అభిప్రాయం
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలను సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడమే సామాజిక సమ్మిళితత్వం. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుక బడిన తరగతుల వారికి రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించడం, భూసంస్కరణల అమలు; 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పట్టణ స్థానిక సంస్థలను పటిష్ఠపరచటం వంటి చర్యలు సామాజిక సమ్మిళితత్వం సాధించటంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయాయి. అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కుల ఆధారిత వివక్ష, అవస్థాపనా సౌకర్యాల అందుబాటులో వ్యత్యాసాలు, అసంఘటిత రంగంలో ఉపాధి అధికంగా ఉండటం లాంటి అంశాలు సామాజిక సమ్మిళితత్వానికి అవరోధంగా నిలుస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల చర్యలు
కుల, మత, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రంగాలలో సంస్కరణలను ప్రవేశ పెట్టింది. సామాజిక ఇంజి నీరింగ్‌లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు కౌన్సిల్, స్థానిక సంస్థలలో నామినేషన్ కోటాలో ప్రాధాన్యమిచ్చింది. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా విప్లవాత్మకమైన చర్యలను విద్య, ఆరోగ్య రంగాలలో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించింది. తెలంగాణలో దళిత బంధు, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇటీవలి ప్రభుత్వం మహిళలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆరు గ్యారెంటీలతో అనేక ప్రోత్సాహ కాలను ప్రకటించింది.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసించే వారిలో పౌష్టికాహారం పెంపు, డ్రాపవుట్ రేట్ తగ్గింపు లక్ష్యంగా ఆర్థికంగా వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఉదయం అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే 6 నుండి 12వ తరగతి బాలికలకు నెలవారీ రూ. 1,000 ఆర్థిక సహాయం వంటి చర్యలను చేపట్టింది. వృద్ధులు, వితంతు వులు, అంగవైకల్యం కలిగినవారు, పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన సామా జిక భద్రతా మిషన్ సత్ఫలితాలనిచ్చింది. భూమి హక్కు, విద్య అందుబాటుకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
ఢిల్లీ ప్రభుత్వం అల్పాదాయ, అణగారిన వర్గాల ప్రజలకు ఒక పరిమితి వరకు ఉచిత విద్యుత్, నీరు అందించడం; ప్రైవేట్ ఆసు పత్రులలో ఉచిత ట్రీట్‌మెంట్ కోసం ప్రజల ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, వికలాంగులకు పెన్షన్ లాంటి చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో ఆర్థిక సాధికారత పెంపు, ఎస్టీ, ఎస్సీ యువతలో ఎంట్రప్రెన్యూర్‌షిప్ పెంపు లాంటి చర్యలు చేపట్టింది.
గుజరాత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బాలికల్లో పాఠశాల నమోదు నిష్పత్తి పెంచడానికి చర్యలతోపాటు, మల్టీపర్పస్ మహిళా సంక్షేమ కేంద్రాలను ప్రారంభించింది. బిహార్ ప్రభుత్వం మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతి మహిళ అకౌంట్‌లో రూ. 10,000 జమ చేయడం, సామాజిక భద్రతా పెన్షన్‌లను అందిస్తున్నది.
ఆచరణలో విఫలం
వివిధ కార్యక్రమాల ప్రభావం వలన విద్యావకాశాలు మెరుగ యినప్పటికీ, ఉన్నత విద్యలో ఇప్పటికీ లక్షిత వర్గాల ప్రజల నమోదు తక్కువగా ఉండటం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు అల్పా దాయ వర్గాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య వేరుగా ఉండటం స్పష్టమవుతున్నది.
భూసంస్కరణలు ఆచరణలో విఫలమయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి ఆర్థిక కమతంగా లేకపోవడం వలన ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణంలో మార్పు సంభవించలేదు. మార్చి 2003 నాటికి 56.73 లక్షల లబ్ధిదారులకు 52.93 లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణీ చేయడం జరిగింది. మొత్తం లబ్ధిదారులలో ఎస్టీల వాటా 15 శాతం కాగా, ఎస్సీల వాటా 36 శాతం. దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 2 శాతం మాత్రమే భూసంస్కరణలలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది.
ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, దేశంలో స్వయం ఉపాధిలో నిమగ్నమయిన వారి నెలవారీ ఆదాయం రూ. 13,279గా నమోదు కావడాన్ని బట్టి వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయపరమైన అసమానతలు స్పష్టమవుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాతి కాలంలో గ్రామీణ వ్యవసాయేతర వేతన రేటులో ఏ విధమైన పెరుగుదల లేకపోగా వ్యవసాయ వేతనాలలో 2 శాతం మాత్రమే పెరుగుదల ఏర్పడింది. దళితులు, ఆదివాసీలలో ఆయుఃప్రమాణం ఉన్నత వర్గాలతో పోల్చినప్పుడు 3 నుండి 5 సంవత్సరాలు తక్కువ.
ప్రపంచ అసమానత నివేదిక 2026 ప్రకారం జాతీయాదాయంలో 58 శాతం సంపన్నులైన మొదటి 10 శాతం ప్రజలలో కేంద్రీకృతం కాగా, చివరి 50 శాతం ప్రజల వాటా 15 శాతం మాత్రమే. మొదటి 1 శాతం ప్రజల వాటా మొత్తం సంపదలో 40 శాతం. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 28.4 శాతం కాగా, ఎస్సీ వర్గాల వారిలో ఇది 23 శాతం, ఎస్టీ వర్గాల వారిలో కేవలం 17.2 శాతం. శిశు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 29.2 కాగా, ఎస్సీలలో 39.6గా ఉంది. అయిదు సంవత్సరాల లోపు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 33.2 కాగా, ఎస్సీలలో ఇది 45.9.
విధానాలు ఎలా ఉండాలి?
అయితే, సుస్థిర ఆర్థిక విధానాలకు పూర్తిగా తిలోదకాలిచ్చి అధికంగా సంక్షేమంపై దృష్టి సారిస్తే మాత్రం పనిచేసే వయస్సుగల జనాభాను నిరుత్సాహపరుస్తుంది. పటిష్ఠమైన ఉత్పాదకతతో కూడిన శ్రామిక శక్తి, మార్కెట్ అవకాశాల పెంపు, సామాజిక స్థిరత్వాన్ని పెంపొందించే విధానాలు ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహద పడతాయి. సంక్షేమం లక్ష్యంగా అవలంబించే సమ్మిళిత సాధన విధా నాలను ఆర్థికాభివృద్ధి, నాణ్యమైన సేవలు, సామాజిక మార్పుతో అనుసంధానపరచాలి. సుస్థిరతకు మద్దతు నిచ్చే పటిష్ఠమైన ఆర్థిక వృద్ధి జరగనప్పుడు, సంక్షేమం మాత్రమే నాణ్యతతో కూడిన ఉపాధి, మార్కెట్ అందుబాటుకు దారి తీయదు.
వ్యక్తుల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి లింగ సంబంధిత; జాతులు, అంగ వైకల్యం కల్గినవారి మధ్య అసమానతలు తొలగించే ఆర్థిక విధానాలు అవసరం. పురోగామి పన్ను విధానం, కనీస వేతనాల చట్టాలు, సామాజిక భద్రతా పథకాలు అల్పాదాయ వర్గాల వ్యయార్హ ఆదాయ పెరుగుదలకు దారి తీసి స్వదేశీ వినియోగ మార్కెట్‌ను విస్తృత పరచగలవు. తద్వారా సమష్టి డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారాలు వృద్ధి చెంది నూతన వ్యవస్థాపకులు పెరుగుతారు. సమీకృత పట్టణ ప్రణాళిక, సమ్మిళిత ఫైనాన్స్ సేవలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు అవసరం.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్ ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జ్),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్


