రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు
మూడు బ్యాంకుల నుంచి రూ.945 కోట్లు లూటీ
ఆయనపై ఇంకా నమోదు కావాల్సిన కేసులున్నాయి
వాటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి
సోషల్ మీడియాలో ఐపీఎస్ సునీల్‌కుమార్ సంచలన విషయాలు
సెల్ఫీ వీడియోతోపాటు కేసు ఎఫ్‌ఐఆర్ కాపీలు ఫేస్‌బుక్, ఎక్స్‌లో పోస్టు
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’ అని, మూడు బ్యాంక్‌ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసిందని చెప్పారు. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. గౌరవ ప్రదమైన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఈ కేసులో జైలుకు వెళితే మన రాష్ట్ర పరువు ఏమవుతుందని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఐపీఎస్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెల్ఫీ వీడియోతోపాటు సీబీఐ కేసు ఎఫ్‌ఐఆర్ కాపీలు ఫేస్‌బుక్, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సునీల్ కుమార్ పేర్కొన్న అంశాలు క్లుప్తంగా.. ‘బాధ్యత కలిగిన సీనియర్ అధికారిగా, డీజీపీ ర్యాంకులో ఉన్న ప్రభుత్వ అధికారిగా ఎలాంటి ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. సీబీఐ పెట్టిన కేసుకు సంబంధించి 20 పేజీల ఎఫ్‌ఐఆర్ డాక్యుమెంట్‌ను ఫేస్‌బుక్, ఎక్స్‌లో పోస్ట్ చేశాను. మీరు మొత్తం అందులో చూడొచ్చు. ఈ కేసు ఖచ్చితంగా రుజువు అవుతుంది.
ఆ కేసులో ఉన్నవారందరికీ కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, పీఎన్‌బీల నుంచి లూటీ చేసిన ప్రజల డబ్బు అది. సీబీఐ కేసు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్లే ఇన్ని రోజులు అరెస్టు కాకుండా ఉన్నారు. ఇటీవలే స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఇవాళో.. రేపో ఆయన అరెస్టు కాక తప్పదు. ఇంకా ఆయనపై నమోదు కావాల్సిన అనేక కేసులున్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటిని కూడా నేను ఫాలోఅప్ చేస్తాను. కేసులు పెట్టకపోతే ఇందుకు సంబంధించి రిట్ పిటిషన్‌లు వేస్తాను.
కేసులు సజావుగా జరుగుతున్నవీ లేనిదీ చూస్తుంటాను. ఆ కేసుల్లో నేను కూడా అవసరమైతే ఇంప్లీడ్ అవుతాను. ఆయన ఇప్పుడు గౌరవ ప్రదమైన ఉపసభాపతి స్థానంలో ఉన్నారు. ఆ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అరెస్టయితే మన రాష్ట్ర పరువు ఏం కావాలి? పెద్ద ఆర్థిక నేరగాడు కీలకమైన ఉపసభాపతిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది?’ అని సునీల్ కుమార్ ప్రశి్నంచారు. అందువల్ల తక్షణం ఆయనను ఉపసభాపతి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


