మరోసారి తెలుగు నేలపై గుడిలో జరిగిన తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కార్తిక ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొక్కిసలాటలో రైలింగ్ విరిగి పోయి భక్తులు ఒకరి మీద ఒకరు పడి అక్కడికక్కడే 9 మంది మర ణించారు. తీవ్రంగా గాయాల పాలైన భక్తులు మరికొందరు ఉన్నారు యథావిధిగా పాలకులు జరిగిన దుర్ఘటనకు దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.
ఆలయాల వద్ద పర్వదినాలలో భక్తులు ఎంతమంది వస్తారో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం ఆలయ నిర్వాహకుల వైఫల్యమే. అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైన విషయం. అది ప్రైవేట్ ఆలయమనీ, నిర్వాహ కులు భక్తులకు భద్రతా విషయంలో సరియైన చర్యలు తీసుకోలేదనీ స్వయానా ముఖ్యమంత్రి ఆరోపించడం గమనార్హం.
సహజంగా ప్రైవేటైజేషన్ పాలసీని మనసా వాచా కర్మణా ఆహ్వానించి సమర్థించే మనిషి ఆలయం విషయంలో అది ప్రైవేటు వ్యక్తి నడిపిస్తున్నా డనీ, దానిలో భద్రతా చర్యలు కొరవడ్డాయనీ, అధికారులకు సరైన సమాచారం లేదనీ ఆరోపించడం వింతగా ఉంది. దేవుడి విషయంలో భక్తులకు అది ప్రైవేట్ ఆలయమా, లేక టీటీడీ నిర్వహి స్తున్న ఆలయమా అనే విచక్షణ ఉండదు. వాళ్లకు దేవుడు, భక్తి ప్రధానం కానీ ఆలయ నిర్వాహకులు కాదు.
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కూడా వర్షా లకు తడిసి ఉన్న గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాల య్యారు. అక్కడ కూడా సరైన భద్రతా ఏర్పాట్లు లేవనేది సుస్పష్టం.
ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కొనుగోలుకై జరిగిన తోపులాటలో ఆరుగురు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మరి తిరుపతిలో కొన్ని వేలమంది రక్షక భటులు భద్రతా పర్యవేక్షణ చేస్తుంటారు. భక్తుల క్యూలను ఎప్పటికప్పుడు నియంత్రి స్తుంటారు. అయినా భక్తుల తోపులాటలు తొక్కిస లాటల ముందు రక్షకభటుల పనితనం తెల్లబోయింది.
కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులది కావచ్చు.
మరి సింహాచలం, తిరుపతి దేవస్థానాలు ప్రభుత్వమే నిర్వహిస్తున్నది కదా! మరి అక్కడ ఎవరిని నిందించాలి? పోయిన ప్రాణాలు తిరిగిరావు. దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా, సంతాపం అన్ని యథా ప్రకారమే జరిగాయి. కానీ ఎవరు పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనపడటం లేదు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా మనం చూశాం. అధికారులు కూడా తాము చేయాల్సిందంతా చేశామని చేతులు ఎత్తేస్తే జరిగే ఘోర ప్రమా దాలు ఇలాగే ఉంటాయి. ఇవి ప్రకృతి విపత్తులు కావు, మానవ తప్పిదాలు మాత్రమే అని గమనించాలి.
– శ్రీశ్రీ కుమార్ ‘ కవి–రచయిత


