
విశ్లేషణ
వ్యక్తిగత వికాసానికీ, దేశ ఆర్థికాభివృద్ధికీ ఆరోగ్య పరిరక్షణకు పూచీనిచ్చే సదుపాయాలు అత్యవ సరం. ఆ సేవలు విçస్తృతమైనవిగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవడాన్ని ప్రోత్సహించడం, వివిధ రుగ్మతలను వెంటనే కనిపెట్టడం, తొలి దశలోనే సరైన ఔషధాలను సేవించేటట్లు చేయడం వరకు దీనిలోకి చాలా వస్తాయి. దీని పరిధిని పునరావాస సేవలు, అవసరమైన చోట ఉపశమన సంరక్షణ కల్పించడానికి కూడా విస్తరించాలి.
సగటు ఆయుర్దాయాన్ని పొడిగించడం నుంచి పూర్తి జీవితాన్ని ఆనందమయంగా గడిపేటట్లు చేయడంపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడానికి, తద్వారా దేశాన్ని సుసంపన్నం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అవతరించేందుకు ప్రతి భారతీయుని ఆరోగ్యం చోదకశక్తిగా పనిచేస్తుంది.
వైద్యానికి ప్రతిబంధకాలు
దేశంలో నివసిస్తున్న అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగల స్థితి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) అధినేత మోహన్ భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘ఏ వ్యక్తికైనా ఆరోగ్య రక్షణ, విద్య అత్యంత ముఖ్యమైనవి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య మానవుడికి ఆ రెండూ అందని మావిపండుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
ఇందౌర్‌లో ఆరోగ్య కేంద్ర–క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తూ భాగవత్ అలా వ్యాఖ్యానించారు. చాలా మందికి వైద్యం చేయించుకోవాలనే తాపత్రయం ఉన్నా దగ్గరలో అవి లేకపోవడం, ఉన్నా స్థోమతకు మించి ఉండటం, వైద్యం ఉన్నత ప్రమాణాలతో లేకపో వడం వంటివి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలిక ఔట్ పేషంట్లు కొందరు వైద్యానికి పెట్టిన ఖర్చుతో పేదరికంలోకి జారుకుంటున్నారు.
సదుపాయాలకు మించి పేషెంట్లు ఉండటం, ఆ యా కేంద్రాల సామర్థ్యం అంతగా లేకపోవడం, పాలనాపరమైన వైఫల్యాలతో ఆయు ష్మాన్ భారత్ కార్యక్రమం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దానికితోడు, భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ అమలులో ఉంది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ఆరోగ్య రక్షణ సదుపాయాలకు రూపకల్పన చేయడం, అమలుపరచడంలో ఆ రెండింటి మధ్య ఎంతో సమన్వయం అవసరం.
బహుముఖ సేవలు వాడుకోవాలి!
భారతదేశపు ఆరోగ్య సేవలు ప్రైవేటు రంగంపైన కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఒక ప్రణాళిక కింద కాక, అవసరాలు, అవకాశాలకు తగ్గట్లుగా ఇది ఒక మిశ్రమ వ్యవస్థగా తయారైంది. విడిగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు ఇప్పటికీ ఉన్నారు. కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. ఏదో ఒక వైద్య విభాగానికి పరిమితమై, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని చేర్చుకుని సేవలందిస్తున్న ఆస్పత్రులున్నాయి.
మల్టీ –స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి సరేసరి. అలా ప్రైవేటు వైద్య రంగం బహుముఖాలుగా ఉంది. స్వచ్ఛంద సంస్థల రంగం చెదురుమదురుగా ఉన్న చారిటబుల్ ఆసుపత్రులకు పరిమితమవుతోంది. వాటిలో కూడా కొన్నింటిలో అధునాతన వైద్య సదుపాయాలున్నాయి. అవి ధనిక రోగుల నుంచి కాస్త ఎక్కువ వసూలు చేసి, ఆ మార్జిన్ ద్రవ్యాన్ని పేద రోగుల చికిత్సకు వెచ్చిస్తున్నాయి. ప్రైవేటు రంగంపై నియంత్రణ పెళుసుగా ఉండటంతో, అది విధించే చార్జీలు తరచు సామాన్య మానవునికి పెను భారంగా పరిణమిస్తున్నాయి.
ప్రతి ఒక్కరినీ ఆరోగ్య రక్షణ (యు.హెచ్.సి.) గొడుగు కిందకు తీసు కొచ్చేందుకు, మరింత మానవతావాద దృష్టితో స్పందించేందుకు ప్రభుత్వ రంగాన్ని మనం ఉద్దీపింపజేయవలసిన అవసరం ఉంది. పెద్ద సంఖ్యలో ఉంటున్న రోగుల తాకిడిని తట్టుకునేటట్లు, మరింత సమర్థతతో పనిచేసే టట్లు ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలి. ప్రైవేటు రంగం మరింత బాధ్య తాయుతంగా వ్యవహరించేటట్లు చూడాలి.
అనవసర పరీక్షలు, అదనపు చార్జీల జోలికి వెళ్లకుండా వాటిని అరికట్టాలి. స్వచ్ఛంద రంగానికి మరిన్ని వనరులు సమకూర్చాలి. ప్రజలనే భాగస్వాములుగా చేసే విధంగా ప్రజా రోగ్య, సమాజ సంబంధిత క్లినికల్ కేర్ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఇవి కొన్నిచోట్ల మొదలైతే మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.
టెలీ–హెల్త్ సేవలను ప్రభావశీలంగా అమలులోకి తెచ్చేందుకు ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణను వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ సేవల్లో ముందున్నాం కనుక ఇది సాధ్యపడే అంశమే. డాక్టర్లు లేకుండా టెక్నాలజీతో నడిచే ఆరోగ్య రక్షణ కేంద్రాలు ప్రాథమిక రక్షణకు సంబంధించి చాలా వరకు సేవలందించవచ్చు. తద్వారా, రెండవ, మూడవ స్థాయి కేంద్రాలపై భారం తగ్గుతుంది. టెక్నాలజీ కేంద్రాలే వ్యాధి తీవ్రతను బట్టి రోగి ఎక్కడికి వెళ్లాలో రిఫర్ చేయవచ్చు.
ఇతర వైద్య విధానాలను కూడా ప్రోత్సహించి తీరాలి. ఏ రోగానికి ఏ రకం వైద్యం పనిచేస్తుందో గుర్తించి, వివిధ వైధ్య విధానాల పాత్రల మధ్య సరిహద్దు రేఖ గీయవచ్చు. అల్లోపతీ, సంప్రదాయ వైద్య పద్ధతులకు సరిపో యినంతగా వనరులు కేటాయిస్తేనే ఫలితం ఉంటుంది.
అన్నింటినీ సమన్వయం చేయాలి!
ఈ ప్రయత్నాలన్నీ సజావుగా సాగడానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు రెండింటిలోను ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించక తప్పదు. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి క్రమంగా పెరగాలి. ఆరోగ్య రక్షణకు వ్యక్తులు తమ జేబుల్లోంచి తీసి పెట్టే ఖర్చు 20% కన్నా తక్కువగా ఉండేట్లు చూడాలి. ఆరోగ్య సేవల రూపకల్పనలోను, అందించడంలోను ధర్మమే ప్రధాన భూమిక వహించాలి. సమ న్యాయం అందరికీ ఒకే రకమైన సేవలను అందుబాటులోకి తెస్తుంది.
నేషనల్ హెల్త్ మిషన్, పి.ఎం. జె.ఏ.వై. మధ్య సంబంధం లేకుండా ఉన్నవాటిని తొలగించి, సమీకృత రక్షణ నమూనాలను సృష్టించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థల మధ్య; అల్లోపతీ, సంప్రదాయ వైద్య వ్యవస్థల మధ్య పొంతన, సమన్వయం తీసుకొచ్చేందుకు చర్చలు జరగవలసి ఉంది.
ప్రొ‘‘ కె. శ్రీనాథ్ రెడ్డి
వ్యాసకర్త ‘పీహెచ్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్’లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్