జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చొరవ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చొరవ చూపుతున్నామని, పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2025లో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఒప్పందాలకు కార్యరూపమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలపై చర్చించి పటిష్ట ప్రణాళిక ప్రకారం కార్యాచరణకు ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసంబంధిత అంశాలపైనా సమావేశంలో చర్చించారు. విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్ల పరిధిలో ల్యాండ్ బ్యాంకు వివరాలతో సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని ఆర్డీఓలకు సూచించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించాలని ఆదే శించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, జిల్లా స్థూల ఉత్పత్తి వృద్ధి తదితర లక్ష్యాలకు అనుగుణంగా పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాంకో సిమెంట్స్, అమరావతి బోటింగ్ క్లబ్, నవతరం సినీ స్టూడియోస్ తదితర సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.


