
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..
బాలాంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు(Farmer Balachari).. బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటోందని వాపోతూ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోయాడు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బాలాచారిని మీడియా కంట పడకుండా హిందూపురం వన్‌టౌన్ పీఎస్‌కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదిలా ఉంటే..
నియోజకవర్గ పర్యటనలో బాలయ్యకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆదివారం చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో ఆయన పర్యటించగా.. మహిళలు చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు. ఈ పరిణామంతో తనదైన శైలిలో ఏదో మాట్లాడుతూ.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనతో చర్చించి స్పష్టమైన హామీ ఇప్పిస్తామని చెబుతూ నిష్క్రమించారు.

ఇదీ చదవండి: వినూత వీడియోలిస్తే.. బొజ్జల బాగోతం బయటికి??