
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత న్యాయ వ్యవస్థలోని పలు కీలక అంశాలను స్పృశించారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ–సవాళ్లు, పౌరుల స్వేచ్ఛ మొదలు – రాజకీయాలతో ముడిపడిన కేసుల విచారణ సమయంలో, ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా యుగంలో న్యాయమూర్తులు ఎదుర్కొనే సంఘ ర్షణ వరకు వివిధ సున్నిత అంశాలపై లోతైన దృష్టి కోణాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఆవిష్కరించారు.
తాను రచించిన ‘వై ది కాన్ స్టిట్యూషన్ మేటర్స్’ అనే కొత్త పుస్తకంలోని విశేషాంశాల ఆధారంగాసాగిన ఈ ఇంటర్వ్యూలో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతనుజస్టిస్ చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ఆ సుదీర్ఘఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.
భిన్నాభిప్రాయాలపై ఫిర్యాదులు ఓ భయంకర ధోరణి!
మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అభిప్రాయ వ్యక్తీకరణకు సోషల్ మీడియా స్వేచ్ఛా వేదిక. అలాంట ప్పుడు భిన్నాభిప్రాయాలు తప్పవు. కానీ, ఏం మాట్లాడితే కేసు పెడతారోనని సంకోచించే పరిస్థితులు ఉన్నప్పుడు అవి అభిప్రాయ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతాయి. తద్వారా మాట్లాడే హక్కుకు భంగం కలుగుతుంది.
మన అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని, లేదా అనుకూలంగా లేదని ప్రత్యర్థులో, ప్రభుత్వమో భావిస్తే పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, సంకోచాలు ఇండియాకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యే! మరో వైపు ప్రజా క్షేత్రంలో సైతం అసహనశీలత ఎక్కువైంది. సాధారణంగా ఎవరైనా తమకు నచ్చిందే వినాలనుకుంటారు.
ఎవరో కార్టూన్ వేస్తేనో, లేక మరెవరో ప్రకటన జారీ చేస్తేనో, లేదంటే ప్రసంగిస్తేనో... అది ఎవరికో నచ్చకపోతేనో వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోని ఏ ప్రాంతంలోని వారైనా ఫిర్యాదు చేయవచ్చు. ఏకకాలంలో పది వేర్వేరు ప్రాంతాల నుండీ కేసులు నమోదు కావచ్చు. ఇది నిజంగా చాలా భయంకరమైన ధోరణి. మాట్లాడితే మిమ్మల్ని శిక్షించవచ్చు అనే భయం చాలా ఆందోళన కలిగించే విషయం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
విమర్శలను తప్పు పట్టలేం!
అభిప్రాయాలు వ్యక్తం చేసేవారికి కూడా బాధ్యత అవసరం. ముఖ్యంగా – సోషల్ మీడియా ద్వారా ద్వేషం, అసహనం వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మాటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మన సమాజం బహుళ మతాలు, సంస్కృతుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.
కాబట్టి స్వేచ్ఛా హక్కు ఉన్నా, మత భావాలను దెబ్బతీయకుండా మాట్లాడాలి. లేకపోతే చట్టపరమైన పరిణామాలు తప్పవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ఇందుకు ఉన్న సహేతుకమైన పరిమితులను వివరిస్తుంది. అయితే ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడాన్ని మాత్రం తప్పు పట్టలేం. ఇది సానుకూల ఫలితాలకే దోహదం చేస్తుంది.
చట్టాల పునఃసమీక్ష అవసరం
బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను పాలిస్తున్నప్పుడు చేసిన ‘దేశద్రోహం’ వంటి చట్టాలను నేడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ‘భారత్ ఒక దేశంగా నిలవగలదా?’ అని స్వాతంత్య్రానికి ఆరంభంలో సందేహాలు ఉండేవి. కానీ రాజ్యాంగ నిర్మాణం దేశాన్ని అత్యంత పటిష్ఠంగా ఉంచేలా జరిగింది. ఈ ఏడున్నర దశాబ్దాలలో భారత్ ఒక బలమైన, స్థిరమైన రాజకీయ వ్యవస్థగా అభివృద్ధిచెందింది. కాబట్టి అప్పటి చట్టాలను సమీక్షించాలి.
అలాగే ‘పరువు నష్టాన్ని’ క్రైమ్ పరిధి నుంచి తప్పించాలి. ఎందుకంటే, క్రిమినల్ డిఫమేషన్ గురించి కొత్త దృష్టికోణంతో పరిశీలించడం అవసర మనిపిస్తోంది. ఒకవేళ డిఫమేషన్‌ను క్రిమినల్ చర్యగా కొనసాగించాలంటే కొన్ని పరిమితులను తప్పక ఏర్పరచుకోవాలి. నేర స్వరూ పాన్ని కొత్తగా నిర్వచించాలి. మొత్తం ఈ చట్టాన్ని పార్లమెంట్ తిరిగి పరిశీలించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను.
ప్రజలూ రాజ్యాంగ పరిరక్షకులే!
భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా దృఢంగా నిలిచి ఉండటం గర్వకారణం. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడింది. ప్రధాన పీఠికకు ఎటువంటి భంగం కలుగకుండా పార్లమెంట్ ఎటూ సవరణలు చేస్తుంటుంది. కాలానికి తగ్గట్లు కోర్టులూ సూచనలు చేస్తుంటాయి. అందుకే రాజ్యాంగం సాధారణ చట్టం తరహాలో కాకుండా తరతరాల శాశ్వత విలువలను ప్రతిబింబిస్తుంది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు, రాజ్యాంగ ఫలితం దానిని అమలు చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కేవలం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలకూ రాజ్యాంగ పరిరక్షణలో బాధ్యత ఉంది.
గత తీర్పుల సమీక్ష సహజం!
మన పాలనలో లోపాలున్నప్పటికీ ఆ పాలనను పూర్తిగా తిర స్కరించాలనడం సరికాదు. విధానాల్లో అపసవ్యతలు ఉన్నప్పటికీ మన దేశం సాధించిన ఎన్నో విజయాలను కూడా గుర్తించాలి. హక్కుల సాధనలో మనం గొప్ప ముందడుగు వేశాం. ఇది మనం అంగీకరించవలసిన అంశం. అవసరాలకు అనుగుణంగా గత తీర్పుల సమీక్షలు ఎలాగూ జరుగుతుంటాయి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో ‘జీవించే హక్కు’ను తాత్కాలికంగా నిలిపే యవచ్చు’ అని ఏడీఎం జబల్పూర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఆ తర్వాత ఉపసంహరించుకోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏ సమాజ చరిత్రలోనైనా ఉంటుంది.
జైలు కాదు... బెయిల్ ముఖ్యం!
ఉపా (ఉగ్రవాద కార్యకలాపాలు), పీఎంఎల్‌ఏ (మనీ ల్యాండ రింగ్) వంటి కొన్ని నిరోధక చట్టాల విషయంలో బెయిళ్లకు చాలా కఠినమైన నియమాలు అమలవుతున్నాయి. ఇది ఒక సమస్యే. న్యాయవ్యవస్థలోని అసలు సూత్రం ఏమిటంటే.. ‘ఆరోపణ నిరూ పణ అయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషే’నన్నది.
జస్టిస్ కృష్ణ చెప్పి నట్లు.. ‘బెయిలు నియమం కావాలి, జైలు మినహాయింపు అవాలి.’ (బెయిల్ మస్ట్ బి ది రూల్.. జైల్ మస్ట్ బి ఎక్సెప్షన్ ). ఏదైనా కేసులో అరెస్టయిన వ్యక్తి ప్రతి వాయిదాకు, అవసరమైనప్పుడూ, కోర్టు ముందుకు హాజరయ్యే హామీ ఇస్తే బెయిల్ ద్వారా ఆ వ్యక్తిని తాత్కా లికంగా విడుదల చేయవచ్చు.
కోర్టులు వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి!
జస్టిస్ సూర్యకాంత్ ఒక ప్రతిష్ఠాత్మకమైన తీర్పు ఇచ్చారు. నిర్దిష్ట సమయంలో విచారణ ముగియకపోతే కఠిన చట్టాలు ఉన్నా బెయిల్‌ను మంజూరు చేయవచ్చు. ఉదాహ రణకు ఒక కేసులో 100 మంది సాక్షులు ఉన్నారు. వారందరి విచారణకు 5–7 సంవ త్సరాలు పడుతుంది.
ఈ కేసులో నింది తుడు చివరకు నిర్దోషిగా తేలితే అప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండటం అన్యాయం. అందుకే ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. సాక్షులను ప్రభా వితం చేసే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం జిల్లా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు అన్నిటి బాధ్యత.
బెయిల్‌పై భిన్నమైన తీర్పులు తగ్గాలి!
బెయిల్ మంజూరు విషయంలో భిన్నత్వం నిజమే. కానీ సుప్రీంకోర్టులో ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల కేసులు దాఖలవుతున్నాయి. 34 మంది జడ్జీలు ఒకే సారి ఒకే కేసును విచారించలేరు కనుక ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులున్న బెంచ్‌లుగా విభజించడం జరుగు తుంది. ఫలితంగా వ్యక్తిగత న్యాయమూర్తుల ఆలోచనల వల్ల తీర్పుల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయి.
అందువల్ల బెయిల్స్ విష యంలో భిన్నమైన తీర్పులు వెలువడవచ్చు. ఈ భిన్నత్వాన్ని తగ్గించ వచ్చు కానీ పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ విషయంలో మాత్రం ఏ బెంచ్‌కైనా ఒకే విధమైన ప్రాధాన్యత ఉండాలి. సుప్రీంకోర్టు నుండి హైకోర్టు లకు, అక్కడి నుండి జిల్లా కోర్టులకు ఈ సందేశం చేరాలి.
వెనకాడుతున్న జిల్లా కోర్టులు!
మన జిల్లా కోర్టులు బెయిల్ ఇవ్వాల్సిన కేసులలో కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా ఏమవుతోందంటే... జిల్లా కోర్టు ద్వారా బెయిల్ సాధ్యమయ్యే కేసులు కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తాయి. ఇందులో పలు ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. మొదటిది ఆలస్యం. జిల్లా కోర్టు నుండి హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకెళ్లేటప్పుడు తీవ్ర జాప్యం జరుగుతుంది.
రెండవది వనరులు. ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే వనరులు ఉండవు. వనరులు లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోవచ్చు. మూడవది ఇలాంటి వ్యవస్థ సుప్రీంకోర్టుపై అనవసర పనిభారాన్ని మోపుతుంది. ఇది భారతదేశంలోని సంక్లిష్టత, వైవిధ్యం, కేసుల పరిమాణాన్ని సూచిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంచడం
కంటే సుప్రీంకోర్టుకు వచ్చే కేసులను పరిమితం చేయడం అవసరం. ప్రభుత్వం అతి పెద్ద కక్షిదారు కావడం వల్ల కేసుల భారమూ అధిక మవుతోంది. కాబట్టి సంస్థాగత సమీక్ష అవసరం.
పదవీ విరమణ వయసు పెంచాలి!
న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు ఉండాల్సిందే. అయితే ఆ వయఃపరిమితిని పెంచవలసిన అవసరం కూడా ఉంది. అలాగని అమెరికా సుప్రీంకోర్టు తరహాలో న్యాయమూర్తులు ఎప్ప టికీ పదవిలో కొనసాగడమనే పరిస్థితి ఉండకూడదు. కొత్త తరానికి అవకాశం రావాలి.
ఇండియాలో ప్రస్తుత పదవీ విరమణ వయసు (జిల్లా జడ్జిలు 60, హైకోర్టు జడ్జిలు 62, సుప్రీంకోర్టు జడ్జిలు 65) తక్కువనే చెప్పాలి. సగటు జీవన ప్రమాణం పెరిగినందు వల్ల విరమణ వయసులనూ పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వేర్వేరు వయసులు ఉండకూడదు. అందరికీ సమానంగా 68 చేయాలి. దాని వల్ల సుప్రీంకోర్టుపై కేసుల ఒత్తిడి తగ్గుతుంది.