మాధవ్ శింగరాజు
సినిమాలో దమ్ము లేదని టాక్! దమ్ము ఉందా లేదా అన్నది కాదు, అసలైతే ‘టాక్’ ఉంది. అది కదా ఒక మంచి సినిమాకు నిజంగా ఆదరణ. సినిమా చూసేసి, ఖాళీ పాప్‌కార్న్ బకెట్‌ను సీటు దగ్గరే వదిలేసినట్లు, సినిమాను సినిమా హాల్లోనే వదిలేసి పోతే... అప్పుడు కదా ఆ సినిమా పోయినట్లు!
‘‘పరేశ్‌జీ! మీరెందుకు ఇలాంటి సినిమాను ఎంచుకున్నారు? పైగా మీరొక మాజీ లోక్‌సభ ఎంపీ. ఇంకా పైగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్‌పర్సన్! కళంకం కాదా ఆ స్థానానికి?!’’
శుక్రవారం రిలీజ్ అయిన ‘ద తాజ్ స్టోరీ’ గురించే ఈ ప్రశ్నలన్నీ! నేనేమీ ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్లే వచ్చి ప్రశ్నల మీట్ పెట్టారు.
‘‘చూడండీ ఒకటి చెబుతాను. ఏ నటుడూ సినిమాను ఎంచుకోడు. సినిమానే నటుడిని ఎంచుకుంటుంది. ‘తాజ్ స్టోరీ’లోని విష్ణుదాసు తన పాత్ర కోసం ఈ ముంబయిలో నన్ను వెతికి పట్టుకున్నాడు’’ అన్నాను.
‘‘కానీ పరేశ్‌జీ, ఆ విష్ణుదాసు... తాజ్‌మహల్ కింద నిజానికి ఏం ఉండేదో వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపించాలని కోర్టు సీన్‌లో వాదిస్తున్నాడు. అంటే, ఆ పాత్రలో మీరు వాదిస్తున్నారు. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు పరేశ్‌జీ?’’ – మరో ప్రశ్న.
‘‘ఎందుకు?’’ అనే ప్రశ్నకు నా దగ్గర ఎప్పుడూ సరైన సమాధానమే ఉంటుంది. అయితే అది అర్థం చేసుకోటానికే సరైన మనుషులు ఉండాలి.
నేను ఎప్పుడూ అహ్మదాబాద్ వెళుతుండే వాడిని. ఎందుకంటే అక్కడ నా సిస్టర్ ఉండేవారు. నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీనే ఇష్టపడుతుంటాను. ఎందుకంటే ఢిల్లీకి మనోహరమైన చరిత్ర ఉంది. అక్కడ స్వీట్స్ కూడా బాగుంటాయి.
‘‘పరేశ్‌జీ, మీరెంతో మనోహరమైనవిగా భావించే ఢిల్లీ చరిత్ర పుటల కంటే కూడా దేశ ప్రజల మనోభావాలు మరింత మనోహరమైనవి, తియ్యనైనవి. కానీ మీరేం చేస్తున్నారు! విష్ణుదాసు అవతారం ఎత్తి, తాజ్ మహల్‌ను తవ్వి తీయిస్తే ఏదో బయట పడుతుందని ఆశిస్తున్నారు. ఎందుకు మీరిలా చేస్తున్నారు పరేశ్‌జీ... అదీ, దేశం కొద్దో గొప్పో ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో!’’ – ఇంకొక ప్రశ్న.
కళాస్వేచ్ఛ గురించి ఈ విమర్శకులకు ఎందుకు పట్టదు!
‘‘మోదీజీని మెప్పించేందుకే మీరు విష్ణుదాసు పాత్రను భుజం మీద వేసుకున్నారని తెలుస్తూనే ఉంది పరేశ్‌జీ. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ రాజు రాజభవనం అని, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకుని ముంతాజ్ మహల్ సమాధిగా మార్చాడని సినిమాలో మీరు వాదించటం చూస్తే అలాగే అనిపిస్తోంది’’ అని మరొక యక్షుడు!
‘‘భారతీయ కళాకారులకు ‘పీఆర్’ లేకపోవడం వల్ల వామపక్ష చరిత్రకారులు గతాన్ని వక్రీకరించి మొఘలులను కీర్తించారని ఆ సీన్‌లో విష్ణుదాసుగా మీరు ఆరోపించడం కూడా మోదీజీ కోసమే కదా?’’ – ఇంకో ప్రశ్న!
మహా భారతంలో ధర్మరాజును పరీక్షించింది ఒకరే యక్షుడు. శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు సవా‘లక్షులు’!
‘‘మంచిది మిత్రులారా! మరొక సినిమాతో, మరొక శుక్రవారం కలుద్దాం’’ అన్నాను, నవ్వుతూ పైకి లేస్తూ.
‘‘చివరి ప్రశ్న పరేశ్‌జీ, ఆ మరొక సినిమా కూడా ఇలాగే, ఈ ‘తాజ్ స్టోరీ’లానే ఉంటుందా?’’ – వ్యంగ్యం.
నేనూ వారికి చివరి జవాబు ఇచ్చాను.
‘‘కొరుకుడు పడని కాలాల మీద నేను మనసు పడతాను. కొరుకుడు పడని మనుషుల మీద ఆ కాలాల వలను విసిరి, వారిని పడతాను’’ అన్నాను.
‘‘అర్థం కాలేదు పరేశ్‌జీ’’ అన్నారు!
‘‘ఒక సినిమా ఆడనంత మాత్రాన ఇక సినిమాలనే తీయకూడదని కాదు’’ అని వారికి విడమరిచి చెప్పవలసి వచ్చింది.


