
న్యూ ఓర్లీన్స్‌లోని టులేన్ విశ్వవిద్యాలయ పట్టభద్రులను ఉద్దేశించి ‘ఆపిల్’ సంస్థ సీఈవో టిమ్ కుక్ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగ సంక్షిప్త పాఠం:
విశ్వగురు
హలో టులేన్! ఇక్కడి అన్ని విభాగాల సిబ్బందికీ అభివాదాలు. మీలో చాలా మంది మాదిరిగానే మా ఆపిల్ సంస్థలోని కొందరికి కూడా న్యూ ఓర్లీన్స్‌తో సన్నిహిత అనుబంధం ఉంది. ‘టులేన్ విశ్వవిద్యాలయ జట్టు’కు అభినందనలు అని అందరూ ముక్త కంఠంతో చెబుతూంటే ఒళ్ళు పులకరిస్తుంది.
ఇక్కడున్న వారితోపాటు మరో ముఖ్యమైన వర్గం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ వర్గంలోకి వస్తారు. మిగిలిన వారందరికన్నా కూడా వారు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించి, అండదండలను అందించి ఉంటారు. మీరు ఈ స్థితికి చేరడంలో వారు చాలా త్యాగాలను కూడా చేసి ఉంటారు. వారిని కూడా మన హర్ష ధ్వానాలతో అభినందిద్దాం. ఇదే నేనిచ్చే మొదటి సలహా.
వారు ఈ క్షణాల కోసం వేయి కళ్లతో ఎంతగా ఎదురుచూశారో గ్రహించి, ప్రశంసించేందుకు, మీకు జీవితంలో ఇంకా చాలా కాలం పట్టవచ్చు. వారు మీపట్ల బాధ్యతతో, ప్రేమతో వ్యవహరించిన తీరు, మీ మధ్య నున్న అనుబంధం మిగిలినవాటన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యం కలిగినవని మీకు తదనంతర కాలంలో తెలిసిరావచ్చు.
పది మందితో మెసలండి!
నిజానికి, నేను ఈ రోజు దాని గురించే మాట్లాడదలచు కున్నాను. స్వీయ జీవితాలను నమోదు చేసుకోవడంలో, అవీ ఇవీ పోస్ట్ చేయడంలో తలమునకలై ఉన్న ప్రపంచంలో, మనలో చాలా మందిమి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన బాధ్యత పైన మాత్రం తగినంత శ్రద్ధను కనబరచడం లేదు. ఇది తల్లితండ్రులతో మరింత టచ్‌లో ఉండటం గురించి చెబు తున్నది మాత్రమే కాదు. మీరు వారితో నెరపే సంబంధాలు వారిని మరింత సంతోష పరుస్తాయి.
అసలు, కలసికట్టుగా మనం మరింత ఎక్కువ సాధించగలమని గుర్తించడంతోనే మానవ నాగరకత ప్రారంభమైంది. మనం మరింత కలసికట్టుగా వ్యవహరిస్తే మనకెదురవుతున్న ముప్పులు, ఆపద లను నివారించుకోవచ్చు. మనం పంచుకుంటున్న కొన్ని సత్యాలను గుర్తించి సమష్టిగా పనిచేసినపుడు ఈ లోకంలో మరింత సంపద, సౌందర్యం, విజ్ఞత, మెరుగైన జీవితాలను సృష్టించగలుగుతాం.
ఈ పని సాధ్యం కాకపోవచ్చుననే సందర్భాలు జీవితంలో చాలాసార్లు ఎదురవుతాయి. కానీ, ప్రయత్నించి చూడటం కన్నా మరింత అందమైన, అర్థవంతమైన పని మరొకటి లేదని ఈ విశ్వ విద్యాలయం చాటుతుంది. ముఖ్యంగా సొంతానికన్నా నలుగురి మేలు కోసం ఆ పని చేయడంలో గొప్పదనం ఉందంటుంది.
నా మటుకు నన్ను... ఆ ఉన్నత పరమార్థ అన్వేషణే ఆపిల్ కంపెనీకి తీసుకొచ్చింది. క్యాంపాక్ అనే కంపెనీలో అప్పుడు కుదురైన ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్పట్లో ఎప్పటికీ ఆ సంస్థే అగ్ర స్థానంలో ఉంటుందనిపించింది. అప్పటికింకా మీరు కుర్రాళ్ళు కనుక, బహుశా ఆ సంస్థ పేరు కూడా గుర్తుండకపోయి ఉండవచ్చు.
కానీ, క్యాంపాక్‌ను విడిచిపెట్టి, దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీలో చేరవలసిందిగా స్టీవ్ జాబ్స్ 1998లో నాకు నచ్చజెప్పాడు. అది కంప్యూటర్లు తయారు చేస్తోంది. అప్పటికి, వాటిని కొనాలనే ఆసక్తి ప్రజల్లో లేదనే చెప్పాలి. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు స్టీవ్ దగ్గరో ఆలోచన ఉంది. నేనూ అందులో భాగం అయ్యాను.
ఐమ్యాక్, ఐపాడ్ లేదా ఆ తర్వాత వచ్చిన అలాంటి వస్తువుల గురించి కాదు చెప్పుకోవాల్సింది. జీవితంలోకి ఆ ఆవిష్కరణలు తేవడం వెనుకనున్న విలువల గురించి ముచ్చటించుకోవాలి. సాధా రణ ప్రజానీకం చేతిలో శక్తిమంతమైన సాధనాలను ఉంచాలనే ఆలోచన సృజనాత్మకత వెల్లివిరియడానికీ, మానవాళిని ముందుకు నడిపించడానికీ తోడ్పడింది.
చిక్కుముడులు విప్పండి!
ఇష్టమైన పని చేస్తూంటే అలుపనేదే తెలియదు అని సాధారణంగా చెబుతూంటారు. కానీ, ఆ మాటల్లో సారం లేదని ‘ఆపిల్’లో గ్రహించాను. అంతలా పనిచేయడం సాధ్యమేనని మీరు ఎన్నడూ ఊహించనంతగా, శ్రమపడి పని చేయాల్సి ఉంటుంది. ఎటొచ్చీ ఇష్టంతో పనిచేస్తే, మీ చేతుల్లోని ఉపకరణాలు తేలికవుతాయి, అంతే!
ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు కనుక ఓ సంగతి చెబుతా. పరిష్కారాన్ని కనుగొన్న సమస్యలపైన మీ సమయాన్ని వృథా చేయకండి. ఇది ఆచరణసాధ్యమని ఇతరులు చెప్పిన దానికే పరిమితం అయిపోకండి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకే మీ నౌకను నడిపించండి.
ఇతరులకు మరీ పెద్దవిగా కనిపించే, వారు మనకెందుకులే అనుకొనే చిక్కుముడులను విప్పేందుకూ, జటిలమైన పరిస్థితుల్లో పనిచేసేందుకూ మొగ్గు చూపండి. మీ జీవిత పరమార్థాన్ని అటువంటి చోటే కనుగొనగలుగుతారు. మీ సేవలను అక్కడే ఎక్కువ అందించగలుగుతారు.
‘అతి జాగ్రత్త’కు పోకండి!
ఏ పని చేసినా ‘అతి జాగ్రత్త’తో చేయాలనుకోవడం కూడా పొరపాటే! ఉన్నదున్నట్లుగా చేస్తూ పోతే, మీ కాలి కింద భూమి కదలకుండా ఉంటుందనుకోకండి. యథాతథ స్థితి కలకాలం ఉండదు. ఏదైనా మెరుగైన దాన్ని నిర్మించడంపై పనిచేయండి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మా తరం మిమ్మల్ని తప్పుదోవ పట్టించింది. పనుల్లోకి దిగకుండా చర్చలతోనే మేం చాలా సమయాన్ని గడిపేశాం.
ప్రగతిపై కాక పోరాటంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాం. మా వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు మీరు ఎక్కువ వెతకాల్సిన పని లేదు. గత 100 ఏళ్ళలో చూడని ప్రకృతి వైపరీత్యాలతో వేలాది మంది నిరాశ్రయులు అవడాన్ని మనం చూస్తున్నాం. వాతావరణ మార్పు గురించి మాట్లాడుకోకుండా, వ్యక్తులుగా మనం ఒకరి పట్ల ఒకరం ఎలా బాధ్యతతో మెలగవలసి ఉందో మాట్లాడుకోగల మని నేను అనుకోవడం లేదు.
మీతో విభేదించేవారిని నేలమట్టం చేయడం ద్వారానే మీరు బలవంతులు అనిపించుకోగలుగుతారని లేదా అసలు వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వవద్దని నమ్మబలికేవారు కొందరుంటారు. వారి మాయలో పడకండి. అవి కొత్త ఆలోచనలు పుట్టనివ్వవు. కొత్త దారులు వెతకనివ్వవు. మాటవరుసకు వినడం కాకుండా, చెవికెక్కించుకునే విధంగా ఆలకించడాన్ని అలవరచుకోండి. కేవలం పని చేయడం కాదు, కలసిమెలసి పనిచేసే తత్వాన్ని ప్రదర్శించండి.
మన సమస్యలకు పరిష్కారాలు మానవ సంబంధాల నుంచే లభిస్తాయి. సంకల్ప శక్తితో దేన్నైనా ప్రయత్నించి చూడండి. మీరు సఫలమూ కావచ్చు. విఫలమూ కావచ్చు. కానీ, ప్రపంచాన్ని నిర్మించడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోండి. మానవాళికి మెరుగైన వాటిని విడిచిపెట్టడం కోసం పనిచేయడం కన్నా మరింత అందమైనది ఏదీ లేదు.