ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించి,సామర్థ్యం, జవాబుదారీతనం, పని సంస్కృతిలో బాధ్యతను ప్రోత్స హించే విధంగా 8వ వేతన సవరణ సంఘం వేతనాలను సిఫార్సు చేయాలని... వేతన సంఘం నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భత్యాలు, అమలు చేస్తున్న షరతులను పరిశీలించి వాటి హేతుబద్ధీకరణకు సిఫార్సు చేయాలని గెజిట్ నిర్దేశించింది. ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించి, మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కొలమానాలు సిఫార్సు చేయాలని కోరింది.గెజిట్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎగిసిందని పాలకులు ప్రచారం చేస్తూ, ఆర్థిక అధోగతిని సూచించే ఆర్థిక జాగ్రత్తలను పాటించమని వేతన సవరణ యంత్రాంగానికి పరస్పర విరుద్ధమైన షరతులు విధిస్తున్నారు.
నిజానికి ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సిన బాధ్యత వేతన సవరణ యంత్రాంగానిది కాదు. వేతన సవరణ యంత్రాంగం ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక స్థితిలో జీవన వ్యయం వంటి అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలి. వారి మెరుగైన సిఫార్సులతోనే ప్రతిభావంతులైన యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపునకు ఆకర్షింపబడుతారు. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో సామర్థ్యం, జవాబుదారీతనం పెరుగుతాయి. ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లక్షలాదిమంది ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల అధీనంలో పనిచేస్తున్నారు. వీరందరికీ రెగ్యులర్ ఉద్యోగుల వలె వేతన భత్యాలు అమలు కావడం లేదు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఇక్కడ వర్తించడం లేదు. వేతన సవరణ సిఫార్సులు ఇటువంటి తాత్కాలిక ఉద్యోగులకు వర్తించవు. అటువంటప్పుడు సామర్థ్యం, జవాబుదారీతనం ఎలా సాధ్యమవుతాయి?
(100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద)
పైగా ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల తీరు, ప్రయోజనాలు, పని పరిస్థితులు కూడా పరిశీలించి, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సిఫార్సు చేయాలని మరో నిబంధన ఉంది. అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల శ్రమదోపిడీ ఎక్కువగాఉంటుంది. వేతనాలు తక్కువ. పని పరిస్థితులు అధ్వాన్నం. ‘ఉద్యోగుల ప్రయోజనాల కంటే యాజమాన్యాల ప్రయోజనాలకే’ అక్కడ ప్రాముఖ్యం ఉంటుంది. వాటితో కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులను పోల్చడం... ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లను తగ్గించడానికే! ఉద్యోగుల వాటా నిధులు లేని పెన్షన్ పథ కాల ఖర్చు తగ్గింపు మరో షరతు. పాత పెన్షన్ పథకంలో కొనసాగు తున్న కొద్దిమంది ఉద్యోగుల పెన్షన్‌ను, పాత పెన్షన్ పథకాన్ని ఆపడానికి ఈ షరతులను ప్రభుత్వం నిర్దేశించింది. పదేళ్లకోసారి జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవ రణ ఇప్పుడు 2026 జనవరి 1 నుండి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే 2025 ఆర్థిక బిల్లు ద్వారా ఉద్యోగుల పెన్షన్లను పెంపులేకుండా చూసే నిబంధనలను ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం, భవిష్యత్తులో వేతన సవరణ ద్వారా పెన్షన్ల పెరుగుదల లేకుండారంగం సిద్ధం చేసింది. ఆ మేరకే ఈ నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాబోయే వేతన సవరణ ద్వారా ఉద్యోగుల వేతనాల బిల్లు పెరగకుండా చూడటానికి వేతన సవరణ కమిషన్ నిబంధనల ద్వారా ముందు కాళ్లకు బంధం వేయడం గమనార్హం. (సహజీవనం నేర్చుకోవాలి..మానవత్వంతో వ్యవహరించాలి!)
– కె. వేణుగోపాల్
విద్యారంగ విశ్లేషకులు, టీపీటీఎఫ్


