
సందర్భం
భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాద దినంగా సెప్టెంబరు 1 మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి పెను మచ్చగా చంద్రబాబు సొంత మామని దించివేసి తనది కాని పార్టీకి అధ్యక్షుడైన రోజు ఇది. ముఖ్యమంత్రి పదవికి తనను తానే ప్రకటించుకున్న రోజు. 1995 సెప్టెంబరు 1ని ‘చీకటి దినం’ (బ్లాక్ డే)గా ఎన్టీఆర్ గారు ప్రకటించారు. ఈ ద్రోహాన్ని చూస్తే రాజకీయాలే సిగ్గుపడతాయి.
చంద్రబాబు ఏ కాంగ్రెసు పార్టీ అండ చూసుకుని 1982లో ఎన్టీఆర్‌ను ఓడిస్తానని శపథం చేశాడో మళ్ళీ అదే కాంగ్రెసు పెద్దల ప్రలోభాలకు తలొగ్గి వైస్రాయి హోటల్ డ్రామా నడిపించి భారత ప్రధాని కాబోయే వ్యక్తిని అడ్డుకున్నాడు. ఇతడికి రాజకీయ గురువు రామోజీరావు గారనే విషయం అందరికీ తెలుసు.
ఎన్టీఆర్ పదవిలో ఉంటే 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయ నెక్కడ ప్రధాని అవుతారోనని వెరచిన కాంగ్రెసు పెద్దలు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే... ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చెయ్యమని అడిగినా, వాళ్ళ మనిషి అయిన గవర్నర్ కృష్ణకాంత్ దానికి అంగీకరించ లేదు. అదే సమయంలో ఫోర్జరీ సంతకాలతో చంద్రబాబు ఎమ్మెల్యేలు పంపిన లేఖను అంగీకరించారు.
చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ్, అశోక గజపతిరాజు, కోటగిరి విద్యాధరరావు లను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే... ఆ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఎలా అధ్యక్షుడవుతాడు? పైగా నిస్సిగ్గుగా ఆగస్టు 27న పార్టీ నుండి ఎన్టీఆర్‌ను సస్పెండ్ చేశాడు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఉప ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికి ఆయనను తాను ముఖ్య మంత్రి అయ్యాక, తీరా బయటకు పంపేశాడు.
ఆగస్టు 26న వైస్రాయి హోటల్ దగ్గరకు వెళ్ళిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించటమనేది ఆయన్ని బతికుండగానే చంపేయటమే! చంద్రబాబు కుట్రల గురించి ఎన్టీఆర్ అప్పట్లో ‘వార్త’ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చంద్రబాబు పార్టీని అక్రమంగా లాక్కున్నాడనీ, ఇలాంటి విశ్వాస ఘాతకు డిని చరిత్ర క్షమించదనీ అన్నారు. ఇలాంటి ఘాతుకాల పరంపర చంద్రబాబు జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతని అబద్ధాలను పెంచి పోషించి ప్రజల మెదళ్ళలోకి బలవంతంగా ఎక్కించటానికి పెంపుడు కుక్కల్లా పచ్చమీడియా పనిచేస్తూనే ఉంది.
ఆనాడూ, ఈనాడూ ఎన్టీఆర్ మీదా, లక్ష్మీపార్వతి మీదా వేయించిన కార్టూన్లు చూస్తే ‘ఈనాడు’ ఒక విష పత్రిక అనిపించక మానదు. కేవలం అధికారం కోసం ఒకరు, అధికారాన్ని నడిపించే రిమోట్ కోసం మరొ కరు ఎన్టీఆర్‌ను దారుణంగా చంపేశారు. చరిత్రనే తల్ల కిందులుగా చేసే రాతలు రాశారు. నిజానికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవ్వకూడదనే కుట్రకు వీళ్ళు ఆజ్యం పోశారు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక నెలకో, రెండు నెలలకో వాజ్‌పేయి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు.
‘1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్‌గా నిలబడితే మా మద్దతు ఇస్తాము’ అనేది ఆ ప్రకటన. దీంతో కాంగ్రెసు వాళ్ళతోపాటు రామోజీకీ కన్నెర్ర అయ్యింది. తన చేతిలో కీలుబొమ్మలా ఆడే చంద్ర బాబును తెచ్చుకుంటే తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా ప్రభుత్వాన్ని నడిపించవచ్చనే దుష్ట పన్నాగానికి తెరతీశారు.
ఇన్ని అవమానాల మధ్య కూడా ఎన్టీఆర్ తలవంచలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అతని కుట్రలను, కుయుక్తులను ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో కాసెట్ ద్వారా బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో విలేఖరి ఎన్టీఆర్‌ను ‘మీ అల్లుడి గురించీ, అతని మోసాన్ని గురించీ మీరు తెలుసుకోలేక పోయారు. అతడి అవినీతిని గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఇన్నేళ్ళలో మీకు తెలియదా’ అని అడిగారు.
అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ ‘అతడొక మేకవన్నె పులి. వెనక గోతులు తీసేవాడిని, వెనక నుండి పొడిచేవాడిని తొందరగా గుర్తించలేం. అందులో అల్లుడి రూపంలో, నా ఇంట్లోనే ఉన్నాడాయె!. ఎలా గుర్తించగలం? తెలుసు కునేసరికి చాలా ఆలస్యమయ్యింది’ అన్నారు. కాళిదాసు చెప్పినట్లు– ‘విష వృక్షో2పి సంవర్ధ్య స్వయం / ఛేత్తుం అసాంప్రతమ్’ – విత్తనం నాటేటప్పుడు తెలియదు. అది చెట్టయ్యాక చేదు ఫలాలనిస్తుందని! అయినా మమకారంతో ఆ చెట్టును నరకలేము కదా! అతని దుర్మార్గాలు కొంత తెలిసినా చంద్రబాబు పట్ల నా ఉదాసీన వైఖరి ఇలాంటిదే’ అన్నారు.
చంద్రబాబు దుర్మార్గాలకు పరాకాష్ఠ (1996 జనవరి 17) ఎన్టీఆర్ పార్టీ డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చి ఆయనకు రూపాయి కూడా అందకుండా చెయ్యటం! పర్యవసానం ‘సింహగర్జన’ ద్వారా తన గర్జనను వినిపించి అల్లుడి దుశ్చర్యలనూ, దుర్మార్గాలనూ ప్రజల్లోకెళ్లి ఎండగట్టాలనుకున్న ఎన్టీఆర్ అదే రోజు రాత్రి మరణించారు. అలా చీకటి భూతాలకు బలి సమర్పించినట్లయ్యింది. ఆయన మరణం అరాచక శక్తులకు మరింత ఊతమిచ్చింది. ఎన్టీఆర్ పోరాటం మధ్యలోనే ముగిసిపోయింది. ఆయన ప్రాణాలు తీసిన చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అవే అబద్ధాలను, దుర్మార్గాలను పచ్చ మీడియా అండగా కొనసాగిస్తూనే ఉన్నాడు.
నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి