'నేర్చుకోవడమే' నిత్యానందం | Warren Buffett Speech At University of Nebraska Lincoln | Sakshi
Sakshi News home page

'నేర్చుకోవడమే' నిత్యానందం

Nov 5 2025 12:28 AM | Updated on Nov 5 2025 12:28 AM

Warren Buffett Speech At University of Nebraska Lincoln

అమెరికాలోని నెబ్రాస్కా–లింకన్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ చెప్పిన మాటల్లోని ముఖ్యాంశాలు:

విశ్వ గురు

ఎప్పుడైనా నేనిచ్చే సలహా ఒకటే. మనం చదువుకునే విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైనదే కావచ్చు. కానీ, అక్కడి ప్రొఫెసర్లు, వాతావరణం నచ్చనప్పుడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు వెనుకాడకూడదు. నేను పెన్సిల్వేనియాలోని వార్టన్‌ స్కూలులో రెండేళ్ళు చదివిన తర్వాత, అక్కడి పరిస్థితులు నచ్చక ఇదే నెబ్రాస్కా–లింకన్‌ యూనివర్సిటీకి వచ్చేశాను. 

ఈ యూనివర్సిటీలో ప్రతి నిమిషం ఆనందంతో గడిపాను. ఇక్కడే 1951లో గ్రాడ్యుయేట్‌ అయ్యాను. విద్యాలయం విషయంలోనే కాదు, చదువు పూర్తయ్యాక, ఉద్యోగం చేసే సంస్థల విషయంలో కూడా వాటి పేరు ప్రఖ్యాతులను పక్కనబెట్టి, మన మనసు చెప్పిన మాట ప్రకారం నడచుకోవాలి. 

మొదట ఏదో ఓ కొమ్మ...
జీవితంలో సంతృప్తినిచ్చే, మనసారా కోరుకునే ఉద్యోగం మనకు మొదట్లోనే లభించకపోవచ్చు. అది ఎక్కడో ఉంటుంది. ఆరంభంలోనే ఆ అవకాశం లభించకపోవచ్చు. కానీ, రోజులు వెళ్ళదీయాలి కనుక, లభించిన ఉద్యోగాన్ని మొదట చేపట్టక తప్పదు. అలాగని, వచ్చిన దానితోనే సంతోషపడిపోకూడదు. మీరు అభిమానించని కంపెనీలో లేదా మీరు ఇష్టపడే వ్యక్తులు లేని చోట ఉండిపోయి అదే పనిలో కొనసాగాలని అనుకోవద్దు. 

నచ్చిన ఉద్యోగంలో చేరండి. అది ఇచ్చే సంతృప్తి కోసం ఉద్యోగానికి వెళ్ళేందుకు ఉదయమే పక్క మీంచి లేచి కూర్చుంటారు. ఆ మేరకు నేను అదృష్టవంతుడిననే చెప్పు కోవాలి. ఇష్టపడే పనిలోకే రాగలిగాను. దానిని మించింది మరొకటి ఉండదని చెప్పగలను. చేస్తున్న పని అసలు పనే అనిపించదు. ఏరోజు కారోజు త్వరగా పనిలోకి దిగాలని అనిపిస్తుంది. ఉద్యోగాల వేట మొదలు పెట్టిన మొదటి రోజునే మనకు అటువంటిది దొరక్కపోవచ్చు. కానీ, ఎక్కడో ఉండే ఉంటుంది. 

దాని కోసం అన్వేషించాలి. దాన్ని సక్రమంగా నిర్వహించేందుకు సంసి ద్ధులమై ఉండాలి. యజమానులు ఎటువంటివారిని నియమించా లని ఎదురు చూస్తున్నారో వారు కోరుకునే విధంగా మనం తయారు కావాలి. అప్పుడే వారు మనల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు. తక్షణ ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి, ఒక్కోసారి జీతభత్యాలు లభించకపోయినా సరే, ఇష్టపడే వృత్తి వ్యాసంగాలనే చేపట్టాలి. 

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 
కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా రాసే, బాగా మాట్లాడే కళను సంతరించుకోవాలి. నిన్న మనకు తెలియని చాలా విషయాలను నేడు తెలుసుకుని రోజుకు స్వస్తి పలికితే అంతకన్నా అద్భుతమైన కాలం ఇంకేముంటుంది? ప్రతిభావంతులైన విద్యార్థులను చూస్తే, నాకు ప్రపంచంపై ఆశావాదం రేకెత్తుతుంది. ఎదుగుదలపై నమ్మకం ఉంచి రంగంలోకి దిగాలనిపిస్తుంది. 

స్టాక్‌ మార్కెట్‌లో అది నన్ను ‘బుల్లిష్‌’గా వ్యవహ రించేటట్లు చేస్తుంది. మీరూ నాలాగానే జీవితం పొడవునా రకరకాల పరిస్థితులను ఎదుర్కోనున్నారు. నేను చూసిన మహా మాంద్యం లేదా రెండవ ప్రపంచ యుద్ధం, చవిచూసిన ఎత్తు పల్లాల లాంటి ఆశ్చర్యకర ఘటనలు మీకూ మున్ముందు అనుభవంలోకి రావచ్చు. అంతిమంగా గెలుపు మీదే అవుతుంది. అయితే, ఏ రంగంలో రాణించడానికైనా కమ్యూనికేషన్‌ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. 

విజేతలుగా నిలుస్తామని అంటే అర్థం మనకి ప్రతి రోజు అద్భు తంగా గడుస్తుందని కాదు. ప్రపంచం ఎన్నటికీ అలా నడవదు. మరో దేశంలోనో, మరో కాలంలోనో ఉండి ఉంటే, రాణించి ఉండే వారమనుకోవడం తప్పు. ఉన్న చోటునే, ఉన్న పరిస్థితుల్లోనే పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలి. నా ఉద్దేశం – అందరికీ అవకాశాలు తప్పకుండా వస్తాయి. 

కానీ, జీవితం అన్నాక ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. అనారోగ్య సమస్యలో మరొకటో తలెత్తుతాయి. ప్రతి రోజూ ఎంతో కొంత కొత్త విజ్ఞానాన్ని సముపార్జించుకోవడాన్ని అల వాటు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో గ్రహించి ఉంటారు. ఇక ముందు కూడా అదే ధోరణితో జీవితాన్ని కొనసాగించాలి. 

నిరంతరం చదవాలి!
పుస్తకాలు చదవడాన్ని మించిన గొప్ప అలవాటు మరొకటి లేదు. అది వజ్రాయుధం లాంటిది. తెలియని విషయాలను తెలుసు కోవాలనే ఉత్సుకత ఉండాలి. ఎవరో ఒక వ్యక్తితో మాత్రమే విందు ఆరగించే అవకాశం లభిస్తే, దాన్ని బతికివున్న వ్యక్తితో వినియోగించుకుంటారా లేక చనిపోయిన వారిలో ఎవరినైనా ఎంచుకొంటారా అని కొన్నిసార్లు కొందరు నన్ను అడుగుతూంటారు. 

దానికి, చదవడాన్నే సహచరుడిగా చేసుకుంటాననేది నా జవాబు. మనం బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ పుస్తకాన్ని చదువుతూంటే, ఆయనతో కూర్చుని విందును ఆరగిస్తున్నట్లే లెక్క. ఆ మాటకొస్తే, ప్రపంచ చరిత్రలోని ఏ మహా వ్యక్తితోనైనా మనం గడపవచ్చు. నిజం చెప్పాలంటే, మనం వారితో చాలా సుదీర్ఘమైన విందు ఏర్పాటు చేసుకోవచ్చు. 

పుస్తక పఠనం ద్వారా మనం రకరకాల ఆలోచనా స్రవంతులను ఆకళింపు చేసుకున్న వారమవుతాం. నేను కాళ్ళున్న పుస్తకం లాంటివాడినని ఎవరో ఓసారి వ్యాఖ్యానించారు. నేర్చుకోవడంలో, చదవడంలో ఎంతో ఆనందం ఉంది. నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. జీవితాన్ని అదే ఆసక్తికరంగా మారుస్తుంది.

చదువుకోవడంలో లక్ష్యం కేవలం విషయ పరిజ్ఞానం సంపా దించడం కాదు. తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకోవడం. వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడం. ఇక్కడ కాలేజీలో, అంతకుముందు స్కూల్లో మీరు కొందరితో స్నేహం చేసి ఉండ వచ్చు. సన్మిత్రులు కూడా జీవితంలో ముఖ్యమే! 

విజయానికి నిర్వచనం
వ్యాపారంలోనో, వృత్తి జీవితంలోనో, లేదా వ్యక్తిగత జీవితంలోనో విజయాన్ని లేదా సఫలత పొందడాన్ని ఎలా నిర్వచించు కోవాలనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. అసలు జీవన సాఫల్యం అంటే ఏమిటి? ఇది గొప్ప ప్రశ్న. తొంభై ఏళ్ళు వచ్చేసరికి కుబేరులుగా మారిన వారిని నేను చాలా మందిని ఎరుగుదును. అలాగని వారి జీవితాలను విజయాలుగా అభివర్ణించలేం. 

వారి వారి రంగాల్లో చాలా ప్రఖ్యాతి వహించిన వారు కూడా నాకు తెలుసు. కానీ, వాటినీ విజయాలుగా భావించలేం. 70 ఏళ్ళు వచ్చేసరికి అందరూ ఇష్టపడే పురుషుడిని, లేదా స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. వారున్న హోదాలో కొనసాగాలని వారికి అనిపించవచ్చు. దాన్ని విజయంగా తప్ప, మరి ఏ విధంగా నైనా అభివర్ణించవచ్చు.

మన పిల్లలు, జీవిత భాగస్వామి, సహోద్యోగుల ప్రేమను చూరగొంటే అది సఫలత అనిపించుకుంటుంది. అటువంటి వారిని తమ జీవితకాలంలో చూస్తూ వచ్చి 65 లేదా 70 ఏళ్ళ వయసుకు చేరినవారు జీవన సాఫల్యం పొందినట్లు లెక్క. 

ఎంతో ప్రజ్ఞాపాటవాలు ఉండి, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు గడించుకుని ఉన్న వారిని చాలా మందిని చూశాను. కానీ, వారిలో ఏదో వెలితి. నలుగురి ప్రేమనూ చూరగొనలేని జీవితం ఎంత గొప్పదైనా అది వట్టి డొల్ల కిందే లెక్క!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement