విశ్లేషణ
డీప్‌ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్‌ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్‌ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది.
‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!
ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది.
ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్‌కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్‌లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.
ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్‌లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది.
కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్‌జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్‌ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్‌ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్‌లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.
హడావిడిగా నిబంధనలా?
కేంద్రం డీప్‌ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్‌ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్‌ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్‌కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.
డీప్‌ఫేక్‌లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్‌ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్‌క్స్, ఫొటోల మార్ఫింగ్‌ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు.
భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది.
అసలు సమస్యలు
ప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్‌ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్‌లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి.
యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


