
నేటి నుంచి అమలులోకి వస్తున్న జీఎస్టీ 2.0
అభిప్రాయం
సెప్టెంబర్ మాసం శుభాలను మోసుకొస్తుందని ఓ నానుడి. దానిని నిజం చేస్తూ దేశ ప్రజలకు మేలు చేసే రెండు తీపి పరిణామాలు జరిగాయి ఈ మాసంలో! ఒకటి – ఎంతో కాలంగా దేశ ప్రజలు కోరుతున్న జీఎస్టీ సంస్కరణలు. రెండు – భారత్–చైనాల మధ్య చిగురించిన మైత్రీ బంధం. వీటిని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తున్న దీపావళి బహుమతులుగా చెప్పడం గమనార్హం!
అమెరికా విధించిన అదనపు సుంకాల పుణ్యమా అని దేశంలో విని యోగ సంస్కృతిని... అది కూడా దేశీయ వస్తువుల వినియోగం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణను తీసుకువచ్చింది. నాలుగు శ్లాబుల్లో ఉన్న వస్తువులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ 2.0లో మూడు శ్లాబ్‌లకు కుదించారు. 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లలోకి దాదాపుగా అన్ని వస్తువులు వస్తాయి. సిన్ గూడ్స్ (పాపవు వస్తువులు)గా పేర్కొంటున్న సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం కోసం అత్యధికంగా 40 శాతం పన్ను విధిస్తారు.
కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీల వంటి లగ్జరీ గూడ్స్ కారుచౌకగా లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటు న్నాయి. భారీ వాహనాల మీద జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారుడికి రెండు విధాల ప్రయోజనం కలుగుతుంది. ఒకటి – వాహనం ధర తగ్గుతుంది. రెండోది – వాహనం ధర ఆధారంగా రిజిస్ట్రేషన్,బీమా (ఇన్సూరెన్స్) చార్జీలు ఉంటాయి కనుక వాహనం ధర తగ్గితే... ఆ దామాషాలో వాటి ఛార్జీలు కూడా తగ్గుతాయి.
ఇక, దేశంలో అత్యధిక శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గానికి, పేదలకు ఊరట కలి గించే అంశం... నిత్యావసరాల ధరలు తగ్గడం. బియ్యం, గోధుమలు, పప్పులపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ 18 శాతం కాగా, ప్యాకేజీలో ఉండేవి కాకుండా విడిగా లభించే ఈ వస్తువు లను కొంటే అవి 5 శాతం పరిధిలోకి వస్తా యని అంచనా వేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే జీఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారనీ, ఇది బీజేపీ గెలుపునకు బ్రçహ్మాస్త్రంగా పనికొస్తుందనీ ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.
రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా?
జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ 2.0పై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్ప టికీ... 4 రాష్ట్రాలు తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. తమకు నష్టపరిహారం చెల్లించాలని బెంగాల్, కేరళ,పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టాయి. కానీ మంత్రి ఆ రాష్ట్రాలకు సర్దిచెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వస్తు వినియోగం పెరుగుతుందనీ, దాని వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనీ వివరించారు. రాష్ట్రాలకు ఆదాయం చేకూరు స్తున్న రంగాలలో సిమెంటు, ఆటోమొబైల్, గ్రానైట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై అత్యధికంగా 18 నుంచి 28 శాతం జీఎస్టీ ఉంది. తాజాగా సవరించిన రేట్ల వల్ల ఈ రంగాల్లో రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో సుమారు 10 శాతం కోత పడనుంది.
చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నట్లుగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ 2.0 పరిధిలోకి తీసుకు రాకపోవడం సామాన్యుల్ని నిరాశపర్చేదే! పెట్రోల్, డీజిల్, విమానాల ఇంధనంగా వాడే టర్బైన్ ఫ్యూయెల్, సహజ వాయువులపై వివిధ రాష్ట్రాలు అత్యధికంగా 18 నుంచి 34 శాతం వరకు విలువ ఆధారిత పన్ను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే అదనంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూపాయి
నుండి రెండు రూపాయల మేర సెస్సు విధిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అధిక మోతాదు చక్కెరతో తయారు చేసే చాక్లెట్లు, కేకులు, మిఠాయిలపై జీఎస్‌టీ తగ్గించటం పట్ల ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతున్న దశలో, చక్కెర పదార్థాల ధరలు తగ్గే చర్యల వల్ల వాటి వినియోగం పెరిగి పిల్లల్లో చక్కెరస్థాయి నిల్వలు పెరుగుతాయని హెచ్చరి స్తున్నారు. ఇంకోవైపు బీడీ కార్మికులకు మేలు చేసే నెపంతో బీడీలపై జీఎస్టీ తగ్గింపు సరికాదంటున్నారు.
చైనాతో దోస్తీ... సానుకూలం!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక మార్గం మూసుకుపోయి నప్పుడు, మరో మార్గాన్ని ఏర్పరచుకోవాలన్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీ 2.0తో పాటు చైనాతో వాణిజ్య బంధాన్ని మెరుగుపర్చుకోవడం గొప్ప ఊరటనిస్తోంది.
‘అన్నీ మంచి శకునములే’ అన్నట్టుగా భారత్‌కు అమెరికాతో ఏర్పడిన సంక్షోభతో ప్రత్నామ్నాయ అవకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ సరళీకరణ వల్ల దేశీయ ఉత్పత్తుల వినియోగం తప్పనిసరిగా పెరుగుతుంది. అదేవిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం కారణంగా చైనా పెట్టు బడులు, సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలను సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా వడివడిగా అడుగులు వేయించాల్సిన బాధ్యత ప్రధానిదే!
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త మాజీ కేంద్రమంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు