
తాడేపల్లి : ఈనెల 9వ తేదీన నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటనలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిన క్రమంలో కన్నబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘జగన్ పర్యటనలో ఎలాంటి మార్పు లేదు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గాన వెళ్తారు. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా ఆగేదే లేదు. వాతావరణం బాగ లేకపోయినా హెలికాప్టర్‌లో వెళ్లమనడం ఏంటి?ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి ప్రభుత్వానికి తెలీదా?, విధ్వంసకర పాలన ఏపీలో జరుగుతోంది. జగన్ తెచ్చిన పథకాలను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తెచ్చారు. చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. తరతరాల వారికి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. 9న నర్సీపట్నం పర్యటనకు జగన్ వెళ్లబోతున్నారు.
జగన్‌ను చూసి ప్రభుత్వం వణికిపోతోంది. అందుకే రకరకాలుగా ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న జగన్ పర్యటనను అడ్డుకోవడం అంటే పోలీసుల చేతగాని తనమే. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించలేరా?, భద్రత కల్పించలేనప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రభుత్వం అంగీకరించినట్టే. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ పర్యటన కొనసాగుతుంది.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాంటప్పుడు హెలికాప్టర్ లో ప్రయాణం ఎలా సాధ్యం అవుతుంది?, జనం వస్తే రోప్ పార్టీలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా పర్యటనలు చేశారు. కందుకూరు, గుంటూరు, పీలేరులో తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం ఆయన పర్యటనలను అడ్డుకోలేదు. జగన్ ఎక్కడా మైకులు పెట్టి మాట్లాడే పోగ్రామ్‌లు లేవు. మెడికల్ కాలేజ్‌ను చూసి మీడియాతో మాట్లాడుతారు.
మధ్యలో ఎవరైనా జనం ఫిర్యాదులు ఇస్తే తీసుకుంటారు. జగన్ పర్యటనకు వెళ్లొద్దని నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి బెదిరింపులతో మమ్మల్ని అణచివేయలేరు. జగన్ ఎప్పుడు బయటకు వస్తున్నా ప్రభుత్వం ఆంక్షలతో చెలరేగిపోతోంది. అయినాసరే జగన్ పర్యటనను ఆపగలిగారా?, నర్సీపట్నం పర్యటన కూడా అలాగే కొనసాగి తీరుతుంది. పోలీసు అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి.జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రోడ్డుమార్గాన వెళ్తారు’ అని మరోసారి స్పష్టం చేశారు కన్నబాబు.
ఇదీ చదవండి:
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్