హిమాలయాల పెను హెచ్చరిక | Great warning from the Himalayas | Sakshi
Sakshi News home page

హిమాలయాల పెను హెచ్చరిక

Aug 30 2025 1:48 AM | Updated on Aug 30 2025 1:48 AM

Great warning from the Himalayas

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆగస్టు 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. ఈ తీవ్ర అవపాతం హార్షిల్‌ దగ్గరలోని ధరాలీ, హార్షిల్‌ లోని సైనిక స్థావరం వద్ద ఆకస్మిక వరదలను సృష్టించింది.  భారీ వర్షంతోపాటు మేఘ విస్ఫోటనం చోటుచేసుకుందని చెబుతున్నారు. అతి స్వల్ప కాలంలో అపారమైన వృష్టిని మేఘ విస్ఫోటనం అంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రకమైన పరి ణామం ఇదే మొదటిది కాదు. ‘హిందూ కుశ్‌ హిమాలయ’ (హెచ్‌కెహెచ్‌) ప్రాంతం ఇప్పటికే అనేక వైపరీత్యాలను చవిచూసింది. నేపాల్‌ లిమి కోనలోని టిల్‌ గ్రామంపై మే 15న వినాశకర మైన వరద విరుచుకుపడింది. తర్వాత, హిమానీ సరస్సు ఉన్న జలాశయ ఆనకట్ట తెగి రసువా–భోటేకోశీ నది ఆయకట్టును జూలై 8న వరద ముంచెత్తింది. 

జమ్ము–కశ్మీర్‌ లోని కిస్త్వార్‌ జిల్లాలో ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్‌ నది ఆరగాణి పొడవునా మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, రోడ్లు, జల విద్యుదు త్పాదన కేంద్రాల విభాగాలు కొట్టుకుపోవడంతో అనేక మంది నిరా శ్రయులయ్యారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దారిలో , ఆగస్టు 26న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చని పోయారు. అక్కడ కొండవాలు ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. వాటికి తీవ్ర వృష్టి తోడవుతోంది. వరదలకు లోనుకాగల సానువుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. 

జల బాంబులు
ఈ దుర్ఘటనలన్నీ, రకరకాల ఆపదల రాకను సమగ్రంగామదింపు చేసే (ఎంహెచ్‌ఆర్‌ఏ) వ్యవస్థ అవసరాన్ని మరోసారి చాటుతున్నాయి. అక్కడక్కడ విడి విడిగా ప్రమాదాలకు ఉన్న అవకాశాలనే కాకుండా , వాటి మధ్యన ఉండగల సంక్లిష్ట పరస్పర క్రియలను పరిశీలించేదిగా ఆ ప్రణాళిక ఉండాలి. అధిక వర్షపాతం కొండ చరియలు విరిగిపడటానికి, తదనంతరం, హిమానీ సరస్సు లకు గండిపడటానికీ దారితీస్తోంది. నీరు గడ్డకట్టిన ప్రాంతాలు, హిమం కరుగుతున్నాయి. 

ఈ జల ప్రవాహాలన్నీ కలసి లోయల్లో అస్థిరతను  మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. హిందూ కుశ్‌ హిమానీ నదాలు ఆందోళనకరమైన వేగాలతో తగ్గుతున్నాయి. ఇవి కరుగు తున్న వేగం, హిందూ కుశ్‌ నదుల ప్రవాహ వేగాల గతులను మార్చే స్తోంది. ఇవి ‘క్రయోస్పియర్‌ టైమ్‌ బాంబులు’గా తయారవు తున్నాయి.

సిక్కింలో 2023 అక్టోబర్‌ 3న సంభవించిన విపత్తు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది హిమానీ సరస్సుకు గండిపడటంతో వచ్చిన వరద బీభత్సమే కాదు. ఒక పరిణామం మరో పరిణామా నికి పురిగొల్పే సంక్లిష్టమైన ఉపద్రవం. ఒక పెద్ద హిమఖండం దక్షిణ లోనక్‌ సరస్సులోకి వచ్చిపడటంతో ఆ గొలుసు కట్టు ప్రక్రియ మొదలైంది. హిందూ కుశ్‌లో ఉపేక్షిస్తూ వచ్చిన జల ఘనీభవన స్థానాల కీలక పాత్రను అది తేటతెల్లం చేసింది. ఆర్కిటిక్‌ప్రాంతంలో శాశ్వత ఐసు గడ్డల గురించి విస్తృతమైన అధ్యయనాలు సాగాయి. హిందూ కుశ్‌ ప్రాంతంలో హిమ ఖండాలు కరగడంపై ఇటీవలి కాలంలో మాత్రమే దృష్టి సారించారు. హిమ ఖండాలు కరిగితే లోయలు అస్థిరమవుతాయి. అది కొండ చరియలు విరిగి పడటానికి కారణమవుతుంది. 

భూకంపాలకు హెచ్చరించినట్టుగానే...
ఏయేటి కాయేడు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న సంక్లిష్ట ఉపద్రవాల ద్వారా ప్రకృతి మనకు తరచూ హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాలను ప్రభావితం చేయగలిగిన నమూనాలు లేకపోలేదు. కానీ, వాటి కచ్చితత్వం పూర్తిగా ‘ఇన్‌ పుట్‌ డేటా క్వాలిటీ’పై ఆధారపడి ఉంటుంది. 

ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు, ఆపదలను తగ్గించుకునే వ్యూహాల రూపకల్పనకు మనం ఎత్తయిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి డేటా సమీకరణ చేపట్టాలి. అందుకు అత్యవసరంగా మరిన్ని నిధులను వెచ్చించవలసిన అవసరం ఉంది. గ్లేసియర్‌ ద్రవ్య రాశి సమతౌల్య కొలతలను నమోదు చేసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ రికార్డులను పదిలపరచుకుని పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. సరస్సుల పరిమాణాలను కచ్చితత్వంతో అంచనా వేసేందుకు సమగ్ర బాతీమెట్రిక్‌ సర్వేలు నిర్వహించుకోవాలి.

గ్లేసియర్‌ సంబంధిత వైపరీత్యాలు చెదురుమదురుగా ఉండటం అరుదు. అవి ఒకదానివెంట ఒకటి సంభవిస్తుంటాయి, సరిహద్దు లకు అతీతమైనవిగా తరచూ ఉంటాయి. ఎక్కడ వైపరీత్యం సంభ వించినా దాని చుట్టుపక్కల దేశాలన్నీ కష్టనష్టాలను అనుభవించక తప్పదు. కనుక, పటిష్టమైన ప్రాంతీయ సహకారం అనివార్యం. 

ప్రజలు లేదా మౌలిక వసతులపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదం సైతం పెను ఉపద్రవంగా మారుతుంది. కనుక, జనావాస ప్రాంతాల ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవై ఉండాలి. ముఖ్యంగా, ఎప్పుడుఎలాంటి జలవాయు పరివర్తనాలు చోటుచేసుకుంటాయో తెలియని హిందూ కుశ్‌ పర్యావరణాలలో వాటి అవసరం మరింత ఉంది. వైజ్ఞానిక మదింపులను ఆధారం చేసుకున్న ఆచరణ యోగ్యమైన విధానాలను మనం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. 

క్రయోస్పియర్‌ ప్రమాదకర మండలాల పటాన్ని తయారు చేయడం ఆ దిశగా వేసే ముఖ్యమైన అడుగు కావచ్చు. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం సంభవించగల ప్రాంతాలను గుర్తించే పటం మాదిరిగానే దాన్నీ రూపొందించుకోవచ్చు. ఎత్తైన ప్రాంతాల్లోనూ, గడ్డ కట్టిన సరస్సులు ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ మ్యాప్‌ మార్గం చూపుతుంది. ముఖ్యంగా ప్రవాహ దిగువ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట్ల, లేదా కీలకమైన మౌలిక వసతులు ఉన్నచోట ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. 

చివరగా, హై–రిస్క్‌ మండలాల్లో ఆదిలోనే హెచ్చరించగల వ్యవస్థలను నియోగించుకోవాలి. శిక్షణ ఇవ్వడం, మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడం ద్వారా ప్రజలను సన్నద్ధులను చేసే కార్యక్రమాన్ని పటిష్ఠపరచుకోవాలి. కొద్ది నిమిషాల ముందు హెచ్చరించినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

– మహమ్మద్‌ ఫారూక్‌ ఆజమ్‌ ‘ గ్లేసియాలజీ, హైడ్రాలజీ ప్రొఫెసర్, ఐఐటీ, ఇందౌర్‌
– శాశ్వతా సన్యాల్‌ ‘ ఇంటర్వెన్షన్‌ మేనేజర్, ఐసీఐఎంఓడీ(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement