
- వైఎస్సార్‌సీపీకి బురద అంటించేందుకు కుట్రలు
- పథకం ప్రకారం ఏ1 జనార్థన్ రావుతో వీడియో రిలీజ్ చేయించారు
- జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్ రావు వీడియో ఎలా రిలీజ్ చేశాడు?
- నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వారంతా చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత సన్నిహితులు
- వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట
- సిట్ ఏర్పాటుతోనే ఈ వ్యవహారాన్ని నీరుగారుస్తున్నారనేది తేలిపోయింది
- :మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు మనోహర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు
తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌ను బయటకు తీసిందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల సహకారంతో టీడీపీ నేతలు నకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఈ బురదను వైఎస్సార్‌సీపీకి అంటించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని ధ్వజమెత్తారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్థన్‌రావుతో ఒక వీడియోను తీయించి, దానిలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పిండంతో ఈ కుట్ర బయటపడిందని అన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావు ఎలా వీడియో తీయగలడని, దానిని ఎల్లో మీడియాకు ఎలా చేర్చగలిగాడని వారు ప్రశ్నించారు. ఇంకా వారేమన్నారంటే..
టీడీపీ పెద్దల కుట్రలు పరాకాష్టకు..
కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి, దాన్ని ఎలాగైనా వైఎస్సార్‌సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్‌రావు వీడియో ఒకటి ఈ సాయంత్రం లీక్ చేశారు. నిజానికి ఆయన ఇప్పుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన వీడియో ఎలా బయటకు వచ్చింది? అంటే ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతోంది. ఈ కేసుపై నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు,
దీనిపై ‘సిట్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే, కేసును ఎలా నీరుగార్చబోతున్నారు? వైయస్సార్‌సీపీకి ఎలా అంటగట్టబోతున్నారు? అనేది తేటతెల్లమైంది. పైగా ఈ కేసులో లోతులోకి వెళ్లేసరికి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయన్న చంద్రబాబు మాట.. ఆయన కుట్రను బయట పెట్టింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే, కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్ రావు నోటి నుంచి వైయస్సార్‌సీపీ నేత జోగి రమేష్ పేరు పలికించి, ఆయన్ను ఈ కేసులో ఇరికించే పని మొదలు పెట్టారు. నిజానికి నకిలీ మద్యం తయారు చేస్తున్న, ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు జనార్థన్ రావు, జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు.. స్వయంగా చంద్రబాబు, నారా లోకేష్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్నారు.
కాబట్టే అంత పెద్ద రాకెట్ నడిపించారు. ఇంకా చెప్పాలంటే.. ముందు నుంచి మా పార్టీ చెబుతున్నట్లు ప్రభుత్వ, పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది, ఇది వాస్తవం. ఇదంతా టీడీపీ ప్రభుత్వం వచ్చాక, మొదలైన దందా. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని పట్టించడమే జోగి రమేష్ చేసిన నేరమా? ఆఫ్రికా నుంచి దర్జాగా పిక్నిక్ నుంచి తిరిగి వచ్చినట్లు జనార్థన్‌రావు రావడం.. అంతకు రెండు, మూడు రోజుల ముందు ఒక వీడియో రిలీజ్ చేసి, నకిలీ మద్యం తయారీలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడం.. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగింది. ఆఫ్రికా నుంచి దర్జాగా వచ్చిన జనార్థన్‌రావును గన్నవరం విమానాశ్రయం నుంచే ఎక్సైజ్ అధికారులు ఎక్కడికో తరలించారు. ఏం చెప్పాలో, ఎవరిపై నింద వేయాలో.. అన్నీ ఒక పథకం ప్రకారం ఆయన్ను ప్రిపేర్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో కంగారుపడ్డ చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైయస్సార్‌సీపీ ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం, కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడంతో భయపడిన, చంద్రబాబు నిన్న రాత్రి హడావిడిగా ప్రెస్‌మీట్ పెట్టి, చాలా విషయాలు మాట్లాడి, ఈ కేసులో వైయస్సార్‌సీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పినట్లు ఆరోపించి, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ హ్యాండెడ్‌గా అన్ని ఆధారాలతో దొరికినా, నకిలీ మద్యం తయారీ ఈ స్థాయిలో జరుగుతున్నా.. అందులో ప్రభుత్వ, పార్టీ పెద్దల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిందను వైయస్సార్‌సీపీపై వేయడం అత్యంత దారుణం హేయం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? భారత రాజ్యాంగ పరిధిలో ఈ రాష్ట్రం లేదా? ఇంత కంటే నిర్లజ్జగా అధికార దుర్వినియోగం ఎక్కడైనా ఉంటుందా? ఇవి దర్యాప్తు సంస్థలా? లేక చందమామ కధలు చెబుతున్నారా? బేతాళ కథలు అల్లడంలో సిద్ధహస్తులయ్యారు.
ఏ రాష్ట్రంలోనూ ఇంత దగుల్బాజీ వ్యవస్థ లేదు. చంద్రబాబు మాదిరిగా వ్యవస్థలను ఎవరూ నాశనం చేయడం లేదు. చట్టం, న్యాయం, కోర్ట్‌లు అంటే ఏ మాత్రం గౌరవం లేదు. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న నకిలీ మద్యం తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్థన్, సురేంద్రనాయుడు తదితరులపై కేసు నమోదు చేశారు. ఒక పథకం ప్రకారం ముందుగా మాట్లాడుకున్న తరువాత జనార్థన్ నాయుడిని దక్షిణాఫ్రికా నుంచి ఏపీకి రప్పించారు. ఎంత దర్జాగా ఆయన విదేశాల నుంచి ఏపీకి వచ్చారో కూడా ప్రజలు చూశారు. ఆ తరువాత ఒక కుట్రపూరితంగా ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియోతో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. జనార్థన్‌ను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.
12వ తేదీన కోర్ట్ కు రిమాండ్‌కు పెట్టారు. ఈ రోజు విడుదల చేసిన వీడియోలో 'నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌కు సంబంధం ఉందని, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబుకు చెడ్డపేరు రావాలని, తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి, ఊరూరా ఆ మద్యాన్ని సరఫరా చేయాలి' అని జోగి రమేష్ చెప్పినట్లుగా ఆ వీడియోలో చూపించారు.
మొలకలచెరువులో ఈ వ్యవహారం బయటపడిన తరువాత దాని డిపో ఇబ్రహీంపట్నంలో బయటపడింది. దీనిని కూడా తమకు అనుకూలంగా చేసుకుని మాజీ మంత్రి జోగి రమేష్ సలహా మేరకే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డిపోను ఏర్పాటు చేశారని, మొలకలచెరువు మద్యం తయారీ బయటపడిన వెంటనే, జోగి రమేష్ ఇబ్రహీంపట్నం లోని డిపో గురించిన సమాచారంను ఒక పథకం ప్రకారం లీక్ చేయించారంటూ జనార్థన్‌తో చెప్పించిన వీడియోను బయటకు విడుదల చేశారు. ఈ వీడియో గురించి పూర్తి వాస్తవాలు బయటపెట్టాలి. సిట్ దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ఎల్లో మీడియా ఈ వీడియోను ఎలా విడుదల చేసిందో చెప్పాలని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు.