బయోపిక్‌లో చూపించారు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ, ఝులన్ గోస్వామి లాంటి మెరిక ల్లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్‌లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది కూడా!
అప్పట్లో రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. 2006లో మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ. పరిధి లోకి తీసుకొచ్చారు. అయితే మన క్రికెట్ బోర్డు వారు ప్రేమ కొద్దీ చేసిన పని మాత్రం కాదది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) ఆదేశాల మేరకు మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ.లో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కనీసం రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్‌మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. 
ఇందిరా గాంధీతో 1975 నాటి తొలి భారత మహిళా క్రికెట్ జట్టు
సీరియస్‌గా తీసుకోవడం మొదలైంది!
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, షెఫాలీ వర్మ లాంటి కొత్త తరం రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్‌కి కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్‌నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు, తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్‌లో గేమ్ ఛేంజర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెల వాల్సింది గానీ తొమ్మిది పరుగుల తేడాతో కప్ పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాన్ ఫాలో యింగ్ బాగా పెరిగింది.
2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బి.సి.సి.ఐ. నిర్ణయించింది. అలాగే మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు.
అమన్ జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్‌తోనే ఆమె క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకుంది. షెఫాలీ వర్మ మగవాళ్ల హెయిర్ కట్‌తో కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిగా నటిస్తూ మగవాళ్లతో కలిసి ఆడేది. గ్రామీణ వాతా వరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు కసిగా, నిర్భయంగా ఆడుతున్నారు. మంచి ఫలితాలు తెస్తున్నారు.
మగవాళ్లతో పోటీ!
2022 కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్‌లో రజత పతకం గెలుచుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో మన దేశానికి క్రికెట్‌లో మొట్టమొదటి స్వర్ణ పతకం మన మహిళా జట్టే అందించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌లో జయకేతనం ఎగరవేశారు. 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్స్‌ను చేసిందో, ఈ గెలుపు మహిళల క్రికెట్‌లో కూడా ఒక సువర్ణాధ్యాయా నికి తెర లేపనుంది అనడంలో సందేహం లేదు.
2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీ ఫైనల్లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఇకపై సూపర్ స్టార్‌డమ్ కేవలం మగ క్రికెటర్లకే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్!
సి. వెంకటేశ్
వ్యాసకర్త జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్


