
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్‌పేయి లాంటి వాళ్లు ఆయన గురించి ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు.
‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేది. ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా.
జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు లేదు.
తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్‌ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు.
ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె.
