‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’ | ntr fans warning to MLA Daggubati Prasad | Sakshi
Sakshi News home page

‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’

Aug 26 2025 4:05 PM | Updated on Aug 26 2025 4:34 PM

ntr fans warning to MLA Daggubati Prasad

సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్‌లకు జూనియర్‌,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.

జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్‌గా  స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్.‌ జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement