
విజయవాడ: టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును ఆ కేసులో నిందితుడితో చెప్పించడంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కస్టడీలో ఉన్న జనార్థన్‌రావుతో తన పేరును చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈరోజు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) విజయవాడ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యా బిడ్డల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఈ కథ మొత్తం చంద్రబాబుదేనని, సిట్ చీఫ్‌కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబే అందిస్తున్నారని మండిపడ్డారు.
‘జనార్ధన్ పిల్లల్ని వేధించి నాపై తప్పుడు కేసులు పెట్టించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పుడు కేసుల్లో ఇరికించారు.లైడిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ.. చంద్రబాబు మరి నువ్వు?. నకిలీ లిక్కర్ స్కాం కేసులో నా ప్రమేయం లేదు. నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. నా భార్య,పిల్లలతో తిరుమలకు వస్తా. చంద్రబాబు కూడా కుటుంబంతో తిరుమలకు రావాలి. అక్కడ నేను తప్పు చేశానని నువ్వు చెబితే నేను ఏ శిక్షకైనా సిద్దమే. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జనార్ధన్‌తో నా పేరు చెప్పించారు. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు. కృష్ణాజిల్లా నా అడ్డా. నేను ఇక్కడే ఉంటా. నాపై చేస్తున్న ఆరోపణల్ని మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు’ అని జోగి రమేష్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా