
విశ్లేషణ
తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో 1995 ఆగస్టు సంక్షోభాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహం అనే కోణం నుంచి చర్చించడం జరుగుతూ వస్తున్నదే. ఆ పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇందులో రెండవ కోణం కూడా ఉంది. అది ఎందువల్లనో చర్చలోకి రావటం లేదు.
ఢిల్లీ స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా పరిశీలకుల దృష్టిలో గానీ ఎన్టీఆర్ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీ నాయకునిగా మిగలలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పలుకుబడిలో ఉండిన ఒక రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని మొదటి సారిగా సృష్టించి స్థిరపరచటం, తద్వారా రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరపరచటం వాటిలో మొదటిది. 1980ల నాటికి కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడుతూ దేశమంతటా ప్రాంతీయ శక్తులు బలపడు తున్న దశలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌ని ఆ వరసలోకి తేవటం అందరి దృషినీ ఆకర్షించింది.
తర్వాత, ఒక సినిమా నాయకుని పరిపాలన ఏ విధంగా ఉండగలదనే సందేహాలు కలుగుతుండగా ఆయన సంక్షేమ రాజ్యం, అప్పటికి 30 ఏళ్లకు పైగా సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే కాంగ్రెస్‌ను మించి ప్రజల ఆమోదాన్ని పొందటం, అందుకు ఆధారప్రాయమైన పథకాలు, అవి లోపరహితంగా అమలు కావటం, పేదలు చిరకాలపు దారిద్య్ర రేఖ నుంచి క్రమంగా బయటపడుతుండిన సూచనలు పరిశీలకుల దృష్టిని ఆకర్షించాయి.
మరో అంశం రాష్ట్రాల హక్కులకు సంబంధించిన ఫెడరలిస్ట్ వైఖరి. బలమైన ఫెడరలిస్ట్ వైఖరి తీసుకుంటూ ‘కేంద్రం మిథ్య’ అనే సాహసోపేత మైన ప్రకటనతో దేశంలోని ఫెడరలిస్టులందరినీ ఉలికిపడజేశారు. కాంగ్రెస్ అయితే ఆయనపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేవరకు వెళ్లింది. అయినా జంకలేదు. ఆయన రాజ కీయాలలో కొనసాగి ఉంటే కాంగ్రెస్ అనుసరిస్తుండిన యూనిటరిజానికి వ్యతిరేకంగా ఫెడరలిస్టు రాజకీయాలు మరెంతో బలపడి ఉండేవి.
కాకతాళీయంగా ఇందుకు కొనసాగింపుగా ఎన్టీఆర్ అధ్యక్షునిగా, వీపీ సింగ్ కన్వీనర్‌గా 1989లో ‘నేషనల్ ఫ్రంట్’ ఏర్పడి కేంద్రంలో అధికారానికి కూడా వచ్చింది. ఫ్రంట్ మేనిఫెస్టోలో రాష్ట్రాల హక్కుల అంశాలు అనేకం ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం... పరమ సాంప్రదాయికుడు కావటమే గాక కాషాయ వస్త్రధారిగా మారి విమర్శలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, అప్పటి ‘జనసంఘ్’ పట్ల వీపీ సింగ్‌తో పాటు పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకుని తనను తాను సెక్యులర్ వాడిగా ప్రకటించుకోవటం!
ఇవన్నీ ఎన్టీఆర్ వారసత్వంగా మిగిలి తెలుగువారి చరిత్రలోనే గాక దేశ చరిత్రలోనే మిగిలిపోయాయి. కాగా, ఈయనను దారుణమైన రీతిలో పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు విధానాలు ఏ విధంగా ఉండ వచ్చునని అందరూ ఉత్సుకతతో ఎదురుచూశారు. చంద్రబాబు అధికార గ్రహణ చేయడానికి మించి ఎన్టీఆర్ ఘనమైన వారసత్వానికి గ్రహణం కూడా పట్టిస్తున్నట్లు అందరికీ త్వరలోనే అర్థమైంది.
ఇండియా వంటి వర్ధమాన దేశంలో సామాన్య ప్రజల కన్నా ధనిక వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని భావించిన చంద్రబాబు, మొదటి నుంచే ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేశారు. కనీసం ఆ సిద్ధాంతం చెప్పే పెర్కొలేషన్ థియరీని అయినా పాటించక, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఒక్కటొక్కటిగా మంగళం పాడారు. సెక్యులరిజాన్ని వదిలేసి, అధికారం కోసం అవసరమైనప్పుడల్లా బీజేపీతో చేరుతూ అవకాశవాదిగా మారారు. ఫెడరలిస్ట్ శక్తులతో మైత్రి కూడా అదే విధమైన అవకాశవాదంగా మారింది.
ఈ విషయాలన్నింటినీ గమనించినపుడు, చరిత్రలో ఎన్టీఆర్, చంద్రబాబుల స్థానాలు ఏ విధంగా మిగిలేదీ ఎవరైనా ఊహించగలరు. ఈ విధంగా 1995 నాటి సంక్షోభమన్నది కేవలం అధికార రాజకీయాల సంక్షోభ చరిత్రగా కాక, అంతకు మించి విధానపరమైన సంక్షోభంగా కూడా మిగులు తున్నది. దేశ రాజకీయాలకు చంద్రబాబు కాంట్రిబ్యూషన్ అది.
ఒక మహానుభావుని ఆదర్శ రాజకీయాలు గాలిలో కలిసి, మరొక తరహా మహానుభావుని అధికార రాజకీయం రాజ్యమేలటం ఆ విధంగా మొదలైంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు