
కథనం
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. అందు కోసం ఆయన విద్యార్థి దశ నుంచే కలలు కనేవారు. చివరకు, ఇరవై మూడేళ్లుగా తాను కంటున్న కలలు నెరవేరే అవకాశం ఆసన్నమైంది. నమ్మిన మామగారికి వెన్ను పోటు పొడిచి, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు 1995 ఆగస్టు నెల చివరి తొమ్మిది రోజుల్లో అనూహ్యమైన విధంగా వ్యూహాలు పన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులను ఉచ్చులోకి లాగారు. వామపక్షాలకు సైతం ఎరవేసి, తన వైపు తిప్పుకున్నారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా, ‘వెన్నుపోటు’ అనే పదమే మీడియాలో కనబడకుండా పావులు కదిపి, తన మామగారిని పదవి నుంచి దింపి, తాను అందలం అందుకున్నారు.
1995 ఆగస్టు 31 (గురువారం)
ఎన్టీఆర్ ఆగస్టు 31న విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీ నామా చేశారు. ఆ రోజు ఉదయం ఆయన ఆదేశాల మేరకు సీఎం కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ్ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. గవర్నర్ ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. రాజ్ భవన్‌కు వెళ్లేందుకు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ తన నివాసంలో బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ వంటి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడుతూనే ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను వెంటనే దగ్గరలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.
తనను ఆస్పత్రిలో కలుసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనను గవర్నర్‌కు చీఫ్ సెక్రటరీ రాజాజీ తెలియజేశారు. అందుకు అంగీకరించిన గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి, ఎన్టీఆర్‌ను పరామర్శించారు. ఎన్టీఆర్ ఆయనకు రాజీనామా లేఖ అందించారు. (అయితే తాను గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వ లేదనీ, మంచంపై ఉన్న తన చేతిలోంచి గవర్నరే లేఖను తీసుకు న్నారనీ ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన మాటలను న్యాయస్థానం, ప్రజలు విశ్వసించలేదు.)
కీలకమైన విశ్వాస తీర్మానం రోజున ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అభిమాను లనూ, మద్దతుదారులను విషాదంలో ముంచెత్తివేసింది. ధైర్యమే ఊపిరిగా, పోరాటమే నైజంగా తల ఎత్తుకుని బతికిన ఎన్టీఆర్ చివ రకు ఇలా అస్త్రసన్యాసం చేశారు.
ఆ మరుసటి రోజు, అంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా పదవులు చేప ట్టారు. వీరిలో హరికృష్ణ కూడా ఒకరు. (అప్పటికి శాసనసభలోగానీ, శాసన పరిషత్తులో గానీ ఆయన సభ్యుడు కారు. నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. అయితే హరికృష్ణ మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేని చంద్రబాబు ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి, హరికృష్ణ పోటీ చేసేందుకు వీలులేని పరిస్థితులు సృష్టించారు. దీంతో హరి కృష్ణ మంత్రి పదవి ఊడిపోయింది.)
పత్రికాధిపతి రామోజీరావు తన సతీమణితో కలసి ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ దంపతులను కలసి పరామర్శించారు. ఎప్పుడూ తెరవెనుకనే ఉండి కథ నడిపించే రామోజీరావు ఈసారి తెర ముందుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తననూ, తన భార్యనూ కించపరుస్తూ ‘ఈనాడు’లో కార్టూన్లు వేయించినా, తన ప్రతిష్ఠను మంట కలుపుతూ వార్తా కథనాలు ప్రచురించినా, అవేవీ మనసులో పెట్టుకోకుండా, రామోజీ దంపతులను ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
ఇంత జరిగినా ఎన్టీఆర్ తన బాధను బయటకు కనిపించ నివ్వలేదు. రోజులాగే మరునాడు తెల్లవారుజామునే లేచి దైనందిన కార్యక్రమాలు ముగించుకుని, తనను కలవడానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్ రావు, సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్‌లతో సమా వేశమయ్యారు. ఆ రోజు సెప్టెంబర్ 1. అప్పటికి ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రిగా చివరి రోజు.
అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసి ఉండాల్సింది: పాల్కీవాలా
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీవాలా... ఎన్టీరామారావుకు ఓ లేఖ రాశారు. అప్పటికి ఎన్టీఆర్ రాజీనామా చేసి రెండు వారాలైంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరినైనా ఆహ్వానించే అధికారం గవర్నర్‌కు ఉన్నా, అప్పటికే చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి అధ్యక్ష హోదాలో ఉన్న ఎన్టీఆర్ బహిష్కరించినందు వల్ల, అదే పార్టీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబును ఆహ్వానించటం చట్టరీత్యా తప్పని పాల్కీవాలా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ రద్దుకు ఎన్టీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందంతా ఒక ప్రహసనం, ఒక మోసమని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయ పడ్డారు. ఆయన ‘ది హిందూ’ దినపత్రికలో 1995 సెప్టెంబర్ 4న రాసిన ఒక వ్యాసంలో బ్రిటిష్ పార్లమెంటరీ రాజకీయ సూత్రాలనే మనం పాటిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.
‘ది హిందూ’ దినపత్రిక 1995 సెప్టెంబర్ 1న రాసిన సంపాద కీయంలో... తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబుకి ఉన్నప్పటికీ, అంతకు ఏడాది ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారన్న సంగ తిని ప్రముఖంగా ప్రస్తావించింది.
ఆగస్టు సంక్షోభం... ఉపసంహారం
ఎన్టీఆర్ జీవిత చరమాంకం ఎన్నో ఒడుదొడుకులకు లోనైంది. పిలిచి పిల్లనిచ్చి, పార్టీలో పదవులిచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే, అధికార దాహంతో అల్లుడు తనకే వెన్నుపోటు పొడవడాన్ని ఆ వృద్ధ నేత తట్టుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి జవ జీవాలు ఊది, అఖండ విజయంతో అధికారంలోకి తీసుకువస్తే, చివరకు ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతం పార్టీలో ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను కన్నీరు పెట్టించింది. ఇక లక్ష లాది అభిమానుల సంగతి వేరే చెప్పాలా?
దేవులపల్లి అమర్
(స్వీయ రచన ‘మూడు దారులు’ నుంచి...)