
లోన్, పొదుపు సమయంలో ఇబ్బందులు తప్పవ్
డ్వాక్రా మహిళలను బెదిరించి బలవంతంగా తరలింపు
అయినప్పటికీ ఖాళీగానే చాలా బస్సులు, కుర్చీలు
సాక్షి, అనంతపురం: ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్ సభకు రానివారికి రూ.200 ఫైన్ వేస్తాం. లోన్ మంజూరు, పొదుపు సమయంలో ఇబ్బందిపడతారు’ అంటూ డ్వాక్రా మహిళలను బెదిరించి మరీ అనంతపురంలో ప్రభుత్వం బుధవారం నిర్వహించిన సభకు తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలపై వెలుగు యానిమేటర్లు, సీసీల ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో వారు అయిష్టంగానే సభకు వచ్చారు. అయినా, సీఎం చంద్రబాబుతో పాటు ఇతర నాయకుల ప్రసంగాలు వినకుండా అన్యమనస్కంగా కనిపించారు. ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్లిపోదామా అనే భావనతో ఉన్నట్లు అనిపించింది.
అనంతపురం రూరల్ మండలం పాపంపేట, మరికొన్ని ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల లీడర్లు అధికారులపై తిరగబడ్డారు. మాకు ప్రభుత్వం తరఫున పైసా లబ్ధి చేకూర్చలేదు. మేం సభకు ఎందుకు రావాలి అని నిలదీశారు. రాయలసీమలోని పాత ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడపల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినా సభకు అంతంతమాత్రమే హాజరయ్యారు. కొన్ని బస్సుల్లో అయితే నలుగురైదుగురు కూడా రాలేదు. చివరకు కూటమి పార్టీల కార్యకర్తలకు సైతం చాలావరకు డబ్బు, మద్యం, ఆహార పొట్లాలు ఇచ్చి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో తీసుకొచ్చారు. తప్పతాగిన ‘తమ్ముళ్లు’ సభా ప్రాంగణంలోనే చిందులు తొక్కారు.
మరికొందరు మద్యం మత్తులో సభకు రాలేక బస్సుల్లోనే ఉండిపోయారు. ఇక ట్రాఫిక్ మళ్లింపుతో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–44) గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతపురం నగరంలోనూ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగించడంతో ప్రజలు, వాహనదారులు అసహనానికి గురయ్యారు. సీఎం సభ ఉంటే మరీ ఇన్ని ఆంక్షలా? ఇంత ఓవరాక్షనా? అంటూ మండిపడ్డారు.