ఇది విమోచనమే! | Sakshi Guest Column On Hyderabad Liberation Day | Sakshi
Sakshi News home page

ఇది విమోచనమే!

Sep 17 2025 1:14 AM | Updated on Sep 17 2025 5:25 AM

Sakshi Guest Column On Hyderabad Liberation Day

1948 సెప్టెంబర్‌ 17 : హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో భాగమైన రోజు

అభిప్రాయం

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. 

వీరులను స్మరించుకోవడానికి...
1998 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్‌ 17ను ‘హైదరాబాద్‌ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్‌ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. 

ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్‌ 12న ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్‌ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్‌కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట పోలీస్‌ చర్య తర్వాత 1948 సెప్టెంబర్‌ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. 

అయితే, సెప్టెంబర్‌ 17ను ‘హైదరాబాద్‌ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్‌లో పేర్కొన్నారు. 

అసంబద్ధమైన పేర్లు
గతంలో హైదరాబాద్‌  సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కావడం విశేషం. 

తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్‌ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ ప్రచురించి సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 

1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్‌ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్‌ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్‌పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్‌ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. 

తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. 

అందుకే 1948 సెప్టెంబర్‌ 17 ‘హైదరాబాద్‌ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.

సీహెచ్‌. విద్యాసాగర్‌ రావు 
వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement