
సందర్భం
కవి, రచయిత, సినిమారంగ ప్రముఖుడు, కాలమిస్టు, చరిత్ర, సాహిత్య పరిశోధకుడు, నాలుగైదు భాషలు తెలిసినవారు, శ్రీశ్రీ భాషలో తొలుత ఆరో రుద్రుడు... ఆరుద్ర. విశాఖపట్నంలో 1925 ఆగస్టు 31న పుట్టిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అనేక కలం పేర్లను వాడుతూ ‘ఆరుద్ర’గా స్థిర పడ్డారు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆయన విద్యార్హత ఎస్సెస్సెల్సీనే! తండ్రి నరసింగరావు సాహిత్యా భిలాషి గనక కనిపించిన పుస్తకమల్లా తెస్తే మేనమామ శ్రీశ్రీ అప్పటికే విశాఖ రీడింగు రూములో పుస్తకాలన్నీ తాను చది వేసి ఆరుద్రతోనూ చదివించారు. ఆ విధంగా 13 ఏళ్ల వయసులోనే ఆరుద్ర కవిత్వ రచన మొదలుపెట్టారు. కొడవటిగంటి కుటుంబరావు కూడా రచనా శిల్పాన్ని మెరుగులు దిద్దారు. చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని మేధాగతం చేసుకోవడానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు.
1942లో సెట్టి ఈశ్వరరావు సిఫార్సుపై ఆరుద్ర కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొ న్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై జర్మనీ దాడి చేశాక... అందుకు వ్యతిరేకంగా తన వంతు పాత్ర నిర్వహించేందుకై ఆరుద్ర వైమానిక దళంలో చేరారు. ‘ఆనందవాణి’ పత్రికలో కొలువుతో సహా అనేక మజిలీల తర్వాత మద్రా సులో స్థిరపడి సృజన, పరిశోధన సాగించారు. 1955లో దర్శక దిగ్గజం హెచ్‌ఎం రెడ్డి, శ్రీశ్రీలే సాక్షులుగా రూ.60 ఖర్చుతో రామలక్ష్మిని రిజిస్టరు వివాహం చేసుకున్నారు.
కవిత్వంలో ప్రయోగాలకూ ఆధునికతకూ ఆరుద్ర ప్రాధాన్యాన్నిచ్చారు. ‘గాయాలూ గేయాలూ’, ‘సాహిత్యోపని షత్’, (ఛందస్సు లేని) ‘ఇంటింటి పజ్యాలు’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీ వాలి’, ‘పైలా పచ్చీసు’, ‘అమెరికా ఇంటింటి పజ్యాలు’ తదితర రచనలు చేశారు. నాట్యశాస్త్రంలోని ‘హస్త లక్షణ పదాలు’ మరో ప్రత్యేక రచన. ‘ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు’ ఆయన మరణానంతరం వెలువడ్డాయి. జీవితపు చివరి దశలో మొదలు పెట్టిన ‘మనిషి – ఆడ మనిషి’ కావ్యంలోని ఒక భాగం ‘స్త్రీ పురాణం’ మహిళా కోణాన్ని ఆవిష్కరించింది.
తను రాయని ‘సినీవాలి’ అనే కావ్యం రాసినట్టు ఎవరో పొరబాటున పేర్కొంటే ఆ పేరుతో కావ్యం రాశారు. ఇంటింటి పజ్యాలు, కేరా శతకము వంటివి అలవోక ప్రయోగాలే. ‘కూనలమ్మ పదాలు’ వందల మందిని కవులను చేశాయంటారు. వీర తెలంగాణ సాయుధ పోరా టంపై హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గీతాలను తెలుగులోకి అనువదించగా సుందరయ్యగారి పుస్తకంలో ప్రచురించారు.
‘కొండగాలి తిరిగింది’ పేరిట వచ్చిన సినిమా పాటలు ఆయన పట్టును చెబుతాయి. ‘ఎదగడానికెందుకురా తొందర’ పాటలో నిరుద్యోగాన్ని వివరిస్తారు. ‘గాం«ధీ పుట్టిన దేశమా ఇది’ అంటూ ప్రశ్నిస్తారు. ‘వేదంలా ఘోషించే గోదావరి’, ‘మహాబలిపురం’ వంటి పాటలు వింటే రాగం చరిత్ర అల్లుకుపోవడం చూస్తాం. అందులో కూడా ‘కట్టు కథల చిత్రాంగి కనకమేడలు’ అంటూ అది నిజం కాదని సూచిస్తారు.
‘కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు’ అన్న ఆయన మాటలు సుభాషితాల్లా నిలిచిపోయాయి. ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ అంటూ ‘అల్లూరి సీతారామరాజు’కు రాసిన పాట కూడా గొప్పగా ఉంటుంది. సినిమా పాటల తీరు మారి విలువలు తగ్గిపోతున్న దృష్ట్యా వాటిని రాయడం విరమించుకున్నారు. 150 చిత్రాలకు మాటలూ, 500 చిత్రాల్లో నాలుగు వేల పాటలూ రాశారు. సినీ జనానికి ఆయనో విజ్ఞాన సర్వస్వంలా గోచరించేవారు.
సామాన్యుడికి సాహిత్య చరిత్ర తెలియడానికి ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మహాభారం వేసుకున్నానని ఆరుద్ర వినయంగా చెప్పినా... పండితులకే గొప్ప వనరు సమ కూర్చారు. దాన్ని రాసే సమయంలో తీరిక లేకపోవడం వల్లనే గడ్డం చేసుకోవడం మానేసి పెంచేశానని సరదాగా చెబుతుండేవారు. ‘వేమన వేదం’, ‘మన వేమన’, ‘వ్యాస పీఠం’, ‘గురజాడ గురుపీఠం’ సంపుటాలు; ‘ప్రజా కళలూ – ప్రగతివాదులూ’ ఆయన ప్రజ్ఞకు ప్రతిబింబాలుగా నిలిచి ఉన్నాయి. ’రాముడికి సీత ఏమవుతుంది?, ‘గుడిలో సెక్స్’ అన్న గ్రంథాలు ఇప్పుడెంత సంచలనమయ్యేవో! కళలు, క్రీడలు, ఇంద్రజాలం వంటి అంశాలపై కూడా సాధికార గ్రంథాలు వెలువరించారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించా లంటూ సైన్యంలో చేరడంతో మొదలైన ఆరుద్ర రాజకీయ అవగాహన ఆఖరు దాకా ప్రగతిశీలంగానే సాగింది. సైద్ధాంతిక విభేదాలు పెరిగినపుడు మామూలు కవులుగా అందు కోవడంలో తాము పొరబడి ఉండొచ్చని నిస్సంకోచంగా వినయంగా చెప్పారేగానీ ఇతరులపై దాడి చేయలేదు.
1985లో ఆరుద్ర షష్టి పూర్తి సాహిత్య లోకంలో ఒక పండుగలా జరిగింది. తర్వాత కాలంలో ఆరుద్ర ఉద్యమానికి మరింత దగ్గరయ్యారు. సోవియట్ విచ్ఛిన్నం, ప్రపంచీ కరణ, దేశంలో అయోధ్య వివాదం తరుణంలో ఆరుద్ర ‘మనీ ప్రపంచం మనీ ప్రపంచం/ మనీ ప్రపంచం గెలిచిందా? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మారిందా?’ అని ప్రశ్నించారు.
ఆరుద్ర 1998 జూన్ 4న కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిశాక గాని తెలియలేదంటే అది ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే. తన అంతిమఘట్టం అలా నిశ్శబ్దంగా జరిగిపోవాలని ఆయన ఆకాంక్షించారని భార్య రామలక్ష్మి నా ఇంటర్వ్యూలో చెప్పారు. చరిత్రనే తిరగదోడే అసహన ధోరణులూ దాడులూ, కళాసాహిత్యాలలో వాణిజ్య ప్రలోభాలూ పెరిగిన ఈ తరుణంలో ఆరుద్ర జీవితం అధ్యయనానికీ, ఆచరణకూ మార్గదర్శకం.
తెలకపల్లి రవి
వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకులు
(నేడు ఆరుద్ర శతజయంతి)