అనువాద సాహిత్యం విస్తృతం కావాలి
విజయవాడ కల్చరల్: అనువాద సాహిత్యం విస్తృతం కావాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. అనువాద మిత్ర మండలి, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం ఆధ్వర్యంలో గవర్నర్‌పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యాయంలో మంగళవారం అను సర్వం 2025, అనువేదం, అనువాద గ్రంథాల ఆవిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ.. తెలుగులో అనంతమైన సాహిత్య సంపద ఉందని అది విశ్వవ్యాప్తం కావాలంటే అనువాదాల సంఖ్య పెరగాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన గోళ్ల నారాయణరావు అనువాదకురాలు దుట్టా శమంతకమణి సాహిత్య సేవలను వివరించారు. అనుస్వరం 2025ను శేషసాయి ఆవిష్కరించారు. అనువేదం గ్రంథాన్ని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఆవిష్కరించారు. అనువాద వెబ్‌సైట్‌ను విశ్రాంత కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. సాహితీవేత్తలు సత్యరంజన్ కె.గణేష్ రామ్, సీనియర్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మ పాల్గొన్నారు. జనవరి రెండో తేదీన విడుదల కానున్న ఘంటసాల బయోపిక్‌ను ప్రదర్శించారు.


