
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. ఏపీలో విద్య, వైద్యం సంగతి పక్కకు పోతే మద్యం మాత్రం ఎక్కడ బడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. మద్యం పాలసీతో పేదల జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై విరుకుపడ్డారు. ‘
ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది.కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు తెచ్చారు. సాధారణ ప్రజలు తాగి రోడ్డున పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు విస్తృతంగా మద్యం పంపిణీ చేసి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. వీధివీధినా మద్యం షాపులే దర్శనమిస్తున్నాయి. చివరికి కిల్లీ కొట్లు, పచారీ షాపుల్లోనూ బెల్టుషాపులు పెట్టించారు

మద్యం మహమ్మారి పేద, మధ్య తరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు ఇచ్చి అక్కడే ఫుల్లుగా తాగమని లైసెన్స్ ఇచ్చారు. పేద కుటుంబాలను నాశనం చేయటమేనా చంద్రబాబు విజనరీ అంటే?, చంద్రబాబు అంటేనే మాయా ప్రపంచమని నిరూపిస్తున్నారు. 4,380 పర్మిట్ రూంలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం అమ్ముతున్నారు. మద్యం మీద ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమంతా చంద్రబాబు జేబులోకి వెళ్తోంది. జగన్ హయాంలో మద్యం ఆదాయం రాష్ట్ర ఖజానాకి చేరింది. చంద్రబాబు ప్రివలేజ్ ఫీజు పేరుతో రూ.1100 కోట్లు తమ నేతలకు దోచి పెట్టారు. కొత్తగా మరో 3,736 బార్లు టీడీపీ నేతల చేతుల్లో పెట్టారు. కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సిన షాపులను కూడా టీడీపీ వారికే కట్టబెట్టారు. చేసిన స్కాం బయట పడకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు’ అని టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.