జాతి సేవలో మునుముందుకు... | Sakshi Guest Column On RSS chief Mohan Bhagwat | Sakshi
Sakshi News home page

జాతి సేవలో మునుముందుకు...

Sep 11 2025 12:37 AM | Updated on Sep 11 2025 12:37 AM

Sakshi Guest Column On RSS chief Mohan Bhagwat

నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ 75వ జన్మదినం

సందర్భం

ఈ రోజు సెప్టెంబరు 11... ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తు చేస్తుంది. మొదటిది... షికా గోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్టర్స్‌ అండ్‌ బ్రదర్స్‌ ఆఫ్‌ అమెరికా’ అన్న ఆయన పలకరింపు ఆ సమావేశ మందిరంలోని వేలాది ప్రేక్షకుల హృద యాలను పులకరింప జేసింది. భారత అజరామర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సార్వత్రిక సోదరభావన ప్రాధాన్యాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రెండోది... ఉగ్రవాద– తీవ్రవాద దుశ్చర్యల ఫలితంగా ఈ సౌహార్ద భావనను తుత్తు నియలు చేస్తూ సాగిన 9/11 నాటి భీకర దాడులు.

ఇదే రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది... ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు–సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)తో అనుబంధంగల లక్షలాది మంది ఆయనను సగౌరవంగా... ప్రేమాభిమానాలతో పరమ ‘పూజ్య సర్‌సంఘ్‌ చాలక్‌’ అని పిలుచుకుంటారు. అవును... నేను చెబుతున్నది శ్రీ మోహన్‌ భాగవత్‌ గురించే! ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన 75వ జన్మదిన వేడుక నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవం ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

మోహన్‌ భాగవత్‌ కుటుంబంతో నా అనుబంధం ఎంతో లోతైనది. ఆయన తండ్రి దివంగత మధుకర్‌ రావు భాగవత్‌తో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ అనుభవాన్ని నా రచన ‘జ్యోతిపుంజ్‌’లో విస్తృతంగా వివరించాను. న్యాయ వ్యవస్థతో తన అనుబంధంతో పాటు, దేశ ప్రగతి కోసం ఆయన తనను తాను అంకితం చేసుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దేశ పురోగమనంపై మధుకర్‌ రావు తపన ఎంతటిదంటే– తన కుమారుడు మోహన్‌  రావును భారత పునరుజ్జీవనం దిశగా కృషికి పురిగొల్పింది. మధుకర్‌ రావు ఒక పరుసవేది కాగా, మోహన్‌  రావు రూపంలో మరో ‘మణి’ని తీర్చిదిద్దారు.

తొలి అడుగులు
మోహన్‌ 1970 దశకం మధ్య భాగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ అయ్యారు. ‘ప్రచారక్‌’ అంటే– ఏదో ఒక సిద్ధాంతం ఆధారంగా
సంబంధిత ప్రబోధాలను ప్రచారం చేసే బాధ్యతగా కొందరు అపార్థం చేసుకోవచ్చు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పనితీరు గురించి తెలిసిన వారికి ‘ప్రచారక్‌’ అనేది సంస్థలో కీలక పని సంప్రదాయమనే వాస్తవం చక్కగా తెలుసు. గడచిన వంద సంవత్సరాలుగా దేశభక్తి ప్రేరణగా వేలాది యువత ‘భారతదేశమే ప్రధానం’ లక్ష్యంగా దాన్ని సాకారం చేసే దిశగా తమ జీవితాలను అంకితం చేశారు. ఇందు కోసం వారు ఇల్లూవాకిలీ సహా కుటుంబ బంధాలన్నిటినీ వదులు కుని దేశమాత సేవలో తరించారు.

ఆయన ‘ఆర్‌ఎస్‌ఎస్‌’లో ప్రవేశించిన తొలినాళ్ల సమయాన్ని భారత చరిత్రలో అంధకార యుగంగా అభివర్ణించవచ్చు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత క్రూర ఎమర్జెన్సీ విధించిన సమయ మది.  ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశం ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించే ప్రతి వ్యక్తీ దీన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో దూకడం అత్యంత సహజం. అదే తరహాలో మోహన్‌ సహా అసంఖ్యాక ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ స్వయంసేవకులు కూడా ఇలాగే చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో... ముఖ్యంగా విదర్భలో ఆయన విస్తృతంగా పనిచేశారు. తద్వారా పేదలు, అణ గారిన వర్గాల సమస్యలను ఆకళింపు చేసుకునే అవకాశం ఆయనకు లభించింది.

అనంతర కాలంలో భాగవత్‌ ‘ఆర్‌ఎస్‌ఎస్‌’లో వివిధ బాధ్య తలు నిర్వర్తించారు. ఆ యా విధుల నిర్వహణలో ఆయన అసమాన నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా 1990 దశకంలో ‘అఖిల భారతీయ శారీరక్‌ ప్రముఖ్‌’ అధిపతిగా మోహన్‌ పనిచేసిన కాలాన్ని చాలామంది స్వయంసేవకులు నేటికీ ఎంతో ప్రేమాభిమానాలతో స్మరించుకుంటుంటారు. ఆ సమయంలో ఆయన బిహార్‌ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ్‌ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. జనజీవనంలోని క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన అవగాహనను ఈ అనుభవాలు మరింత పెంచాయి. అటుపైన 20వ శతాబ్దారంభంలో ఆయన ‘అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌’గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2000లో ‘సర్‌కార్యవాహ్‌’ అయ్యారు.

ఈ రెండు పదవుల్లోనూ తనదంటూ ప్రత్యేక పనిశైలిని ఆచరణలో పెట్టారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సులువుగా, కచ్చితత్వంతో నిభాయించారు. ఆ తర్వాత 2009లో ‘సర్‌సంఘ్‌చాలక్‌’గా ఆర్‌ఎస్‌ఎస్‌ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అందరికీ ఉత్తేజమిచ్చే విధంగా పని చేస్తున్నారు.

ఈ పదవీ నిర్వహణ సంస్థాగత బాధ్యతను మించిన కర్తవ్యం. సంస్థ ఉద్దేశాలు, నిర్దేశాలపై స్పష్టత, భరతమాతపై అపార ప్రేమగల అసాధారణ వ్యక్తులు త్యాగం, అచంచల నిబద్ధతతో ఈ బాధ్యతలకు కొత్త నిర్వచనమిచ్చారు. మోహన్‌ భాగవత్‌ ఈ గురుతర బాధ్యతను అనితర సాధ్యంగా నిర్వహించడంతోపాటు స్వీయ శక్తిసామర్థ్యాలు, మేధస్సు జోడించి కరుణార్ద్ర నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా చూపారు. ‘దేశమే ప్రధానం’ అన్న సూత్రమే వీటన్నిటికీ ప్రేరణ!

ప్రత్యేక కార్యశీలత్వం
అవిచ్ఛిన్నత, అన్వయం... మోహన్‌ జీ మనఃపూర్వకంగా భావించిన, తన కార్యశైలిలో ఇముడ్చుకున్న ముఖ్యమైన అంశాలపై ఆలోచిస్తే ఈ రెండూ నాకు స్ఫురిస్తాయి. మనం గర్వించే సంస్థాగత భావజాల పరంగా రాజీపడకుండా, అదే సమయంలో మారుతున్న సామాజిక అవసరాలకూ అనుగుణంగా... సంక్లిష్టమైన అంశాల్లోనూ ఆయన సమర్థంగా సంస్థను ముందుకు నడిపారు. 

ఆయనకు యువతతో సహజమైన అనుబంధం ఉంది. ఎప్పుడూ పెద్ద సంఖ్యలో యువతను సంఘ్‌పరివార్‌లో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించారు. ఆయనెప్పుడూ బహిరంగ చర్చల్లో పాల్గొంటూ, ప్రజలతో సంభాషిస్తూ కనిపిస్తారు. నేటి గతిశీల, డిజిటల్‌ ప్రపంచంలో ఇది అత్యంత ప్రయోజనకరమైన అంశం. 

స్థూలంగా చెప్పాలంటే, వందేళ్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్థానంలో భాగవత్‌ జీ బాధ్యతలు నిర్వర్తించిన కాలం అత్యంత విప్లవాత్మక సమయమని చెప్పక తప్పదు. యూనిఫాంలో మార్పు నుంచి శిక్షా వర్గలలో (శిక్షణ శిబిరాలు) మార్పుల వరకు... ఆయన నేతృత్వంలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. 

మానవత్వం విపత్తుతో తలపడిన కోవిడ్‌ కాలంలో మోహన్‌ జీ కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జీవితకాలంలో మునుపెన్నడూ చూడని ఆ విపత్తు వేళ ఆర్‌ఎస్‌ఎస్‌ సాంప్రదాయక కార్యకలాపాల కొనసాగింపు సవాలుగా మారింది. సాంకేతికత వినియోగాన్ని పెంచాలని మోహన్‌ జీ సూచించారు. ప్రపంచవ్యాప్త సవాళ్ల నేపథ్యంలో... సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేస్తూనే, అంత ర్జాతీయ పరిణామాలనూ నిశితంగా పరిశీలించారు. 

స్వీయ రక్షణ చర్యలతోపాటు ప్రజా రక్షణను కర్తవ్యంగా భావిస్తూ.. ఆపన్నులను ఆదుకునేందుకు కోవిడ్‌ సమయంలో స్వయంసేవకులంతా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అనేక చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాం. కష్టపడి పనిచేసే స్వయంసేవకులను కూడా కోల్పోయాం. కానీ మోహన్‌ జీ స్ఫూర్తి వల్ల వారి దృఢ సంకల్పం ఎప్పుడూ సడలలేదు.

ఈ ఏడాది మొదట్లో నాగ్‌పూర్‌లో మాధవ్‌ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవం సందర్భంగా... ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక అక్షయవటం లాంటిదనీ, అది మన దేశ సంస్కృతినీ, సామూహిక చైతన్యాన్నీ శక్తిమంతం చేస్తుందనీ నేను వ్యాఖ్యానించాను. ఈ అక్షయవట మూలాలు లోతైనవి, బలమైనవి. ఎందుకంటే అవి విలువలతో కూడుకున్నవి. ఈ విలువలను పెంపొందించడానికీ, ముందుకు తీసుకెళ్లడానికీ మోహన్‌ భాగవత్‌ జీ అంకితభావంతో వ్యవహరించిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.

మోహన్‌ జీ వ్యక్తిత్వంలో మరో అద్భుత లక్షణం ఆయన మృదు భాషణం. ఆయన అందరి మాటా వింటారు. ఈ లక్షణం విస్తృత దృక్పథానికి నిదర్శనం. ఇదే ఆయన వ్యక్తిత్వానికి, నాయకత్వానికి శోభనిచ్చింది. 

పంచ పరివర్తన్‌
వివిధ ప్రజా కార్యక్రమాలపై ఆయన చూపించిన ఆసక్తి గురించి కూడా నేను రాయాలనుకుంటున్నాను. ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’ నుంచి ‘బేటీ బచావో బేటీ పఢావో’ వరకు.. ఈ కార్య క్రమాల్లో ఉత్సాహంగా భాగస్వామ్యం వహించాలని మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబానికీ ఆయన ఎప్పుడూ చెప్పేవారు. సామాజిక శ్రేయస్సు కోసం మోహన్‌ జీ ‘పంచ పరివర్తన్‌’ అందించారు. 

సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ అవగా హన, జాతీయ భావన, పౌర విధులు ఇందులోని అంశాలు. జీవితంలోని ప్రతి దశలో ఇవి భారతీయులకు స్ఫూర్తిని స్తాయి. బలమైన, సంపన్నమైన దేశాన్ని చూడాలని ప్రతి స్వయంసేవక్‌ కలలుగంటాడు. దాన్ని సాకారం చేయడం కోసం... స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణ రెండూ కావాలి. మోహన్‌ జీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి.  

భాగవత్‌ జీ ఎప్పుడూ ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ గురించి బలంగా చెప్తారు. భారతదేశ వైవిధ్యాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. దేశంలో భాగమైన అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఘనంగా చాటుతారు. 

తన షెడ్యూల్‌ వల్ల ఎంత బిజీగా ఉన్నా... మోహన్‌ జీ సంగీతం, పాటల వంటి అభిరుచులకు ఎప్పుడూ సమయం కేటాయించారు. వివిధ భారతీయ సంగీత వాయిద్యాలలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి అని కొద్ది మందికే తెలుసు. చదవడం పట్ల ఆయనకున్న మక్కువ ఆయన ప్రసంగాలు, సంభాషణలలో కనిపిస్తుంది.

మరి కొన్ని రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంవత్సరం విజయ దశమి, గాంధీ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి, ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు ఒకే రోజున జరగడం కూడా ఒక ఆనందకరమైన యాదృచ్చికం. భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న లక్షలాది మందికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. 

ఈ సమయంలో మోహన్‌ జీ వంటి తెలివైన, కష్టపడి పనిచేసే సర్‌ సంఘచాలక్‌ సంస్థను నడిపిస్తున్నారు. మనం అంతరాలకూ, హద్దులకూ అతీతంగా ఎదిగి, ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తే  సమాజంలో నమ్మకం, సోదరభావం, సమానత్వం బలపడుతుందని చాటిన మోహన్‌ జీ వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహ రణగా చెబుతూ నేను ముగిస్తున్నాను. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో మోహన్‌ జీ భరతమాత సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. 

నరేంద్ర మోదీ
భారత ప్రధాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement