ఈవెంట్లపై జీఎస్‌టీ కన్ను
స్టార్ హోటళ్లపై దృష్టి
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఈవెంట్ల నిర్వహ ణపై వాణిజ్య పన్నుల శాఖ కన్ను పడింది. ఇప్పటి వరకూ తమ పరిధిలోకి, దృష్టికి రాని పలు రంగాల వైపు దృష్టి సారించింది. రోజరోజుకు దిగజారుతున్న ఆదాయంతో చంద్రబాబు సర్కార్ తల పట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదాయ వనరుల వేటలో తలమునకలైంది. అందులో భాగంగా ఆదాయం పెంచుకోవటం కోసం చంద్రబాబు ప్రభుత్వం తమ అధికార యంత్రాంగంతో కుస్తీలు పడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన విజయవాడ పరిసరాల్లో ఈవెంట్‌లను నిర్వహించే సంస్థలపైనా, వ్యక్తులపై దృష్టి పెట్టింది.
ఈవెంట్లపై వడ్డించాల్సిందే
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాపితంగా వివిధ సంస్థలు అధికారికంగా, అనధికారికంగా పలు సందర్భాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. దసరా, సంక్రాంతి, నూతన సంవత్సరం, దీపావళి పర్వదినాలకు నిర్వహించే ఈవెంట్ల వైపు అధికార యంత్రాంగా దృష్టి పెట్టింది. వాటి నుంచి వివిధ రూపాల్లో జీఎస్‌టీ వసూలు చేయటానికి కసరత్తు చేపట్టింది. తాజాగా త్వరలో నూతన సంవత్సరాది, సంక్రాంతి వేడుకలకు సంబంధించి వివిధ సంస్థలు ఈవెంట్లు నిర్వహించనున్నాయి. వాటి నుంచి ఎలా పన్ను రాబట్టాలనే అంశాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు దీనిపై తమ పరిధిలోని వివిధ సర్కిల్స్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లుగా సమాచారం.
ఈవెంట్‌పై 18 శాతం జీఎస్‌టీ
ఈవెంట్ మేనేజమెంట్‌కు సంబంధించి మొత్తం వ్యయంపై 18 శాతం జీఎస్‌టీని రాబట్టేందుకు నిబంధనలు వివరిస్తున్నాయి. ఆ మేర ఆలోచన చేసిన అధికారులు దీనిపై భారీగానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా. ఈ క్రమంలో ఇకపై జరిగే అన్ని ఈవెంట్లపైనా దృష్టి పెట్టి జీఎస్‌టీ వసూలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఒక ఈవెంట్ ఖర్చు సుమారుగా కోటి రూపాయలు ఖర్చయితే రూ.18 లక్షల మేర జీఎస్‌టీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఈవెంట్ మేనేజర్లు బెంబేలెత్తుతున్నారు. ‘ఇదేమి పన్నురా బాబూ?’ అని నోరెళ్లబెడుతున్నారు.
అనుబంధ విభాగాలపైనా..
ఈవెంట్ మేనేజమెంట్‌తో ముడిపడి ఉన్న అను బంధ విభాగాలపైనా జీఎస్‌టీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా స్టేజీ డెకరేషన్, విద్యుత్‌దీపాలు, క్యాటరింగ్ వంటి విభాగాలకు చెందిన నిర్వాహకులకు జీఎస్‌టీ ఇతర ప్రభుత్వ లైసెన్స్‌లు ఉన్నాయా? లేక అనధికారికంగా నిర్వహిస్తున్నారా? అనే విషయాలను సైతం సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఈవెంట్లలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరినీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ స్టార్ హోటల్స్‌పై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పెట్టి నట్లుగా సమాచారం. హోటల్స్‌లో వివిధ సంస్థలు ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని పన్ను రాబట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా రానున్న నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి ఎక్కడ వేడుకలు జరుగతాయో గమనిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఆయా వేడుకలకు ఎంత మేర టిక్కెట్‌ను పెడుతున్నారు. ఎవరెవరో భాగస్వాములవుతున్నారనే అంశాల ఆధారంగా పన్నును రాబట్టేందుకు చర్యలు చేపడతారని సమాచారం.
ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలపై ఆరా తీస్తున్న జీఎస్‌టీ
రూ.కోట్ల టర్నోవర్‌తో దసరా,
నూతన సంవత్సరం, సంక్రాంతి ఈవెంట్లు
వాటి నుంచి ఎటువంటి ఆదాయం లేదంటున్న జీఎస్‌టీ అధికారులు
రానున్న రోజుల్లో లోతుగా దృష్టి పెడతామంటున్న ఉన్నతాధికారులు
ఈవెంట్ మేనేజమెంట్ సంస్థలపై దృష్టి పెడుతున్నాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి ఉన్న అవకాశాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఏమి చెబుతున్నాయో వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆయా సంస్థలకు లైసెన్స్ ఉందా లేదా? అనేది చాలా ముఖ్యం.
– ప్రశాంత్‌కుమార్,
జాయింట్ కమిషనర్, విజయవాడ –1 డివిజన్


