
తాడేపల్లి : టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబని, వ్యవస్థలను మేనేజ్‌చేసి సీఎం అయిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. అధికార కూటమి కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని, రాజ్యాంగ బద్ధంగా ప్రజల సమస్యలపై చర్చించే టైమ్ ఇవ్వమని అడుగుతున్నా చంద్రబాబు చలించడం లేదన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.
‘కాంగ్రెస్ నుండి వచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. భార్యతో రికమెండేషన్ చేయించుకుని టీడీపీలో చేరిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలు గెలిపించుకున్న ఎన్టీఆర్‌ని కుట్రతో పదవి నుండి తొలగించిన రోజు ఇది. అక్రమంగా పదవి పొందిన చంద్రబాబు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎలా పండుగ చేసుకుంటున్నారు?, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి రోజును పండుగ చేసుకోవాలంటున్న చంద్రబాబుకు మానవత్వం ఉందా?, అనాటి ఘోరం ఈనాటి తరానికి తెలియక పోవచ్చు. గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేల బలం చూపించకుండానే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. వెన్నుపోటుదారుడిని మహా నాయకుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు?, కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ దగ్గరకు కుట్రతోనే చేరారు. ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోజు చంద్రబాబుకు మద్దతు లేదు
ఆ తర్వాత మరిన్ని కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఏం జరిగిందో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయట పెట్టాలి. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని ఎన్టీఆర్ పదేపదే కోరినా స్పీకర్ యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని స్త్రీ లోలుడుగా ఎల్లోమీడియా చిత్రీకరించింది. కుటుంబ సభ్యులు కనీసం భోజనం కూడా పెట్టలేదు. సంప్రదాయాల ప్రకారమే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్వనాశనం చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టే ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉండనిచ్చారు

దేశ చరిత్రలో వెన్నుపోటు అనే పేటెంట్ చంద్రబాబుకే ఉంది. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇచ్చిన హామీలను అమలు చేయాలేనప్పుడు ఎందుకు ఇచ్చారు?, చంద్రబాబు అంటేనే ఫేక్ ఫేక్. రాజధాని రైతుల కడుపు కొట్టిన వ్యక్తి చంద్రబాబు. హైవే మీద నుండి రాజధానికి వెళ్లటానికి ఇప్పటికీ రోడ్డు లేదు ఎవరిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారు. తనలాగే తనకు కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమోనని చంద్రబాబు భయపడిపోతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే సూపర్ సిక్స్ సహా అనేక హామీల గురించి ప్రశ్నిస్తారని చంద్రబాబుకు భయం’ అని విమర్శించారు.