దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే బిహార్ ప్రజలంతా సీఎంలు అయినట్లే!ఎల్లుండి, నవంబర్ 11న రెండో విడత పోలింగ్. 14న ఫలితాలు.
6న మొదటి విడత పోలింగ్ పూర్తయింది. నాన్నగారు, అమ్మ, నేను, రాజశ్రీ, భారతి అక్క, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఓటేసి వచ్చాం. తేజ్ ప్రతాప్ అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది.
నాన్నగారు తేజ్ అన్నయ్యను ఇంట్లోంచి, పార్టీ నుంచి వెళ్లి పొమ్మన్నాక తేజ్ అన్నయ్య వేరే పార్టీ పెట్టుకున్నారు. మాలో ఎవరితోనూ మాట్లాడటం లేదు. మొన్న పట్నా ఎయిర్ పోర్టులో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు కూడా తేజ్ అన్నయ్య ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు! నేను చాలా ఫీల్ అయ్యాను.
తేజ్ అన్నయ్య ‘జనశక్తి జనతా దళ్’ అనే పార్టీ పెట్టుకుని మహువా నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీలోని ‘జేడీ’ని అలాగే
ఉంచేసుకుని, ‘రాష్ట్రీయ’కు బదులుగా ‘జనశక్తి’ అని పెట్టుకున్నారు. అంటే పూర్తిగా పార్టీలోంచి వెళ్లినట్లు కాదు.
నేను పోటీ చేస్తున్న రాఘోపుర్, తేజ్ అన్నయ్య పోటీ చేస్తున్న మహువా... రెండూ వైశాలి జిల్లాలోనివే. నాన్నగారు, అమ్మ,
మా ఇద్దరి తలపై చేయి ఆన్చి వేర్వేరుగా మాకు ఆశీస్సులు అందించారు. అంటే అన్నయ్య పూర్తిగా ఇంట్లోంచి వెళ్లినట్లు కాదు.
ఎవరో అమ్మాయితో తను రిలేషన్‌లో ఉన్నట్లు తేజ్ అన్నయ్య ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతోనే వచ్చింది అసలు ఇదంతా!
పాపం వదిన ఆ రోజు ఎంతగా చిన్నబోయారో ఇంట్లో అందరం చూశాం. అమ్మ వదినను గుండెల్లోకి తీసుకుంది. నాన్న గారు తేజ్ అన్నయ్యను గట్టిగా మందలించారు. ‘‘వ్యక్తిగా నీతి తప్పిన వారికి సమాజం కోసం పోరాడే శక్తి తగ్గుతుంది’’ అన్నారు. ఇంట్లోంచి, పార్టీలోంచి అన్నయ్యను పంపించేశారు.
బయటికి వెళ్లి, కొత్త పార్టీ పెట్టగానే తేజ్ అన్నయ్య మొదట అన్నమాట... ‘‘మృత్యువునైనా ఆలింగనం చేసుకుంటాను కానీ తిరిగి ఆర్జేడీని ఆశ్రయించేది లేదు’’ అని! ఆ మాటకు నాన్నగారు, అమ్మ చాలా బాధపడ్డారు.
తేజ్ అన్నయ్య జేజేడీ పార్టీ 22 చోట్ల పోటీ చేస్తోంది. ఆ పార్టీ అన్ని చోట్లా గెలిచి, నేను సీఎం అవటానికి 22 సీట్లు తగ్గితే అన్నయ్య అప్పుడేమంటారో చూడాలి. 2020 ఎన్నికల్లో నేను సీఎం అవటానికి తగ్గింది 12 సీట్లే!
ఒంట్లో హుషారుగా లేక నాన్నగారు ప్రచారానికి రాలేకపోతున్నారు. కానీ, నాన్నగారి మాటలు నేరుగా ఇళ్లలోకే వెళ్లి పోతాయి. బిహార్‌లోని ప్రతి ఇల్లూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారి సత్తువ కలిగిన మాటలను రొట్టెల్లా పంచుకుంటుంది. నాకింకా ఆ ఒరవడి రాలేదు.
నితీశ్‌జీ ఇరవై ఏళ్లుగా బిహార్‌కు సీఎంగా ఉంటున్నారు. నాన్నగారు ఏమంటారంటే... ‘‘పెనం మీద రొట్టెను తిరగెయ్యకపోతే మాడిపోతుంది. ఇరవై ఏళ్లు అంటే చాలా ఎక్కువ సమయం’’ అని!
ఈ ఒక్క మాట చాలు, రోజుకు నేను పది ర్యాలీలు తీసి, పది ప్రసంగాలు చేసినంత!
ఇవాళ రాహుల్‌జీ పట్నా వస్తున్నారు. ఇవాళ జరిగే అన్ని ర్యాలీలలో ఆయన నా వెంట ఉంటారు.
ప్రచారానికి సిద్ధం అవుతుంటే... ‘‘చల్లగా ఉండు’’ అని నాన్నగారు, అమ్మ వచ్చి నన్ను దీవించారు. నాకు మిఠాయిలు తినిపించారు. అమ్మ నా నుదుటిపై ముద్దు పెట్టింది.
ఇంట్లోంచి నేను బయలుదేరుతుంటే... తేజ్ అన్నయ్య నుంచి ఫోన్... ‘‘హ్యాపీ బర్త్ డే రా తమ్ముడూ...’’ అని!!
నాన్నగారికి నెహ్రూజీ అంటే ఇష్టం. ఈసారి ఎన్నికల ఫలితాలు సరిగ్గా నెహ్రూజీ బర్త్‌డే రోజే వస్తున్నాయి. బిహార్ ప్రజలంతా సీఎంలు కాబోతున్న రోజు కూడా అదే!


