
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.
నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్‌రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్‌రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.
జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్‌లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.
నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్‌రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.