
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు ఛార్జిషీట్‌లో అన్నీ కట్టు కథలేనని.. వేధింపులు, అబద్దపు వాంగ్మూలాలు తప్ప మరేమీ లేవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సారసీపీ నేతలను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే కుట్రతోనే సిట్ పని చేస్తోందని.. అనేక కుంభకోణాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మనోహర్‌రెడ్డి అన్నారు.
మద్యం కేసులో అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి కోర్టుకు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎల్లో మీడియా వలన తన కుటుంబం పడుతున్న ఆవేదనను కోర్టు ముందు పెట్టారు. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ఎల్లోమీడియా రాసే వార్తలే ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో కనిపిస్తోంది. మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాసే రాతల వలన మానసిక ఆవేదన చెందుతున్నట్టు కోర్టుకు చెప్పారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘జైలు పక్కన ఉన్న బిల్డింగుల మీద నుండి కొందరు మా ఫోటోలు తీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోటోలు తీస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అవినీతి మచ్చలేని ధనుంజయరెడ్డి సిట్ అధికారుల వేధింపులకు గురవుతున్నారు. ఛార్జిషీట్ టీడీపీ ఆఫీసులో రూపొందుతోంది. దానికి ఢిల్లీలో తుది మెరుగులు దిద్దుతున్నారు. లిక్కర్ స్కాం ఛార్జిషీట్‌లో మోకాలికి బోడిగుండుకు ముడి వేశారు.
..అబద్దపు వాంగ్మూలాలు, గాలి పోగేసిన వార్తలు, కాల్ డేటా తప్ప ఈ ఛార్జిషీట్‌లో మరేమీ లేదు. సిట్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు చూపలేదు. డిస్ట్రలరీ యజమానులను బెదిరించి, అబద్దపు వాంగ్మూలం తీసుకున్నారు. బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని మీద వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. చెవిరెడ్డి గన్‌మెన్లు గిరి, మదన్‌రెడ్డిలను సిట్ విపరీతంగా హింసించింది. మిథున్‌రెడ్డిది బలమైన రాజకీయ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని వేధిస్తున్నారు.
..ఛార్జిషీట్‌లో ఉన్నదంతా కట్టుకథలే. వైఎస్సార్‌సీపీ నేతల మీటింగులను కూడా మద్యం స్కాం కోసమే అంటూ కట్టుకథ అల్లారు. టార్గెట్ చేసుకున్న వ్యక్తులను అరెస్టు చేయటమే లక్ష్యంగా మద్యం కేసును నడుపుతున్నారు. తమకు కావాల్సినట్టు చెబితే సాక్ష్యులుగా, లేకపోతే దోషిలుగా చిత్రీకరిస్తున్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అనేక కుంభకోణాల్లో నిందితుడు. అన్ని అక్రమాలజు ఆయనే బిగ్ బాస్. ఐఎంజీ కేసులో బిగ్ బాస్ చంద్రబాబు. రాజధాని భూములు, ఫైబర్ నెట్, రింగురోడ్డు అలైన్మెంట్.. ఇలా అనేక అవినీతి, అక్రమాల్లో బిగ్ బాస్ చంద్రబాబే’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు.