అభిప్రాయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతున్నదనేది సర్వసాధారణ అభిప్రాయం. స్థూలంగా చూసినపుడు అది సరైన అభిప్రాయమే. కానీ కొంత లోతులకు వెళ్లి పరిశీలించి నట్లయితే, అమెరికాయే సంక్షోభానికి గుర వుతున్నదనీ, ఆ స్థితి నుంచి కాపాడుకు నేందుకే ట్రంప్ ఇటువంటి విపరీత ధోర ణిని అనుసరిస్తున్నారనీ బోధపడుతుంది.
వందల సంవత్సరాల పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని గమనించినప్పుడు, అందులో పలు విధాలైన దుర్మార్గాలు కనిపిస్తాయి. హిట్లర్ వంటి వారు తీవ్రమైన మారణకాండకు కూడా పాల్పడ్డారు. కానీ, ట్రంప్ వంటి ఏ నియమ నిబంధ నలూ లేని సర్వతోముఖ అరాచక విజృంభణ ఏ దశలోనూ లేదు. ‘నాకు అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఏ నియమాలూ, చట్టాలూ లేవు. నా మనసుకు తోచింది చేస్తా’నని ఆయన బాహాటంగా ప్రకటిస్తూ, అందుకు తగినట్లే వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఏ సామ్రాజ్యవాదీ చేయలేదు.
అరాచకానికి కారణాలు?
అయితే ఇందుకు మూలకారణం ట్రంప్‌కు గల విలక్షణమైన అరాచక వ్యక్తిత్వం మాత్రమేనా? అమెరికా కొంత కాలంగా ఎదు ర్కొంటున్న రకరకాల తీవ్ర సమస్యలు, ఎదురు దెబ్బలు, ఇతరుల నుంచి సవాళ్ళు తీవ్రమైన ఒత్తిడులను, ఒక కొత్త చారిత్రక దశను సృష్టిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ కారణంగా, ప్రపంచంపై అమె రికా గత పాతికేళ్ళ ఏకధ్రువ ఆధిపత్యం స్పష్టమైన రీతిలో బీటలు వారుతున్నది.
పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే మరొక 15–20 సంవత్సరాలలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోవటం తథ్యమన్న భావన పాశ్చాత్య ప్రపంచం సహా ప్రపంచమంతటా ఏర్పడింది. వాస్తవానికి ఈ కోణం కొంతకాలంగా అందరూ చర్చిస్తున్నదే తప్ప కొత్తది కాదు. కానీ ఎందుకోగానీ, వెనిజులాపై ప్రళయ భీకరమన్నట్లు జరిగిన సైనిక చర్య, ఆ వెనువెంటనే ట్రంప్ ఇతర ప్రకటనలతో ప్రపంచం దృష్టి ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తక్షణ ఘటనలు, తదనంతర ప్రకటనలే సర్వస్వమన్నట్లు మారింది.
ఇంతకూ ట్రంప్‌ను ఈ ఆకస్మిక అరాచక ధోరణికి పురికొల్పిన నేపథ్య పరిణామాలేమిటి? 1991లో సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత అవతరించిన ఏకధ్రువ ప్రపంచానికి, సుమారు 15 సంవత్సరాలు గడిచేసరికి అదే రష్యా దేశం పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకుంటుండటంతో మొదటి సవాలు మొదలైంది.
అందుకే అమెరికా అధ్యక్షులందరూ వరుసగా యూరప్‌తో కలిసి ‘నాటో’ను విస్తరించటం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగా మరొకవైపు చైనా అదే కాలంలో మరొక సవాలుగా ఎదగసాగింది. ఇవి చాలదన్నట్లు అదే సమయంలో (2008) అమెరికాతోపాటు యూరప్ అంతా ఆర్థిక సంక్షోభానికి గురయింది. ఈ పరిణామాలు అక్కడి సమాజాలపై ప్రభావాన్ని చూపటంతో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం (2011) వచ్చి ఆ దేశాలను ఊపివేసింది.
పుండుపై కారం చల్లినట్లు చైనా, రష్యాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకో సాగాయి. ఆ పరిస్థితులకు జడిసిన అమెరికా తన సైనిక బడ్జెట్లను ప్రతి సంవత్సరం పెంచసాగింది. ఇదే క్రమం ఇపుడు తాజాగా ట్రంప్, ఆ బడ్జెట్‌ను ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలి యన్ డాలర్లకు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది.
రక్షణ బడ్జెట్ పైపైకి...
21వ శతాబ్దం వచ్చినప్పటి నుంచి అమెరికా పరిస్థితి ఏమిటో సూక్ష్మంగా అర్థం చేసుకునేందుకు బహుశా ఈ వివరణలు సరి పోతాయి. అమెరికా పతన క్రమం గురించి ఎంత తీవ్రమైన ఆందో ళన చెందకపోతే ట్రంప్ రక్షణ బడ్జెట్‌ను ఈ స్థాయికి పెంచజూస్తారు! యథాతథంగానే సుమారు 900 బిలియన్ డాలర్ల మేర గల ఈ బడ్జెట్, అమెరికా తరువాత వరుసలో గల తొమ్మిది దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అదిగాక ‘నాటో’ దేశాల బడ్జెట్లు ఉన్నాయి.
అవి ఆ మొత్తాలను రెట్టింపు చేయాలని ఇటీవల ఒత్తిడి చేస్తున్నారాయన. ప్రపంచ పరిస్థితులు తమకు వ్యతిరేకమవుతున్నాయనీ, తమ ఆధి పత్యం చేజారుతున్నదనీ, దాని అర్థం వివిధ దేశాల వనరులు, మార్కెట్లు, వాటిపై పరోక్ష రాజకీయ నియంత్రణలు చేజారటమనీ క్రమంగా ఎంతగా భయపడకపోతే ట్రంప్ ఇదంతా చేస్తారో ఆలో చించండి. అది కూడా తమకు ఎటు నుంచీ సైనిక ముప్పు లేనపుడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళికలో ఒక సంకేతం వంటిదే వెనిజులాపై దాడి.
అందువల్ల నిజమైన దీర్ఘకాలిక సంక్షోభం వెనిజులాది కాదు, ప్రపంచానిది కాదు. అది స్వయంగా అమెరికాది! అందుకు అనుబంధంగా యూరప్‌ది, ‘నాటో’ది, సామ్రాజ్యవాదానిది. ముఖ్యంగా సామ్రాజ్యవాద కూటమికి అధిపతిగా అమెరికాకు ఎదురవుతూ వస్తున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి జమిలి ప్రభావాన్నే మనమిపుడు చూస్తున్నాము. ఇదే కాలంలో ఇటువంటి ఇంకా పలు పరిణామాలు అమెరికాను భయపెట్టాయి. కరోనా (2020–22) సమస్యను అమెరికా ఎదుర్కొనలేక పోవటమే గాక ఆర్థికాభివృద్ధి దెబ్బతినగా, చైనా అందుకు విరుద్ధ ఫలితాలు సాధించటం వాటిలో ఒకటి.
ప్రపంచంలో అమెరికా అగ్రస్థానానికి ఆధారాలు... సైనిక బలం, ఆర్థిక బలం, శాస్త్ర–సాంకేతిక బలం, డాలర్ బలం, ప్రపంచ వ్యాప్తంగా గల రాజకీయ ప్రాబల్యం. వీటన్నింటికి చైనా, రష్యాల నుంచే గాక బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం కోసం పలు రూపాలలో జరుగుతున్న ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగు తున్నాయి. వాటిని నిరోధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఈ విషయాలు స్వయంగా అమెరికన్, యూరో పియన్ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులు
అంగీకరిస్తున్నవే!
అందుకే ఆక్రమణలు
అమెరికాతోపాటు పాశ్చాత్య సామ్రాజ్యవాద సంక్షోభమంటున్నది ఈ స్థితినే! దీనిని తట్టుకునేందుకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ఆరంభించి, పదవిని స్వీకరించిన తర్వాత గత ఏడాది కాలంలో కాలుగాలిన పిల్లి తరహా చర్యలు అనేకం ఇంటా బయటా, చివరకు మిత్ర దేశాలపైనా తీసుకుంటూ వస్తున్నారు.
ఆ ఫలితాలతో సంతృప్తి లేక, కనీసం పశ్చి మార్ధ గోళాన్ని, పశ్చిమాసియాను అయినా పూర్తిగా నియంత్రిం చేందుకు గత నవంబర్‌లో ‘జాతీయ భద్రతా వ్యూహపత్రం’ ఒకటి ప్రకటించారు. ‘మన్రో డాక్ట్రిన్’కు తోడు ‘డోన్రో డాక్ట్రిన్’ అంటూ లాటిన్ అమెరికాతో పాటు ఈ ప్రాంతాల వనరులన్నీ చేజిక్కించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా ఆక్రమణలూ ఇందులోకే వస్తాయి. అంతిమంగా ఈ భయకంపిత అరాచక చర్యలు అమెరికా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో పరిష్కరిస్తాయా అన్నది ప్రశ్న.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


