ఆపత్కాలంలో ఆసరా ఏది? | Sakshi Editorial On Cyclone Montha crop damage in Telugu States | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో ఆసరా ఏది?

Oct 31 2025 12:50 AM | Updated on Oct 31 2025 12:50 AM

Sakshi Editorial On Cyclone Montha crop damage in Telugu States

తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్‌ షీర్‌’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. 

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. 

ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి  తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్‌పుట్‌ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. 

ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్‌ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. 

అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. 

మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత?  కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! 

ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్‌ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. 

పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. 

ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్‌ ఇంజన్‌ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement