
World Anaesthesia Day 2025 అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్ అరెస్ట్). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్‌లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్‌కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.
చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.
– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ
(అక్టోబర్ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం)