సందర్భం
కేరళ రాష్ట్రానికి ‘దేవభూమి’ అనే పేరుంది. కేరళీయులు తమ రాష్ట్రాన్ని దేవుడి సొంతిల్లు (గాడ్స్ ఓన్ కంట్రీ) అని సగర్వంగా చెప్పుకొంటారు. ఇప్పుడు వాళ్లు సగర్వంగా చెప్పుకొనే మరో ఘనత కూడా వారి సొంతమైంది. నవంబర్ 1 నుంచి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించుకుని కేరళ చరిత్ర సృష్టించింది. కటిక పేదరికం తుడిచి పెట్టుకుపోవడం అన్నది ఓ స్ఫూర్తిదాయక విజయం.
ఎందుకంటే, దేశంలో అనేక రాష్ట్రాలో పేదరికం తీవ్రంగా ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఇది ఏకంగా 37%. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడింది. అప్పటి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం వరకు వామపక్ష పార్టీల కూటములు దాదాపు 40 ఏళ్లు అధికారంలో ఉంటే, మిగతా కాలం కాంగ్రెస్ కూటములు పాలన సాగించాయి. 1973–74 నాటికి కేరళలో పేద రికం 59.8%. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన కావాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
దేశంలో ఏ ఒక్క వ్యక్తీ ఆకలితో పస్తు పడుకోని విధంగా పాలన సాగించాలని గాంధీజీ చెప్పేవారు. అధికారంలో ఉన్నవారు ‘పేదరికం లేని సమాజం’ తమ లక్ష్యం అని ఘనంగా చాటుకొంటుంటారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో ఆ అడుగులు ఎంత వేగంగా పడ్డాయన్నదే ప్రశ్న!
అన్ని సూచికల్లో మిన్న
నిజానికి కేరళలో మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు భారీ పరిశ్రమల్లాంటివి కనిపించవు. అయినప్ప టికీ, మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికలలో అగ్రగామిగా నిలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన’లో 2021లో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆధ్యయన పత్రం ప్రకారం, అన్ని రాష్ట్రాలకంటే కనిష్ఠంగా 0.71%గా ఉన్నట్లు తేలింది. 2026 మార్చ్ నాటికి 0.002 శాతానికి చేరనుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి.
ఈ ఏడాది మార్చ్ నుంచి రాష్ట్రావతరణ దినోత్సవమైన నవంబర్ 1 నాటికి రాష్ట్రాన్ని ‘నో పావర్టీ స్టేట్’ (పేదరిక రహిత రాష్ట్రం)గా చేయాలని సంకల్పించి, ఆ లక్ష్యానికి అనుగుణంగానే ‘జీరో హంగర్’ (సున్నా ఆకలి) రాష్ట్రంగా తీర్చిదిద్దడం విశేషం. పినరయి విజయన్ ప్రాతి నిధ్యం వహిస్తున్న ‘ధర్మదాం’ నియోజక వర్గం ఇప్పటికే దేశంలో పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించ బడింది.
ఎలా సాధ్యమైంది?
కేరళలో తొలి నుంచి ప్రజాచైతన్యం ఎక్కువ. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, సంస్కరణోద్యమాలు ప్రజ లలో సామాజిక అంశాలపై అవగాహన కల్పించాయి. అక్కడ మొద ట్నుంచీ స్థానిక ప్రభుత్వాలు బలంగా పని చేస్తున్నాయి. స్థానిక సంస్థలకు ఉన్న 29 అధికారాలు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి బదిలీ చేయడం అన్నది దేశంలో ఒక్క కేరళలోనే జరిగింది.
ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలలో స్థానిక ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇస్తోంది. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 5,415 ఉన్నాయి. ‘స్త్రీ క్లినిక్స్’ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఎంతో జవాబుదారీతనంతో పేషంట్లను చూస్తారన్న పేరు తెచ్చుకొన్నారు.
మహిళల ప్రసూతి సమయంలో శిశువుల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి కాన్పులకు 5 మాత్రమే! జాతీయ సగటు ప్రతి వెయ్యికి 28గా ఉంది. రాష్ట్రంలో సగటు జీవిత వయస్సు 77.28 ఏళ్లుగా ఉంటే, జాతీయ సగటు 70.77. రక్షిత నీటిని అందించడం, పర్యావరణానికి అధిక ప్రాధాన్యం కల్పించడం, వైరస్‌లు, అంటువ్యాధులు వంటి వాటిని ఆదిలోనే సమర్థంగా ఎదుర్కోవడం వంటి చర్యల సామాన్య ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది.
పేదరికంపై యుద్ధం
పలు రంగాలలో అభివృద్ధి సాధనకు కేరళ అనుసరిస్తున్న విధా నాన్ని ‘కేరళ మోడల్’గా పిలుస్తారు. దీన్ని దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వివిధ రంగాలలో అనుసరిస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించడానికి 2021లో కేరళ ప్రభుత్వం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి, రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల సంఖ్య 64,006 అని గుర్తించింది. పేదరికం లెక్కింపునకు కుటుంబ ఆదాయం, వారు తింటున్న తిండి, ఆరోగ్య ప్రమాణాలు, సొంత ఇంట్లో ఉంటున్నారా లేక అద్దె ఇల్లా, సదరు ఇల్లు ఏ విధంగా ఉంది... ఇత్యాది అంశాలను ప్రామాణికంగా తీసుకొన్నారు.
ఈ కుటుంబాలలో చాలామటుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి లేవు. దీంతో, వారికి వెనువెంటనే కల్పించే సదుపాయాలతోపాటు దీర్ఘకాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి, వారికి రేషన్ అందేలా చేశారు. 4,000 కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. మరో 1,500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిలావస్థకు చేరుకొన్న వాటిల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మర మ్మత్తు కోసం రూ. 2 లక్షల సహాయం అందించారు.
కేరళ ప్రతి ఏటా 11 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దాదాపు మూడున్నర కోట్ల జనాభా గలిగిన కేరళ బడ్జెట్ ఏటా 12 శాతం వృద్ధితో సగటున 2 లక్షల కోట్లు దాటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్న రుణాలు కేంద్రం విధించిన పరిమితి అయిన స్థూల ఉత్పత్తిలో 3 శాతం మించకుండా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉంది కనుకనే, నేలవిడిచి సాము చేయకుండా ఏర్పరుచుకొనే నిర్దిష్ట లక్ష్యా లను నిర్ణీత కాలంలో పూర్తి చేయగలుగుతోంది.
అలాగని, పినరయి విజయన్ పాలనలో వైఫల్యాలు లేవా అంటే... ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకొంటే చాలానే కనబడతాయి. వ్యక్తిగతంగా ఆయనపై అనేక ఆరోప ణలున్నాయి. అయితే, కేరళ సాధించిన విజయాలను చూసినప్పుడు ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలను అభినందించాల్సిందే. పేదరికంపై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఈ ఘన విజయాన్ని భారతీయులందూ ఆస్వాదించాలి, స్ఫూర్తి పొందాలి.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి సభ్యులు


