మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది.
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్‌ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.
నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్‌ను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్‌ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి.
చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?
మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్‌ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ టి. సేవకుమార్
వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు
(రేపు ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ )


