
అమెరికాలో బ్రిటన్ రాయబారిగా ఇటీవల ఉద్వాసనకు గురైన పీటర్ మ్యాండెల్సన్
కామెంట్
బ్రిటిష్ వార్తలు అమితా సక్తితో చదివే వారైతే తప్ప మీకు పీటర్ మ్యాండెల్సన్ ఎవరో తెలిసే అవకాశం లేదు. ఆయన మూడుసార్లు ఉన్నత ప్రభుత్వ పదవి అలంకరించి, ఆ మూడు సార్లూ ఎంతో అవమాన కరంగా వైదొలగిన వ్యక్తి. నాకు తెలిసిన అలాంటి రాజకీయవేత్త ఆయన ఒక్కడే! చివరిసారి, అమెరికాలో బ్రిటన్ రాయబారి పదవి నుంచి సెప్టెంబర్ 11న డిస్మిస్ అయ్యాడు. ఎంతో కష్టపడి అధిరోహించిన విజయ శిఖరం నుంచి అమాంతం జారిపోయాడు. ఇది ఆయనకు కొత్తేం కాదు. అయితే ఎందుకిలా జరుగు తోంది? ఈ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేస్తోంది. ఒకానొకప్పుడు ఆయన నాకు మంచి మిత్రుడు.
సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో దోస్తీ ఆయన తాజా ఎపిసోడ్‌కు ముగింపు నిచ్చింది. రాయబారిగా నియమితుడయ్యే సమయంలో ఈ మైత్రీబంధం ఎలాంటిదో ఆయన వివరించినట్లు లేడు. 18 ఏళ్లు నిండని బాలికను వ్యభిచారానికి ప్రేరేపించినట్లు 2008లో నేరం రుజువు అయిన తర్వాత, తన ‘ప్రియ మిత్రుడు’ ఎప్‌స్టీన్‌కు అదే ఏడాది జూలైలో పీటర్ ఒక లేఖ రాశారు. ‘‘నీ ప్రపంచం గురించి ఆలోచించాను. జరిగిన దానికి నాకు కోపం వస్తోంది, నిరాశా కలుగుతోంది’’ అని ఈ లేఖలో ఉంది. ‘‘నీ మిత్రులు నీతోనే ఉంటారు, నిన్ను ప్రేమిస్తారు’’.ఈ లేఖ బయట పడిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకు ఉద్వాసన పలికారు.
మళ్లీ మళ్లీ రాజీనామాలు
మ్యాండెల్సన్‌ను దురదృష్టం వెన్నాడటం ఇది మూడోసారి. డిసెంబర్ 1998లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ మంత్రి మండలిలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి దెబ్బ తిన్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రభుత్వ చెల్లింపుల ముఖ్య అధికారి’ (పే మాస్టర్ జనరల్) జ్యాఫ్రీ రాబిన్సన్ నుంచి 3,73,000 పౌండ్ల అన్‌సెక్యూర్డ్ రుణం తీసుకున్నట్లు బయటపడటంతో ప్రధాని ఆయనతో రాజీనామా చేయించారు.
ఇది జరిగిన రెండేళ్లలోనే పీటర్ మళ్ళీ ఉన్నత పదవి అలంకరించ గలిగాడు. ఈసారి ఉత్తర ఐర్లాండ్ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యాడు. శ్రీచంద్ హిందూజాకు బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించేందుకు అధికార దుర్వినియోగం చేశాడని ఆరోపణలు రావడంతో 2001 జనవరిలో మ్యాండెల్సన్ మళ్లీ రాజీనామా చేయవలసి వచ్చింది.
ఏమయినప్పటికీ, అంతటి దురదృష్టం కూడా పీటర్ రాజకీయ జీవితాన్ని అంతం చేయలేక పోయింది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కమిషనర్‌గా పని చేశాడు. ఆ తర్వాత గోర్డాన్ బ్రౌన్ కేబినెట్‌లో బిజినెస్ సెక్రటరీగా చేరాడు. ఫస్ట్ సెక్రటరీ(ఉప ప్రధాన మంత్రి)గా పదోన్నతి కూడా పొందాడు. ఆయనకు దేవుడి ఆశీస్సులు, సాతాను శాపాలు... రెండూ ఉన్నట్టుంది. ఒకరు శిఖరం మీదకు చేర్చితే, మరొకరు పాతాళానికి లాగేస్తారు.
నాకాయన తెలిసున్న రోజుల్లో ఇలాంటి ఆటు పోట్లు ఏవీ లేవు. అది 1980ల నాటి విషయం. ఆయన వయస్సు 30 పైన ఉంటుంది. మేం అప్పుడు లండన్ వీకెండ్ టెలివిజన్‌లో టీవీ ప్రొడ్యూసర్లుగా పని చేస్తున్నాం. బహుశా బ్రిటన్‌లో బాగా పేరు పొందిన ‘వీకెండ్ వరల్డ్’ కరెంట్ ఎఫైర్స్ అనే ప్రోగ్రామ్ చేసే వాళ్ళం. లెజెండరీ బ్రియాన్ వాల్డెన్ దానికి యాంకర్.
ఆ రోజుల్లో పీటర్ పొడవుగా సన్నగా ఉండి కులీనుడిలా కనబడే వాడు. పీటర్ తాత క్లెమెంట్ అట్లీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. కొంతమంది పీటర్‌ను అహంభావి అనుకునేవారు. మితభాషి కావడంతో ఆ అపవాదు వచ్చి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం... ఆయన అంత త్వరగా దగ్గరయ్యే మనిషి కాడు. చాలామందిని దూరంలో ఉంచేవాడు.
అప్పట్లో జరిగిన ఒక సంగతి చెబుతాను. ఏదో వివరించే ప్రయత్నం చేస్తూ, ఆ ఉత్సాహంలో పీటర్ తన కుడి చేతిని విసురుగా కదిలించాడు. అంతే... అది కాస్తా కాఫీ కప్పును తాకింది. కాఫీ ఒలికిపోయింది. నేను రాస్తున్న స్క్రిప్ట్ తడిసిపోయింది. అతడు చేసింది ఘోర తప్పిదం. ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేందుకు ఎంతో సమయం లేదు.
పీటర్ తక్షణం క్షమాపణలు చెప్పాడు. ఇరకాటంలో పడినందుకో, తన మీద తనకే వచ్చిన కోపంతోనో... ముఖం కందగడ్డ అయ్యింది. తనే టైప్ చేసి పెట్టాడు. పూర్తి చేసి ఇచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. టైప్ చేస్తూ కొన్ని మార్పులు కూడా చేశాడు. స్క్రిప్ట్ మరింత బాగా వచ్చింది.
విజయం ఆయన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అంత ఎత్తున నిలిచిన పీటర్‌ను నిశితంగా చూడగలిగినవారు, ఆయన ఆత్మీయ స్వభావం గుర్తించగలిగిన వారు... ఎంతమంది ఉంటారు? నేను మాత్రం ఆయన్ని ఆత్మీయ వ్యక్తిగానే గుర్తు చేసుకుంటాను. ఆయన ఎప్పటి లాగా ఉవ్వెత్తున ఎగిసి మరో విజయ శిఖరం అందుకుంటాడు... ఇది నా నమ్మకం. పీటర్‌ను మరోసారి అదృష్టం వరిస్తుందనీ, త్వరలోనే మేం కలుసుకుంటామనీ ఆశిస్తున్నాను.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్