
కలకలం రేపిన రాయుడి సెల్ఫీ వీడియో
చర్చనీయాంశంగా మారిన సుధీర్‌రెడ్డి వ్యవహారం
కోట వినూతపై కుట్రలకు పాల్పడినట్లు ఆరోపణలు
డబ్బులు ఎరవేశారని వీడియోలో వెల్లడించిన డ్రైవర్ రాయుడు
విషయం బయటపడడంతోనే హత్యకు గురైన దళితుడు
రాజకీయాల్లో కొందరు నేతలు నైతిక విలువలను వదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు వదిలేసి జిత్తులకు దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం దిగజారుతున్నారు. ఇదే కోవలో జనసేన మాజీ నేత కోట వినూతపై ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పలు కుట్రలకు తెగబడినట్లు సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వినూత డ్రైవర్‌గా పనిచేసి హత్యకు గురైన రాయుడు తీసుకున్నట్టుగా చెబుతున్న సెల్ఫీ వీడియో జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. కోట దంపతులను టార్గెట్ చేసుకుని బొజ్జల తనకు డబ్బులు ఎరవేసినట్లు డ్రైవర్ స్పష్టంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేతల నడుమ పోరులో చివరకు సదరు దళితుడు బలి కావడం విషాదంగా మిగిలింది.
సాక్షి టాస్‌్కఫోర్స్ : జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కోట వినూత వద్ద డ్రైవర్‌గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన ఓ సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుదీర్‌రెడ్డిపై పలు ఆరోపణలు వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వినూత రహస్య సమాచారం, కొన్ని వీడియోలు సేకరించి అధిష్టానానికి చేరవేసి సు«దీర్‌రెడ్డి టికెట్ సాధించినట్లు శ్రీకాళహస్తి వాసులు చర్చించుకుంటున్నారు. బొజ్జల సు«దీర్‌రెడ్డి కారణంగా కూటమిలోని అనేక మంది నేతలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలోని ముఖ్య నేతలు టికెట్లు దక్కించుకునేందుకు ఒకరిని ఒకరు వెన్నుపోట్లు పొడుచుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శ్రీకాళహస్తి టికెట్ కోసం ఏకంగా హత్యా రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ద్వారా గుప్పుమంది. శ్రీకాళహస్తి అసెంబ్లీ టికెట్ కోసం కూటమి పారీ్టలోని బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కుమారుడు, బీజేపీ నేత కోలా ఆనంద్, జనసేన నేత కోట వినూత పోటీ పడిన విషయం విధితమే. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు.. ఆయా పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో మీడియా ముఖంగా వీధికెక్కారు.
నాడు టీడీపీ, జనసేన నేతల మధ్యే పోటీ
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పారీ్టల సీట్ల కేటాయింపుకు సంబంధించి శ్రీకాళహస్తి టికెట్ టీడీపీ లేదా జనసేనలో ఒకరికి ఇస్తారని ముందుగానే తేలిపోయింది. దీంతో కోట వినూతను లక్ష్యంగా చేసుకుని ఆమె డ్రైవర్‌ని కోవర్టుగా బొజ్జల సుధీర్‌రెడ్డి ఎంపిక చేసుకున్నట్లు రాయుడి వీడియో ద్వారా బయటపడింది. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకునేందుకు కూటమి నేతలు కోవర్టులను నియమించుకున్నారు. అందులో భాగంగా కోట వినూత విషయంలో బొజ్జల చాలా దూరంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
అందుకే డ్రైవర్ రాయుడుకి రూ.60 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు వీడియో ద్వారా వెలుగు చూసింది. అలాగే అనేక మందిని పావుగా వాడుకున్నట్లు వీడియో ద్వారా వెల్లడైంది. చివరకు కోట వినూత దంపతులను యాక్సిడెంట్ ద్వారా హత్య చేసేందుకు సైతం రెండు పర్యాయాలు యతి్నంచినట్లు రాయుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. రాజకీయ పోరులో దళితుడైన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురవడం అప్పట్లో సంచలనంగా మారింది. రాయుడు హత్యకు దారి తీసిన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఆరోపణలు నిజమేనా?
డ్రైవర్ రాయడు హత్య తర్వాత అరెస్ట్ అయిన కోట వినూత దంపతులు మీడియా సాక్షిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి పేరును ప్రస్తావించారు. రాయుడి హత్య వెను ఎవరి పాత్ర ఉందని మీడియా ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి పేరును వెల్లడించడం నాడు కలకలం రేపింది. అన్ని విషయాలను త్వరలోనే బయటపెడతామని చెప్పినట్టే.. నేడు రాయుడి వీడియో వైరల్ కావటం పెద్ద దుమారమే రేపుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి అధ్యక్ష పదవిని కొట్టే సాయికి కట్టబెట్టడం వెనుక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి హస్తం ఉందని కోట వినూత లేఖ ద్వారా ఆరోపించింది.
బొజ్జల సుదీర్‌రెడ్డికి టికెట్ కేటాయించడం వెనుక జనసేనలోని మరో నాయకుడు కొట్టేసాయి ఉన్నారని రాయుడు వీడియో ద్వారా తెలుస్తోంది. అదే విధంగా శ్రీకాళహస్తిలో పలువురు ప్రధాన భూమిక పోషించారని డ్రైవర్ వీడియో ద్వారా వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు బయటకు వస్తాయోనని కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.